బిల్డప్‌ బాబాయ్‌లు బుల్లెమ్మలు! 

ప్రణీత చూడ్డానికి బొద్దుగా ముద్దుగా ఉంటుంది. కానీ, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ డీపీల్లో చూస్తే మాత్రం స్లిమ్‌గా, హాట్‌గా కనిపిస్తుంది. వాటికొచ్చే లైక్‌లు, కామెంట్‌లు అన్నీ ఇన్నీ కాదు. అవన్నీ చూసుకుని తనకొచ్చే వర్చువల్‌ ఇమేజ్‌కి సంబరపడిపోయి మరింత యాక్టివ్‌గా సోషల్‌ మీడియాలో ...

Updated : 31 Dec 2018 17:34 IST

కేరాఫ్‌ సోషల్‌ అడ్డా

బిల్డప్‌ బాబాయ్‌లు బుల్లెమ్మలు! 

ఎక్కడరా లొకేషన్‌ అదిరింది! 
ఈ మధ్య నీ అందం పెరుగుతోందే! 
బైకులు మార్చడంలో నువ్వే హీరో మామ! 
సూపర్రా నువ్వు 
‘లైక్‌’లే నిజాలనుకుంటూ.. ‘కామెంట్‌’లే కొలమానాలనుకుంటూ.. రోజుకో ‘డీపీ’ మార్చుకుంటూ... విర్చువల్‌ ఇమేజ్‌ని పెంచుకుంటూ పోతున్నారా? అయితే, మీరు బిల్డ్‌ప్‌ బాబాయ్‌లు.. బుల్లెమ్మలే! అదెలాగంటారా? అయితే చదవండి!

ప్రణీత చూడ్డానికి బొద్దుగా ముద్దుగా ఉంటుంది. కానీ, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ డీపీల్లో చూస్తే మాత్రం స్లిమ్‌గా, హాట్‌గా కనిపిస్తుంది. వాటికొచ్చే లైక్‌లు, కామెంట్‌లు అన్నీ ఇన్నీ కాదు. అవన్నీ చూసుకుని తనకొచ్చే వర్చువల్‌ ఇమేజ్‌కి సంబరపడిపోయి మరింత యాక్టివ్‌గా సోషల్‌ మీడియాలో సంచరిస్తోంది. కానీ, ఆమె చూస్తున్నదంతా నిజం కాదని తనకి తెలుసు. వాస్తవ ప్రపంచంలో ఏదో వెలితి తనని ఒత్తిడికి గురి చేస్తోంది!

వరుణ్‌ది మధ్యతరగతి ఫ్యామిలీ. ఓ రోజు ఫ్రెండు బైక్‌పై స్టైల్‌గా రేబాన్‌ కళ్లజోడు పెట్టి తీసుకున్న సెల్ఫీని డీపీగా పెట్టాడంతే. ఇక చూస్కోండీ.. ఒకటే లైక్‌లు, వావ్‌!!!లు. స్పందన చూసి తన ఇమేజ్‌ని అమాంతం స్టార్‌లా ఊహించుకున్నాడు. రోజూ తన ఫ్రెండుతో షాపింగ్‌ మాళ్లు, కారు, బైక్‌ల్లో తిరుగుతూ సోషల్‌ వరల్డ్‌తో ఫాలోయర్స్‌ని తెగ పెంచుకోసాగాడు. కానీ, వాస్తవానికి పెట్టుకున్న కళ్లజోడు.. కూర్చున్న బైక్‌, తిరిగే కారు... ఏవి తనవి కాదు. సోషల్‌ లైఫ్‌లో చూసే వారంతా వరుణ్‌ రేంజ్‌ వేరని ఫిక్స్‌ అయిపోయారు. అంతేనా.. వరుణ్‌ని కూడా ఫిక్స్‌ అయ్యేలా భ్రమ కల్పించారు. కానీ, ఏదో మూల తెలియని ఒత్తిడి. తను ఇష్టంగా తొక్కే సైకిల్‌పై సెల్ఫీ తీసుకోలేని పరిస్థితి.

మహేశ్‌ బైక్‌పై వెళ్తున్నాడు. ఎండ మండిపోతోంది. ఎవరో అనాథ. పెద్దాయన. లిప్ట్‌ అడిగితే బైక్‌ ఎక్కించుకున్నాడు. గేర్‌ వేయడానికి ముందే పెద్దాయనతో ఓ సెల్ఫీ వేసుకుని ఎఫ్‌బీలో పెట్టాడు. అంతే.. ‘ఓ స్వీట్‌’ అని ఒకరు.. ‘యు ఆర్‌ గ్రేట్‌’ అని ఇంకొకరు... కామెంట్‌లు, లైక్‌లు. మహేశ్‌కి కాస్త కిక్‌ కొచ్చింది. కానీ, అదెక్కువ సమయం లేదు. ఎందుకంటే.. రోజూ తను వచ్చే దార్లో కూడు, గూడు లేకుండా సంచరించేవారెందరో. వారిని పట్టించుకునే తీరిక, సమయంగానీ తనకి లేవు. తప్పించుకుని చూసీ చూడనట్టుగా వెళ్లిపోతుంటాడు. మరి, సోషల్‌ లైఫ్‌లో గ్రేట్‌ హ్యుమన్‌ అనిపించుకున్న నేను నేనేనా? అనే సందేహం??

‘పైవన్నీ నిజం అనిపించే అవాస్తవాలనీ.. వర్చువల్‌ వరల్డ్‌లో చూసేదంతా నిజంకాదనీ.. చెప్పాలికదరా బా....బు!! పొద్దంతా  ఫోన్‌ని మెళ్లో వేసుకుని బిల్డప్‌ బాబాయ్‌లా తెగ ఓవర్‌ చేయడమేనా?’ అనుకోవచ్చు. కానీ, వీళ్లే కాదు సోషల్‌ మీడియాలో విహరిస్తున్న నేటి తరం మిలీనియల్స్‌లో చాలా మంది ప్రణీత, వరుణ్‌లానే ప్రవర్తిస్తున్నారు. వారిది కానీ ఐడెంటిటీనీ మాస్క్‌లా తగిలించుకుని తిరుగుతున్నారు. అదేమంత పెద్ద తప్పు కాదనుకుంటూ.. నేటి పోటీ ప్రపంచంలో తమని తామే ఓ బ్రాండ్‌లా తీర్చిదిద్దుకోవాలనే తపనే యువతని సోషల్‌ లైఫ్‌కి దగ్గర చేస్తోందని మానసిక శాస్త్ర నిపుణులు చెబుతున్న మాట. ప్రపంచానికి పరిచయం అయ్యేందుకు సోషల్‌ మీడియానే వేదికగా చేసుకుని రోజులో కనీసం సగానికి పైనే సమయాన్ని వర్చువల్‌ లైఫ్‌కి కేటాయిస్తూ ఒకరిలో దాగున్న ఇద్దర్ని బ్యాలెన్స్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సోషల్‌ మీడియా ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. ఆ ఇద్దర్లో ఒకరు ఎఫ్‌బీ వాల్స్‌ పైనా.. ట్విట్టర్‌ హ్యాండిల్‌పైనా.. వాట్సాప్‌ డీపీలోనూ.. కనిపించే సోషల్‌ లైఫ్‌  మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌... ఇంకొకరు నిజ జీవితంలో ఎత్తుపల్లాల్ని చూస్తూ సాగిపోయే సాదాసీదా వ్యక్తి. ఒక్కడిలో ఉన్న ఆ ఇద్దరూ మీలో ఉన్నారా? తరచి చూసుకోవడం అవసరం!

ముమ్మాటికీ మార్కెటింగ్‌కే 
లేచింది మొదలు అన్నీ సోషల్‌ మీడియాలో బ్రాడ్‌క్యాస్టింగ్‌ చేసేవారెందరో. ఎన్నో ఆదర్శభావాల్ని వల్లిస్తుంటారు. ఎక్కడో బ్రౌజింగ్‌లో కనిపించిన కొటేషన్‌ని స్టేటస్‌గా పెట్టేస్తారు. దానికొచ్చే ఆదరణ చూస్తారు. నెట్టింట్లో అందరూ మనల్ని ఓ రేంజ్‌లో ఊహించుకుంటారని భావిస్తారు. అయితే కొటేషన్‌లో ఏదైతే ఆదర్శవంతంగా చెప్పామో.. అది నిజ జీవితంలో పాటిస్తున్నామా? అనే ప్రశ్న మొదలైతే సంఘర్షణ షురూ! సోషల్‌ ఇమేజ్‌ తగ్గట్టుగా ఉండాలనే ప్రయత్నం చేస్తుంటాం. దీంతో ఒత్తిడి మొదలు. మనలో లేనిదాన్ని సోషల్‌ లైఫ్‌లో బలపరుస్తున్నందుకు కాస్త ఆందోళన పెరుగుతుంది.

ఎడిటింగ్‌ మాయ కొంత 
పలు రకాల గిమ్మిక్కులతో నిత్య నూతనంగా మారుతున్న సోషల్‌ లైఫ్‌ పోస్టింగ్‌లు కాస్త బిల్డప్‌గానే ఉంటున్నాయ్‌. అందుకు తగినట్టుగానే పలు రకాల ఎడిగింగ్‌ ఆప్షన్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతున్నాయి. లావుగా ఉన్నవారినీ సన్నగానే కాదు. ఫిట్‌గా మార్చేస్తున్నాయ్‌. ఆటోమాటిక్‌గా ‘బ్యూటీఫై’ చేస్తున్నాయ్‌. దీంతో ఫాలోయర్స్‌ మాత్రమే ఫ్యాన్స్‌ అవ్వడం కాదు. మీ  పోస్టింగ్‌లు చూసుకుంటూ కొంత కాలానికి మీకు మీరే అభిమానిగా అయిపోతారు. ఏయే సమయాల్లో ఎలా ఉన్నారు? ఎలా స్పందించారనే మధురమైన జ్ఞాపకాల్ని స్క్రోల్‌ చేసుకుంటూ సోషల్‌ ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కుపోతుంటారు. దీనికి కారణం లేకపోలేదు. ఒకప్పుడు పరిమితమైన మాధ్యమాల్లోనే హీరోలను చూసి మురిసిపోయేవాళ్లం. వారిని అనుకరించే ప్రయత్నం చేస్తే అది ఇల్లు లేదంటే వీధి చివరి వరకే తెలిసేది. కానీ, ఇప్పుడు సోషల్‌ మీడియాని వేదికగా చేసుకుని ఎవరికి వారే హీరోల్లా ఇమేజ్‌ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సెకన్ల నిడివితో ఉన్న ఒక్క వీడియో వైరల్‌ అయ్యి సాధారణ వ్యక్తుల్ని కూడా సెలబ్రిటీని చేసేస్తుంది.

స్థిమితత్వం అవసరం

వాస్తవ ప్రపంచంలోనైనా.. సోషల్‌ వరల్డ్‌లోనైనా స్థిమితత్వం ఉన్నప్పుడే నియంత్రణ సాధ్యం అవుతుంది. ఓ సర్వేలో తేలిందేమంటే.. మీ ఫ్రొఫైల్‌ పిక్‌ని పదే పదే మార్చేస్తున్నారంటే.. సోషల్‌ లైఫ్‌లో మీకు స్థిమితత్వం లేనట్టేనట. అలాగే, కింది లక్షణాలున్నాయో చెక్‌ చేసుకోండి. ఒకటి కంటే ఎక్కువ చెక్‌ చేస్తే వాస్తవ ప్రపంచానికి మీరు దూరం అవుతున్నట్టే. మీపై నిఘా పెట్టుకోవాల్సిన తరుణం వచ్చినట్టే.

ఎక్కువగా సోషల్‌ మీడియాలో ఉండేందుకు ఇష్టపడతారు. 
పదే పదే స్టేటస్‌లు చెక్‌ చేసుకుంటూ ఉంటారు. 
సమస్యల్ని మర్చిపోయేందుకు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ అవుతారు. 
సోషల్‌ మీడియాని యాక్సెస్‌ చేయకుండా ఒత్తిడి, ఆందోళనకు లోనవుతారు.

నిజం అనిపించొచ్చు కానీ..

ఇమేజ్‌ పెంచుకోవడానికో.. పబ్లిసిటీ నిమిత్తమో మనం షేర్‌ చేస్తున్న వాటిని ఇతరులు నమ్ముతున్నారంటే.. మనమూ నమ్మి ముందుకెళ్లడమే. ఉదాహరణకు మీరు రోడ్డు దాటుతున్నప్పుడు అనుకోకుండా ఓ బామ్మ మీ చేయిపట్టుకుని రోడ్డు దాటేసింది. మీరేమో ఓ సెల్ఫీ తీసుకుని సోషల్‌ మీడియాలో పెట్టేశారు. అందరూ మిమ్మల్ని పొగిడేశారు. కానీ, ఇక్కడ నిజం ఏంటంటే.. బామ్మని రోడ్డు దాటిద్దాం అనే ఆలోచన మీకు రాలేదు. అలాంటి దృక్పథమూ లేదు. అయితే, మీరు షేర్‌ చేసిన దాన్ని నమ్మి లేని గుణాన్ని అలవర్చుకుంటే మంచిదేగా! అలాగే, షేరింగ్‌లకు వచ్చే లక్షల్లో లైక్‌లు మనలో మార్పునో, విషయాన్నో తీసుకురావు. వాటి నుంచి మనం నిజాన్ని గ్రహిస్తే తప్పా. అయితే ఓ రోజు వర్చువల్‌ వరల్డ్‌ రీఫ్రెష్‌ అవుతుంది. తిరిగి పరిశీలించినప్పుడు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మనసు, మెదడూ రెండూ ప్రశ్నిస్తాయి. మీరు ఒక్కరా? ఇద్దరా? అని. ‘నీ నిజ స్వరూపం ఏదని?’ అప్పుడు మీకు మీరు సమాధానం చెప్పుకోవాలి.

పరిధి దాటొద్దు

బిల్డప్‌ బాబాయ్‌లు బుల్లెమ్మలు!  

పెద్దలు చెప్పినట్టుగా పొరుగింటి పుల్లగూరకి రుచి ఎక్కువ. ఇలాంటి గుణం ఉన్నవారు క్షణం ఆలోచించకుండా ఇతరుల వస్తువులతో బిల్డప్‌ ఇచ్చేందుకే చూస్తారు. ఎవరిదో బెంజి కారు పార్క్‌ చేసి ఉంటే సెల్ఫీ తీసుకుని పెట్టేస్తుంటారు. దాని కొచ్చే లైక్‌లు, కామెంట్‌లతో ఎంజాయ్‌ చేస్తారు. దీన్నే సోషల్‌ లైఫ్‌ ఆర్బాటంగా చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువ కాలం వర్క్‌అవుట్‌ అవ్వదు.

లేని స్థాయిని తెచ్చిపెట్టుకుంటే ఎక్కువ కాలం నిలవదు. లైఫ్‌ వర్చువల్‌ వరల్డ్‌లోనే ఆగిపోతుంది. వాస్తవంలోకి రావడానికి ధైర్యం సరిపోదు. ఎలాగంటే... పలు రకాల ఫిల్టర్లు, కెమెరా ఆప్షన్స్‌ వాడి మీ వాస్తవ రూపాన్ని చెరిపేశారు. అనుకోకుండా సోషల్‌ లైఫ్‌లోని వాళ్లు వాస్తవంలో మిమ్మల్ని చూడాలనుకుంటే మీరెలా స్పందిస్తారు? మీ ఫేస్‌తోనే వారిని ఫేస్‌ చేయగలరా? ఆ ఒత్తిడి భరించలేనిది.

మీరో బ్రాండ్‌ అవ్వడం అంటే.. మీదైన ప్రత్యేకతని చాటడం. అంతేకానీ, అరువు తెచ్చుకుని అద్దుకోవడం కాదు. మీకున్న టాలెంట్‌ ఏదైనా దాన్ని నిజాయితీగా సోషల్‌ వేదికల్లో పరిచయం చేయండి. మీరు ఆశించే ఇమేజ్‌ ఆటోమాటిక్‌గా వచ్చేస్తుంది.

వాస్తవ ప్రపంచం నుంచి పక్కకు జరుగుతూ సోషల్‌లైఫ్‌కి బాగా దగ్గరవుతున్నారంటే కచ్చితంగా సృహలోకి రావాలి. సోషల్‌ యాప్స్‌ని దూరం పెట్టాలి. ఒకవేళ వాడితే అవసరమైనప్పుడు నోటిఫికేషన్స్‌ టర్న్‌ఆఫ్‌ చేయండి.

పని వేళల్లో, ఆఫీస్‌ కంప్యూటర్స్‌లో సోషల్‌ మీడియా సర్వీసుల్ని యాక్సెస్‌ చేయొద్దు. 
పంచుకోవడానికి కూడా ఓ పరిధి ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి.

లైక్‌లను ఆశిస్తూ దేన్ని పంచుకోవద్దు. 
సోషల్‌ వాల్స్‌పై మిమ్మల్ని జడ్జ్‌ చేసే సర్వీసుల జోలికి పోవద్దు.

లైక్‌లు, కామెంట్‌ల్లో కిక్‌ని వెతుక్కోవడం అవివేకం. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. 
ఇతరుల గురించి తెలుసుకోవాలనే ఆతృతని తగ్గించుకోవాలి.

- కోటిరెడ్డి సరిపల్లి, ఐటీ నిపుణుడు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని