పండగలా జీవిద్దాం

వచ్చేది సంక్రాంతి పండగ.. సెలవులు.. సొంతూరికి ప్రయాణాలు.. ఇంకేముందీ... రిలాక్స్‌ అయిపోదాం.. పొద్దెక్కాక లేద్దాం.. లంచ్‌ సమయానికి టిఫిన్‌ చేద్దాం.. దొరికిందల్లా లాగించేద్దాం.. అనుకోవడం లేదు నేటి తరం. మిలీనియల్స్‌ మోటో మారుతోంది. పండగన్నా.. వరుసగా సెలవులన్నా.. పద్ధతిగా ప్లాన్‌ చేస్తున్నారు. సోషల్‌ లైఫ్‌, గ్యాడ్జెట్‌లకు దూరంగా ఉంటూ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు.

Published : 05 Jan 2019 00:19 IST

పండగలా జీవిద్దాం

వచ్చేది సంక్రాంతి పండగ.. సెలవులు.. సొంతూరికి ప్రయాణాలు.. ఇంకేముందీ... రిలాక్స్‌ అయిపోదాం.. పొద్దెక్కాక లేద్దాం.. లంచ్‌ సమయానికి టిఫిన్‌ చేద్దాం.. దొరికిందల్లా లాగించేద్దాం.. అనుకోవడం లేదు నేటి తరం. మిలీనియల్స్‌ మోటో మారుతోంది. పండగన్నా.. వరుసగా సెలవులన్నా.. పద్ధతిగా ప్లాన్‌ చేస్తున్నారు. సోషల్‌ లైఫ్‌, గ్యాడ్జెట్‌లకు దూరంగా ఉంటూ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఏవో కొన్ని రోజులే అనుకోకుండా.. దాన్నే లైఫ్‌స్టైల్‌గా మలుచుకునేందుకూ ఇష్టపడుతున్నారు. నిత్యం పండగ మూడ్‌లోనే ఉంటూ లైఫ్‌ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. మరి, మీ సంగతేంటి? ఏవో కొన్ని రోజులేనా? రోజూ పండగలా జీవించే ప్రయత్నం చేస్తున్నారా? లేదా? కొత్త ఏడాది తీసుకున్న రిజల్యూషన్స్‌కి పండగ సెలవులు యాడ్‌ఆన్‌ అవ్వాలి.. మరింత ఉత్సాహాన్ని నింపాలి!!

బుర్రకి ఓఎస్‌ అప్‌డేట్స్‌

సొంతూరికి వెళ్తే. అక్కడి యాసని పట్టుకునే ప్రయత్నం చేస్తాం. అమ్మమ్మ, తాతయ్య.. మాటల్లోని నుడికారాల రుచిని గ్రహించే ప్రయత్నం చేస్తాం. ఆయా పదాలకు అర్థాలు తెలుసుకుంటాం. వచ్చేటప్పుడు బ్యాగుల్లో బోలెడన్ని జ్ఞాపకాల్ని నింపుకొని ఇంటికి రాగానే హార్డ్‌డిస్క్‌ల్లోకి కాపీ చేసి బిజీ అయిపోవద్దు. అక్కడ చూపిన ఆసక్తి కాంక్రీట్‌ జంగిల్లోకి రాగానే వదిలేయొద్దు. కొనసాగించాలి.

* నిత్యం ఫోన్‌ ఓఎస్‌ని అప్‌డేట్‌ చేసినట్టుగా మెదడునీ అప్‌డేట్‌ చేస్తుండాలి. మెదడు ఓఎస్‌ అనుకుంటే.. యాప్‌ల రూపంలో కొత్త స్కిల్స్‌ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్‌ చేస్తుండాలి. డ్యాన్స్‌ చేయడం.. వంట చేయడం.. ఏదైనా కొత్త భాషని అభ్యసించడం... లాంటివి ఏవైనా మెదడుకు కచ్చితంగా మేతే. కొత్త ఏడాది మీరు సంకల్పించుకున్న వాటిల్లో ఇది ఉండే ఉంటుంది. పట్టు సడలించొద్దు. నిత్యం నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి.

రోజూ లాగించాల్సిందే

పండగ వచ్చిందంటే అమ్మ వేసే గారెలు తింటూనే.. అత్త కలిపి పెట్టిన పెరుగు వడని ఓ పట్టుపడతారు.. ఆ తర్వాత పులిహోర.. పాయసం.. ఇలా పొద్దునే అల్పాహారం బొజ్జనిండా లాగించాల్సిందే. మరి, మిగతా రోజుల సంగతేంటి? ఉరుకులు పరుగులు పెడుతూ చేతికి అందిన ఓ యాపిల్‌తోనో.. బిస్కెట్‌ ప్యాకెట్‌తోనో సరిపెట్టుకోవడం మంచిది కాదు. వైద్య పరిశోధనల ప్రకారం రోజూ పుష్టిగా అల్పాహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చట.

* అన్ని రోజులూ ఫుల్‌గా అల్ఫాహారం తినేంత టైమ్‌ ఎక్కడిదీ అనుకోవద్దు. ఎందుకంటే.. ఎన్నో కలల తీరాల్ని దాటుకుని.. ఏడెనిమిది గంటలు తర్వాత నిద్రలేస్తాం. అలసిన పొట్టకి అల్పాహార విందు ఇవ్వాల్సిందే.

‘బ్రేకప్‌’ చెప్పాలి

చావిట్లో కట్టేసిన లేగదూడతో కాసేపు.. తాతయ్య రేడియో వింటూ ఉయ్యాల బల్లపై ఇంకాసేపు.. కజిన్స్‌తో కర్రాబిళ్లా ఆడుతూ గడిపేస్తాం. గ్యాడ్జెట్‌లు.. వాటికి ఛార్జింగ్‌లు.. వై-ఫైలు.. వాటికొచ్చే సిగ్నల్స్‌ ఊసే ఉండదు. విహార యాత్రల్లోనూ ఎక్కువ శాతం మంది టెక్నాలజీని పక్కనపెట్టేసి రిలాక్స్‌ అయ్యే ప్రయత్నం చేస్తారు. వెకేషన్‌ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలోనే మళ్లీ మొదలు. చూపుంతా తెరలపైనే.. వేళ్లెప్పుడూ కీబోర్డు మీటలపైనే. ఇదే వద్దు. ఏదో పండగ పది రోజులే కాదు. రోజూ కొంత సమయం పాటు టెక్నాలజీకి బ్రేకప్‌ చెప్పాల్సిందే.

* రోజులో మీకు ఇష్టమైన టైమ్‌ని సెట్‌ చేసుకుని అన్ని గ్యాడ్జెట్‌లను స్విచ్‌ఆఫ్‌ చేయాలి. మీకు మీరు విధించుకునే ‘కర్ఫ్యూ అవర్స్‌’ అన్నమాట. ఆ సమయంలో మనసుకు రిలాక్స్‌గా అనిపించే పనేదైనా చెయండి. ఉదాహరణకు సాయిత్రం 8 తర్వాత అన్ని గ్యాడ్జెట్‌లను ఓ గంట పాటు పక్కన పట్టేసి మీ పెంపుడు జంతువులతో వాకింగ్‌కి వెళ్లండి. బండి లేదా కారుని శుభ్రం చేయండి. కాసేపు పుస్తకం చదవండి.

మట్టికీ మీకు మధ్య నెట్‌వర్క్‌

సెలవుల్లో ఊరికెళ్తే పొద్దునే లేచి ఆ చోటంతా చుట్టేయడం.. పొలాల్లో తిరగడం.. అంతా నడిచే! కారు.. బైకు ఊసే రాదు. ట్రై చేద్దాం అనుకుంటే ఎడ్లబండిపై ఏరూ.. ఊరూ దాటేయొచ్చు. అదే నడకని తిరుగు ప్రయాణంలో ఊరి పొలిమేరల్లో వదిలేయొద్దు. నడక తాలూకు జ్ఞాపకాల్ని ఫోన్‌ ఇంటర్నల్‌ మెమొరీలో కాకుండా మదిలో భద్రం చేసుకోండి. రొటీన్‌ లైఫ్‌లోనూ కారు, బైక్‌లను పక్కనపెట్టి నడక అందుకోండి. సైన్స్‌ చెప్పేదీ ఇదే.. రోజుకో 20 నిమిషాలు నడిస్తే పోయేదేం లేదనే. ఫిట్‌నెస్‌కి మూలం నడకే.

* పండగ ముగిసిందో లేదో.. మరునాడు అలారం సెట్టింగ్స్‌ని మార్చొద్దు. ఊరు నుంచి వచ్చామో లేదో.. హుషారు మొత్తాన్ని బైక్‌కి ఇచ్చేయకండి. మంచం దిగిన పాదాలు మట్టిని తాకాలి. రోజూ నడవాలి. మట్టికి మనకీ మధ్య నిత్యం నెట్‌వర్క్‌ కనెక్టు అయ్యి ఉండేలా చూసుకోవాలి.

కునుకేసుకోండి

కజిన్స్‌తో వాకిట్లోనే వన్‌స్టెప్‌ క్యాచ్‌ క్రికెట్టో.. ఏడు పెంకులాటో ఆడడం.. అవీ బోర్‌ అనిపిస్తే కాలువగట్టుకి ఈతకెళ్లడం. లంచ్‌కల్లా ఇంటికొచ్చి తినడం.. కాసేపు కునుకు తీయడం. హాలిడేస్‌లో ఉన్న ఆ మజానే వేరు కదా! ఇక్కడ ఆటలెంత ముఖ్యమో.. తిన్నాక కునుకూ అంతే ముఖ్యం. పరిశోధనల్లో తేలిందేమంటే.. తిన్నాక తీసే పవర్‌ న్యాప్‌తో స్లిమ్‌ అవ్వొచ్చట. అంతేకాదు.. మెదడు రీఫ్రెష్‌ అయ్యి చేసే పనిపై ఏకాగ్రతను పెంచుతుందట. ఇంకా చెప్పాలంటే.. గుండె పనితీరుని మెరుగుపరుచుకునేందుకు కునుకెంతో మేలట.

* చదువుల్లో, ఆఫీస్‌ల్లో ఉండేవారికి రోజూ కునుకేయడం కుదరదుగానీ.. ఓ పది నిమిషాలు కూర్చున్న చోట అవకాశం దొరకొచ్చు. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. వారాంతాల్లో మాత్రం కచ్చితంగా 20 నుంచి 30 నిమిషాలు కునుకు తీయడం మర్చిపోవద్దు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని