కలుపుపై గెలుపు

పరిష్కారం ఎవరు కనుక్కొంటారు? కష్టాలు పడిన వారే..! వారికే తెలుసు దాని వల్ల కలిగిన ఇబ్బంది. అందుకే పరిష్కార మార్గం వారే చక్కగా సూచించగలరు.     చదువుతో సంబంధం లేదు. ఏ డిగ్రీ పట్టాలు అవసరం లేదు. అలా పదో తరగతి వరకే చదివిన ఓ యువకుడు తాను ఎదుర్కొన్న కష్టాలను అధిగమించేందుకు చేసిన ఆవిష్కరణ అతన్ని పారిశ్రామికవేత్తను చేసింది.

Published : 19 Jan 2019 00:19 IST

కలుపుపై గెలుపు

పరిష్కారం ఎవరు కనుక్కొంటారు? కష్టాలు పడిన వారే..! వారికే తెలుసు దాని వల్ల కలిగిన ఇబ్బంది. అందుకే పరిష్కార మార్గం వారే చక్కగా సూచించగలరు.     చదువుతో సంబంధం లేదు. ఏ డిగ్రీ పట్టాలు అవసరం లేదు. అలా పదో తరగతి వరకే చదివిన ఓ యువకుడు తాను ఎదుర్కొన్న కష్టాలను అధిగమించేందుకు చేసిన ఆవిష్కరణ అతన్ని పారిశ్రామికవేత్తను చేసింది. రైతుల కష్టానికి ఆ యువకుడు చూపిన పరిష్కారం... కేంద్ర పురస్కారమూ పొందింది. ఆ యువకుడెవరు? ఏం చేశాడు? తెలుసుకోవాలంటే... చదివేయండి.

కలుపుపై గెలుపు

నూతన ఆవిష్కరణలకు పెద్దగా చదువుకోవాల్సిన అవసరమే లేదని.. తపనుంటే చాలని నిరూపించాడు మహిపాల్‌చారి. ఈ యువకుడిదిపేద రైతు కుటుంబం. ఉన్నత చదువులు చదువుకోడానికి ఇబ్బంది. పదో తరగతితో బడి మానేసి పనికి కుదురుకున్నాడు. జమ్మికుంటలో బైక్‌ మెకానిక్‌గా చేస్తూ కుటుంబానికి భారం కాకుండా బతకడం ప్రారంభించాడు. చేస్తున్న పని తృప్తి నివ్వలేదు. మళ్లీ సొంతూరు సీతారాంపురం వచ్చాడు. ఉన్న రెండెకరాలను సాగు చేయడం మొదలుపెట్టాడు. పంట పండించడంలో కలుపు ఏ రైతుకైనా అతి పెద్ద సమస్య. దాన్ని మహిపాల్‌ ఎదుర్కొన్నాడు. కలుపు తీయాలంటే కూలీల కొరత. ఎక్కువ కూలీ ఇవ్వడానికి ఆర్థిక స్థోమత సహకరించేది కాదు. కలుపు తీసే యంత్రాన్ని తయారుచేస్తే బాగుంటుందని తలచాడు. పరిశోధించాడు. తనకున్న పరిజ్ఞానాన్ని జోడించాడు. సెకెండ్‌ హ్యాండ్‌ ఆటో ఇంజిన్‌ కొన్నాడు. రెండు చక్రాలు బిగించాడు. హ్యాండిల్‌, క్లచ్‌ను తీగలతో అనుసంధానం చేశాడు. ఇంటర్నెట్‌ సాయం తీసుకొన్నాడు. అయిదు నెలలు కష్టపడి డీజిల్‌తో నడిచే మినీ కల్టివేటర్‌ను తయారుచేశాడు. పొలంలో కాలినడకన తిరుగుతూ పత్తి, మిరప పంటల్లో కలుపు తీసేందుకు ఉపయోగించాడు. ఫలితం సాధించాడు. ఒక లీటర్‌ డీజిల్‌తో రెండు ఎకరాల్లో కలుపుతీసే సామర్థ్యం ఈ యంత్రం ప్రత్యేకత. దీన్ని చూసిన చుట్టుపక్కల రైతులు తమకూ ఒకటి చేయించమని కోరారు. నలుగురు నాలుగు రోజులు కష్టపడి... రూ.32వేల పెట్టుబడి పెడితే ఈ యంత్రం తయారవుతుంది. పొలంలో తిరగడానికి ఇనుప చక్రాలు, రోడ్డు మీద నడవడానికి టైర్లు బిగించి కొంత అప్‌గ్రేడ్‌ చేశాడు.
 

కలుపుపై గెలుపు

‘‘ఈ మినీ కల్టివేటర్‌తో కాలి నడకన పంట పొలాల్లో కలుపు తీసే అవకాశాలున్నాయి.  అలా కాకుండా కూర్చొని కలుపు తీసేందుకు వీలుగా టైర్లతో కూడిన యంత్రం తయారు చేయాలని ప్రయత్నిస్తున్నా. మరో రెండు నెలల్లో ఆ యంత్రం సిద్ధం కానుంది.’’

-మహిపాల్‌ చారి

శ్రీవరిసాగు వీడర్‌...
తన ఉత్పత్తిని పెంచాడు. ఇప్పుడు 10మందికి ఉపాధి చూపుతున్నాడు. పరిశ్రమగా ఏర్పాటు చేసి... మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కర్షకులకు ఈ యంత్రాలను ఉత్పత్తి చేసి అందిస్తున్నాడు. అంతేకాదు శ్రీవరి సాగులోనూ కలుపు సమస్యను పరిష్కరించడానికి మరో యంత్రానికి రూప కల్పన చేశాడు. దీని పేరు శ్రీవరిసాగు వీడర్‌. ఒక లీటర్‌ పెట్రోలుతో ఇది ఎకరం పొలంలో కలుపును తీస్తుంది. కొంచెం కష్టం, ఇంకొంచెం సృజన... సాధారణ యువకుడిని పారిశ్రామిక వేత్తగా మారుస్తాయని నిరూపించాడు.

ప్రశంసలు.. గుర్తింపు
నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌(ఎన్‌ఐఎఫ్‌) ఆధ్వర్యంలో 2015లో దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో వ్యవసాయ పరికరాల ప్రదర్శన నిర్వహించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి కడివెండి మహిపాల్‌చారి హాజరై కలుపు యంత్రం(మినీ కల్టివేటర్‌)ను ప్రదర్శించారు. ఇక్కడ కన్సోలేషన్‌ బహుమతి లభించగా రాష్ట్రపతి అవార్డు సైతం దక్కింది. రెండోసారి జాతీయ పురస్కారం లభించింది. నేషనల్‌ ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్‌ అవార్డు-2018ను ఈ నెల 4న దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు చేతుల మీదుగా అందుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ మంత్రిత్వ శాఖ నుంచి పురస్కారంతోపాటు రూ.5లక్షల నగదును అందుకున్నాడు.

- గోగుల నాగరాజు, పరకాల

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని