చూపులు మారిన శుభవేళ

పిల్లను బాగా చూసుకోరా.. ఆనక నేను సరిగ్గా చూల్లేదంటే కుదర్దు... ఇదీ బామ్మ హూంకరింపు. అలా చూడకే..! నేను మీ అమ్మను కట్టుకోవాల్సి వచ్చింది... నాన్న ఆటపట్టింపు. నిజమే రా..! అపుడే మీ నాన్నను చూసుంటే ఈ బాధలన్నీ తప్పేవి.. అమ్మ సుతిమెత్తటి చురక పెళ్లిచూపులంటే ఒకప్పుడు ఇలాంటి సీనే ఉండేది. కానీ ఇప్పుడు సీన్‌ మారుతోంది...

Updated : 22 Dec 2018 05:58 IST

చూపులు మారిన శుభవేళ

ఇప్పుడే పిల్లను బాగా చూసుకోరా.. ఆనక నేను సరిగ్గా చూల్లేదంటే కుదర్దు... ఇదీ బామ్మ హూంకరింపు.
అలా చూడకే..! నేను మీ అమ్మను కట్టుకోవాల్సి వచ్చింది... నాన్న ఆటపట్టింపు.
నిజమే రా..! అపుడే మీ నాన్నను చూసుంటే ఈ బాధలన్నీ తప్పేవి.. అమ్మ సుతిమెత్తటి చురక
పెళ్లిచూపులంటే ఒకప్పుడు ఇలాంటి సీనే ఉండేది. కానీ ఇప్పుడు సీన్‌ మారుతోంది...

అప్పటికి.. ఇప్పటికి పెళ్లిచూపుల సీనులో బోలెడు మార్పులు. సిగ్గు తెరల మాటున, పెళ్లి కూతురు బొటనవేలు నేలకు రాస్తూ నిలుచుని ఉంటే పెళ్లి కొడుకు, బంధువులు టిఫిన్లు తింటూ ప్రశ్నలడిగే ‘పెళ్లి చూపుల’ తీరు దాదాపుగా లేదు. కట్‌ చేస్తే.. కేవలం అబ్బాయి, అమ్మాయి తమతమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అది కూడా అమ్మాయి ఇంట్లోనో.. బంధువుల ఇంట్లోనో కాదు. కాఫీ షాపుల్లో.. లేదా షాపింగ్‌ మాల్స్‌లో.

అమ్మాయి సరేనంటేనే..ముందుకు
ఒకప్పుడు పెళ్లిచూపుల్లో పెద్దలదే హవా. కానీ ఇపుడు పిల్లల అభిప్రాయాలకే పెద్దపీట. అందులో అమ్మాయిల అభిప్రాయాలకే విలువ పెరుగుతోంది. ఒకప్పుడు అబ్బాయి సరే అంటే.. పెళ్లిచూపుల తంతు ముగిసేది. ఇపుడు అమ్మాయి సరే అంటే అబ్బాయి హమ్మయ్య అనుకుంటున్నాడు. అవును.. అబ్బాయిలు ఈ విషయంలో కంగారు పడుతున్నారు. అమ్మాయిలకు తాము నచ్చుతామో లేదో అన్న ఆందోళన ఇపుడు అబ్బాయిలకు కలుగుతోందని ఓ ఐటీ ఉద్యోగి అంటున్నారు. అలాని ఇలా మాట్లాడుకోగానే నచ్చేసినట్టు కాదు. దాని తర్వాత చాలా తంతు ఉంటోంది.

వీడియో ప్రోమోలు..
పెళ్లిచూపులకు సాధారణంగా ఫొటోలు పంపుకోవడం రివాజు. ఇపుడు ట్రెండ్‌ మారింది. ఇపుడు పెళ్లిచూపులకు ముందు కొంత మంది వీడియో ప్రోమోలు పంపుకొంటున్నారు. అంటే తమ వ్యక్తిగత వివరాలతో పాటు అభిప్రాయాలు, అభిరుచులను అందులో పంచుకుంటున్నారు. తద్వారా పెళ్లి చూపులకు ముందే కొంత అవగాహన వస్తుందని విజయవాడలోని ఓ మ్యాట్రిమొని ప్రతినిధి తెలిపారు. వీటి వల్ల రూపు మాత్రమే కాకుండా వాచకం, ఆహార్యం, నడక, నడత వంటివన్నీ గమనించే అవకాశం ఇరువురికి కలుగుతుంది. పెళ్లి చూపుల తొలి దశలో ఈ మార్పు ఇప్పుడు అన్ని చోట్లా కనిపిస్తోంది.

కాఫీ షాపులు
ఒక వేళ ఫొటోలు, వీడియో ప్రోమోల తర్వాత ఒకరికొకరు నచ్చితే పెళ్లిచూపుల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక వీటిని కూడా వినూత్నంగానే ఆలోచిస్తున్నారు. పెళ్లిచూపులకు కావాల్సింది ఏకాంతం. చుట్టూ అందుకు అనువైన వాతావరణం. అలాంటి ఏకాంతం, వాతావరణాన్ని కల్పించడానికి కాఫీ షాపులు ముందుకొస్తున్నాయి. హైదరాబాద్‌లోనే కాదు.. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో కూడా ఈ తరహా పెళ్లిచూపుల కాఫీ షాపులు వెలుస్తున్నాయి. అందు కోసం ఇవి లక్షలు వెచ్చించి మరీ ఇంటీరియర్‌ డెకరేషన్‌ చేస్తున్నాయి. అక్కడి యాంబియన్స్‌(వాతావరణం) వారిని కట్టిపడేస్తోంది. తాగేది ఒక్క కాఫీ అయినా.. కబుర్లు మాత్రం బోలెడు. చివరకు ఒక అభిప్రాయానికి వచ్చి.. ఫోన్లో వాళ్ల తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేస్తున్నారు. మరికొంత మందికి గుడి సెంటిమెంటు ఉంటోంది. ఆలయాల్లోనూ పెళ్లిచూపులకు ఇష్టపడుతున్నారు.

ఎక్కువ విషయాలు వీటి చుట్టూనే..
పెళ్లిచూపుల్లో అబ్బాయి, అమ్మాయి ఒకరితో మరొకరు మాట్లాడుకున్నప్పుడు సినిమాలు, అభిమాన నటులు వంటి అంశాల కంటె కుటుంబ విషయాలు, తమ ఆలోచనలు, ఈ స్థాయికి రావటానికి తమ కుటుంబ ప్రోత్సాహం ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా సాగితే బావుంటుంది.. వంటి విషయాలను చర్చించుకుంటున్నారు. తల్లిదండ్రుల బాధ్యతలు వంటి విషయాలనూ వీరు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

ఇవి మాత్రం మారడం లేదు
ఎంత డిజిటల్‌ దిశగా.. స్వతంత్ర భావాల దిశగా మారినా.. కొన్ని విషయాల్లో మాత్రం అటు అమ్మాయి.. ఇటు అబ్బాయి వర్గం వారి భావనల్లో మార్పు ఉండడం లేదు. మతం, కులం, వర్గం, ఆర్థిక స్థితి, వృత్తి, ఉండే ప్రాంతం, విద్య.. ఈ విషయాల్లో కచ్చితంగా ఉంటున్నారు. పెళ్లిచూపుల దాకా విషయం వెళ్లాంటే ఇవన్నీ దాటుకునే వెళ్లాలి. ఇక కొంత మంది అమ్మాయిలు ఈ మధ్య కాలంలో కేవలం ఐఐటీ లేదా ఐఐఎమ్‌లో చదివిన అబ్బాయిలే కావాలని పట్టుబడుతున్నారట. వీరి కోసం ఓ మాట్రిమొనియల్‌ వెబ్‌సైట్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం విశేషం.

- బెజవాడ వెంకటేశ్వర్లు

 

డేటింగ్‌ యాప్స్‌నూ వాడేస్తున్నారు

చూపులు మారిన శుభవేళపెళ్లిచూపుల వేదిక ఎలా మారిందో.. తమకు తగ్గ భాగస్వామి అన్వేషణలో ధోరణి కూడా మారుతోంది. మ్యాట్రిమొనీ వెబ్‌సైట్లతో పాటు.. డేటింగ్‌ యాప్స్‌లనూ ఆశ్రయిస్తున్నారు. ఆయా వివరాలను సోషియల్‌ నెట్‌వర్కింగ్‌లో పోల్చిచూసుకుని నిజమా కాదా అని తనిఖీ కూడా చేసేస్తున్నారు. టిండర్‌, బాడూ, లవూ, ఫ్రిమ్‌, మోమో, హార్ట్‌బీట్‌, వైవైసీ, పాక్టార్‌, హూస్‌హియర్‌, హాప్పెన్‌, ట్రూలీమాడ్లీ, ఓకేక్యూపిడ్‌ వంటి యాప్స్‌లలో యువత వెతుకులాట ఎక్కువగా ఉంటోందట. ఈ ధోరణి ముంబయి, లఖ్‌నవూ, దిల్లీలకే పరిమితం కాలేదు.. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలలోనూ విస్తరిస్తోంది.

అలా మొదలైంది
ఎంటెక్‌ చేసి బెంగూళురులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. మా తల్లిదండ్రులూ సాఫ్ట్‌వేర్‌ అబ్బాయే కావాలని కోరుకున్నారు. అందులో భాగంగానే నెల్లూరుకు చెందిన అభిషేక్‌ గురించి తెలిసింది. అయితే మేం నేరుగా పెళ్లిచూపులకు ఒప్పుకోలేదు. ఈ విషయాన్నే ఇంట్లో చెప్పాం. వాళ్లూ అంగీకరించారు. వీకెండ్‌లో తొలిసారిగా కాఫీ షాపులో కలిశాం. మనస్సులు కుదుటపడిన తర్వాత వారాంతంలో మరోమారు కలుసుకున్నాం. ఈ సారి చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఒకరిగురించి ఒకరం తెలుసుకున్నాకే మా వాళ్లకు ఓకే చెప్పాం. 

- శ్రావ్య, ఒంగోలు

 
 
 
 

చూపులు మారిన శుభవేళ తాజా మార్పులు
అమ్మాయి, అబ్బాయి కలిసి మాట్లాడుకోవటం ఇటీవల బాగా కనిపిస్తోంది. మేం వేడుకల నిర్వహణ చేపట్టిన వాటిల్లో ఈ తరహాలో ఇష్టాయిష్టాలు పంచుకునే ధోరణి క్రమంగా పెరుగుతోంది. ముహుర్తాలు మొదలుకొని వివాహం వరకు వరుడువధువు ఇద్దరూ ఇన్‌వాల్వ్‌ అవుతున్నారు. ఇదంతా ముందుగా మనసు విప్పి మాట్లాడుకుంటేనే సాధ్యపడుతుంది. మేం నాలుగు దశాబ్దాల నుంచి వివాహ వేడుకల నిర్వహణ చేస్తున్నాం. అయితే ఈ తరహా మార్పులు కొత్తగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఇదే బావుంది.

- ఉప్పల వరదరాజులు, శశి
ఈవెంట్స్‌ (ఏపీ క్యాటరర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు)


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు