శీతాలు సింగారం!

మంచు కురిసే వేళలో.. చలి అల్లికల్ని చీల్చుకుంటూ.. జోష్‌తో జాగింగ్‌ చేసేవారు కొందరైతే.. దుప్పటి ముసుగేసి వెచ్చగా నిద్రించేవారు ఇంకొందరు!! ఫిట్‌నెస్‌ ఫ్రీకర్స్‌ అయినా.. క్రేజీ మిలీనియల్స్‌ అయినా.. శీతాకాలానికి స్వీటీ ట్వీట్స్‌తో వెల్‌కమ్‌ చెప్పేస్తారు! చలి చలిగా అల్లింది.. గిలి గిలిగా గిల్లిందంటూ... వెచ్చని చిట్కాలతో సిద్ధం...

Updated : 31 Dec 2018 17:14 IST

మంచు కురిసే వేళలో.. చలి అల్లికల్ని చీల్చుకుంటూ.. జోష్‌తో జాగింగ్‌ చేసేవారు కొందరైతే.. దుప్పటి ముసుగేసి వెచ్చగా నిద్రించేవారు ఇంకొందరు!! ఫిట్‌నెస్‌ ఫ్రీకర్స్‌ అయినా.. క్రేజీ మిలీనియల్స్‌ అయినా.. శీతాకాలానికి స్వీటీ ట్వీట్స్‌తో వెల్‌కమ్‌ చెప్పేస్తారు! చలి చలిగా అల్లింది.. గిలి గిలిగా గిల్లిందంటూ... వెచ్చని చిట్కాలతో సిద్ధం అయిపోతారు! మరి, శీతాకాలం సింగారం సంగతులపై ఓ లుక్కేద్దాం పదండి!

శీతాలు సింగారం!

దయం 5గంటలు. అలారం మోగింది. వెళ్లాల్సింది యూద్ధానికేం కాదు. కానీ, నాగేష్‌ ఒక్కొక్కటీ తీసి ధరిస్తున్నాడు. ముందో క్రీమ్‌ వంటికి రాసుకున్నాడు.. ముఖానికి ఇంకోటి పూసుకున్నాడు. తర్వాత ట్రాక్‌ సూట్‌.. దానిపై ఓ స్వెట్టర్‌. అవి చాలవన్నట్టు తలకో మంకీ క్యాప్‌. జాకింగ్‌కి కదిలాడు. వెళ్లాడు. వచ్చాడు. ‘దీంట్లో కొత్తేముందీ. అందరూ చేసేదేగా’ అనుకుంటున్నారా? నిజమే. మరైతే, కొత్తగా శీతాకాలపు సింగారాన్ని మార్చేయాలంటే? ఇవిగో వీటిని ఫాలో అయిపోండి!

వామప్‌ అనివార్యం 

శీతాలు సింగారం!

‘ఇంత చలిలో ఏం వెళ్తాం. ఈ రోజుకి లైట్‌ తీసుకుందాం. రేపు చూద్దాం అనుకుంటూ..’ దుప్పటి ముసుగులోనే గడిపేస్తుంటారు ఎక్కువ శాతం యువత. దీంతో వింటర్‌లో బరువు పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ. అవుట్‌డోర్‌ వర్క్‌అవుట్స్‌ గురించే ఆలోచించక్కర్లేదు. చలికాలంలో ఇన్‌డోర్‌ వర్క్‌అవుట్స్‌ కూడా చేయొచ్చు. ఒకవేళ మంచు తెరల్ని ఛేదిస్తూ.. చలిపులితో జాగింగ్‌ చేయడంలోనే మజా ఉంది అనుకుంటే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా కాకుండా.. నిదానంగా వర్క్‌అవుట్స్‌ని స్టార్ట్‌ చేయాలి. శీతాకాలంలో వామప్‌కి ఎక్కువ సమయం కేటాయించడం చాలా ముఖ్యం. లేకుంటే కండరాలు పట్టేస్తాయి. ముందుగా శరీరానికి చలిని తరిమేసే వేడిని పుట్టించి.. అప్పుడు వేగం పెంచాలి.

ముందు కీళ్లను కదిలించాలి. దీంతో కీళ్లతో పాటు కండరాలు వదులవుతాయి. తర్వాత ఎన్ని రకాలుగా ఒళ్లును వంచినా ఇబ్బంది ఉండదు.

ఇంట్లోనే హుషారెత్తించేలా వర్క్‌అవుట్స్‌ చేద్దాం అనుకుంటే డ్యాన్స్‌ ఫిట్‌నెస్‌, ఎరోబిక్స్‌, జుంబా ఫిట్‌, యోగా... లాంటివి సాధన చేయొచ్చు. యోగాలో శ్వాసకి సంబంధించినవి చేస్తే మరింత ప్రయోజనం ఉంటుంది.

రోజులో కనీసం అరగంట.. వారానికి మూడు సార్లు అయినా వ్యాయామం చేస్తే మంచిది.     దీంతో చాలా వరకూ ఒత్తిడిని తరిమేయొచ్చు. ఉత్సాహంగా రోజు ప్రారంభం అవుతుంది.

ఇంట్లో చేసేందుకు తగిన కొన్ని సింపుల్‌ వర్క్‌అవుట్స్‌ కోసం https://goo.gl/nfmMjr లింక్‌ని చూడండి.

ఒంటరిగా కాకుండా ఫ్రెండ్స్‌ లేదంటే జీవిత భాగస్వామితో చేసే వర్క్‌అవుట్స్‌ మరింత ఉత్సాహాన్నిస్తాయి.

ఆఫీస్‌ వర్క్‌స్టేషన్స్‌లో వ్యాయామానికి తగిన వాతావరణ ఉంటే మీరు రోజూ సాధన చేసే ఆసనాల్లో కొన్ని చేస్తూ కండరాల్ని నిత్యం యాక్టివ్‌గా ఉండేలా చూడొచ్చు.

శ్వాస తీసుకోవడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చలికాలంలో శ్వాస ఎక్కువగా తీసుకోవడం చేస్తుంటారు. ఇక వ్యాయామంలోనైతే నోటితో ఎక్కువగా పీల్చేస్తుంటారు. కానీ, ముక్కుతోనే గాలిని పీల్చడం శ్రేయస్కరం. నోటి ద్వారా గాలిని తీసుకోవడాన్ని తగ్గించేందుకు పల్చటి బట్టని అడ్డుగా కట్టుకుని వర్క్‌అవుట్స్‌ని మొదలెట్టేయండి.

శీతాలు సింగారం!

కసరత్తులకు శరీరాన్ని అంటి పట్టుకుని ఉంటే ‘థర్మల్స్‌’ని లో దుస్తులుగా వేసుకోవాలి. వాటిపై మీకు అనువైన ట్రాక్‌సూట్‌ని వేసుకోవచ్చు. దీంతో శరీరంలో తగిన వేడి పుడుతుంది. వ్యాయామ సమయంలో టైట్‌గా ఉండే దుస్తులు ధరించడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ‘కంప్రెషన్‌ టైట్స్‌’ పేరుతో మార్కెట్‌లో దొరికే వాటిని ప్రయత్నించొచ్చు.

- బాబీ, ఫిట్‌నెస్‌ నిపుణుడు

శీతాలు సింగారం!

చలికాలంలో నిద్రలోనే కొన్ని సార్లు కండరాలు పట్టేస్తుంటాయి. దీనికి కారణం... శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం లేదంటే అతిగా వర్క్‌అవుట్స్‌ చేయడం. కొన్ని సార్లు తగినన్ని నీళ్లు తాగకపోయినా ఇలా కండరాలు పట్టేస్తుంటాయి. అందుకే దాహం వేయడం లేదని నీళ్లు తాగడం మర్చిపోవద్దు.

నిగనిగలు తగ్గకుండా..

శీతాలు సింగారం!

‘అమ్మా! ఉదయాన్నే నేను ముగ్గులేయలేను. చలికి బయటికి వస్తే నా ముఖం పగిలిపోతోంది.’ - అమ్మకు స్వప్న విన్నపం లాంటి హెచ్చరిక.

ఇలా యువతకు ఈ కాలంలో తమ చర్మాన్ని కాపాడుకోవడం ఓ పెద్ద సవాలు. మరి ఈ సవాలుకు సవాలు విసరాలంటే.. కొంచెం జాగ్రత్త అవసరమంటున్నారు డెర్మటాలజిస్టులు.

చలికాలం వచ్చిందంటే చర్మం పగిలిపోవడం, నల్లబడటం ఎక్కువగా జరుగుతుంది. దీన్ని అధిగమించడానికి యువత అనేక మార్గాలను అన్వేషిస్తుంటారు. తర్వాత మందులు రాసుకోవడం కంటే... ముందు జాగ్రత్త ఎప్పుడూ మంచిదే. అందుకే చలికి చర్మం ఎక్స్‌పోజ్‌ కాకుండా చూసుకోవడం ప్రాథమిక విధి.

యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా రాత్రి పూట బైకులు తోలుతారు. ఎంత హెల్మెట్‌ పెట్టుకొన్నా చలిగాలి చర్మాన్ని చుట్టేస్తుంటుంది. ఈ సమయంలో చర్మం పగిలి నిర్జీవంగా మారుతుంది. తప్పనిసరి పరిస్థితి అయితేనే బయటికి వెళ్లాలి. వెళ్లినా... మఫ్లర్‌, మంకీక్యాప్‌, గ్లౌజ్‌ ధరించాలి. మాశ్చురైజింగ్‌ క్రీములు, లోషన్లు అందుబాటు ధరల్లోనే దొరుకుతున్నాయి. వీటిని కాళ్లు, చేతులు, ముఖంపై రాయాలి.

ఉదయం నడక, వ్యాయామం చేసేవారు షూ ఎలాగో వేసుకుంటారు. చేతులకు గ్లౌజ్‌ వేసుకుంటే మంచిది.

ముఖం ఎక్కువ సార్లు కడిగితే అది తేమను కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది.

మాశ్చురైజింగ్‌ సోపులు మార్కెట్లో దొరుకుతాయి. ఇవి వాడితే చలి బారి నుంచి చర్మాన్ని కొంతవరకూ కాపాడుకోవచ్చు.

శీతాలు సింగారం!

ఉదయం ఎండ మజాగా ఉంటుంది. అందుకని ఎక్కువ సమయం ఈ ఎండలో ఉండకూడదు. దీనివల్ల చర్మం కమిలిపోతోంది. కొబ్బరి నూనె, నెయ్యి రాసుకున్నా చర్మానికి మాశ్చురైజింగ్‌గా పనిచేస్తాయి.

-డా. పుట్టా శ్రీనివాస్‌, డెర్మటాలజిస్ట్‌

ఫ్యాషన్‌ దెబ్బతినకుండా..

శీతాలు సింగారం!

‘ఫంక్షన్‌ రాత్రి పూటా? నేను రాలేను. చలి చంపేస్తుంది. నా దగ్గరున్ను డ్రెస్‌లు చలికి తట్టుకోలేవు. స్వెట్టర్‌ వేసుకుంటే నేను లావుగా కన్పిస్తా.’  - కౌశిక్‌ నిట్టూర్పు.

ఇలా ఎంతో మంది యువతదీ సమస్య. దీనికెందుకు చింత అంటున్నారు డిజైనర్లు. ఊలుతో కావాల్సిన రీతిలో డ్రెస్‌ డిజైన్‌ చేయించుకోవచ్చంటున్నారు. లైట్‌వెయిట్‌ జీన్స్‌, లెనిన్‌, ఉలన్‌ జర్కిన్స్‌ మీకోసం మార్కెట్లో ఉన్నాయని చెబుతున్నారు.

చాలా మంది శీతకాలంలో ఫ్యాషన్‌ దుస్తులు ధరించలేకపోతున్నామని బాధపడిపోతుంటారు. నైట్‌ పార్టీలకు వెళ్లేవారు ఏ డ్రెస్‌ వేసుకున్నా దాని మీద మళ్లీ స్వెట్టర్‌ వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల దుస్తుల అందమే కాదు... తమ అందమూ దెబ్బతింటుందని ఫీల్‌ అయ్యే యువతే ఎక్కువ. కొద్ది పాటి మెలకువలు పాటిస్తే ఫ్యాషన్‌ దెబ్బతినకుండానే చలిపులి నుంచి తప్పించుకోవచ్చు. దీనికి కొంచెం మీ వార్డ్‌రోబ్‌ మారిస్తే సరిపోతుందంతే!

లెనిన్‌లో ముదురు రంగుల దుస్తులు మీ ఫ్యాషన్‌ పెంచడంతోపాటు.. చలి నుంచి రక్షిస్తాయి.

అన్నివేళలా జీన్స్‌ ఫ్యాషన్‌. ఈ కాలంలో సాగే జీన్స్‌ మంచివి. ఇవి శరీరానికి అంటిపెట్టుకొని ఉండటం వల్ల చలిని రానివ్వవు. నైట్‌పార్టీల్లో, రాత్రి ప్రయాణాల్లో చలిగాలులను అడ్డుకొంటాయి.

ఇక ఊలుతో చేసే స్వెట్టర్లు ఎలాగూ ఉన్నాయి. వీటిలో వీ నెక్‌, రౌండ్‌ నెక్‌లతో పాటు, పూలు అద్దిన ఫ్యాషన్‌ స్వెట్టర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మన దుస్తుల అందం ఏమాత్రం చెడకుండా...ఇవీ ప్రత్యేక దుస్తుల్లా అందరినీ ఆకట్టుకుంటాయి.

శీతకాలంలో ముదురు రంగులే ఎక్కువ ధరించాలి కాబట్టి... 
షూటింగ్‌ మెటీరియల్‌తో తయారుచేసిన దుస్తులు ఎంపిక చేసుకుంటే మంచిది. ఇవి మందంగా ఉండి చలిని తగ్గిస్తాయి.

శీతాలు సింగారం!

టీషర్ట్‌ ఇష్టపడేవారు లైట్‌ వెయిట్‌ ఊలు జర్కిన్స్‌ వేసుకోవాలి. రంగుల ఎంపికలో జాగ్రత్త తీసుకుంటే అందం రెట్టింపవుతుంది. అమ్మాయిలకైతే వెస్ట్‌ జాకెట్లు అందుబాటులో ఉన్నాయి. స్టైలిష్‌, లైట్‌వెయిట్‌ స్కార్ఫ్‌లు తీసుకొంటే... అందానికి అందం... చలికి వెచ్చదనమూ రెండూ మన సొంతమవుతాయి.

- రవి అవ్వారు, డిజైనర్‌, అవ్వారు ఫ్యాషన్స్

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని