ప్రేమ ప్రశ్నకు సమాధానమేంటి?

ప్రేమలో గెలుపేంటి?నచ్చిన వ్యక్తి వెంటే ఉండడం...ఏది ఏమైనా పెళ్లి చేసుకోవడం..దేన్నయినా స్వీకరించగలడం..వినాలేగానీ.. ఎన్నో సమాధానాలు!! మరైతే, ప్రేమ ఎలా పుడుతుంది? చెప్పలేం! ఏమో.. పుట్టింది అంతే! కారణాలు చెప్పలేను..ఎక్కువ మంది సమాధానాలు ఇలానే ఉంటాయ్‌. ఎందుకు?ఎలా పుడుతుందో చెప్పలేని ప్రేమకి.. గెలవడం.. ఓడిపోవడం.. ఏంటి? అది నిత్య నూతనం. సత్య జీవితం. పుట్టడానికి చెప్పలేని కారణాల్ని... గెలుపు.. ఓటముల్లో.. ఎలా చెబుతున్నారు?

Updated : 09 Feb 2019 06:21 IST

ప్రేమలో గెలుపేంటి?
నచ్చిన వ్యక్తి వెంటే ఉండడం...
ఏది ఏమైనా పెళ్లి చేసుకోవడం..
దేన్నయినా స్వీకరించగలడం.. 
వినాలేగానీ.. ఎన్నో సమాధానాలు!!
మరైతే, 

ప్రేమ ఎలా పుడుతుంది?
చెప్పలేం! 
ఏమో.. పుట్టింది అంతే!
కారణాలు చెప్పలేను..
ఎక్కువ మంది సమాధానాలు ఇలానే ఉంటాయ్‌. ఎందుకు?
ఎలా పుడుతుందో చెప్పలేని ప్రేమకి.. గెలవడం.. ఓడిపోవడం.. ఏంటి? అది నిత్య నూతనం. సత్య జీవితం. పుట్టడానికి చెప్పలేని కారణాల్ని... గెలుపు.. ఓటముల్లో.. ఎలా చెబుతున్నారు? 

ప్రేమలో ఓటమేంటి?
ఆంక్షలు విధించడం..
అభిప్రాయ భేదాలు రావడం..
ఎక్కువగా ఆశించడం.. 
పంచుకోవాలేగానీ మరెన్నో కారణాలు...
ఈ ప్రశ్న అడుగుతోంది మరెవరో కాదు. ఓటమి పేరుతో ప్రాణాలు పోగొట్టుకున్న ప్రేమ!! దాడులకు గురై విలవిల్లాడుతున్న ప్రేమ!! ఓ నిండు జీవితానికి కత్తిగాట్లు చేసిన ప్రేమ..  ప్రేమికులారా? ఏం సమాధానం చెబుతారు? ప్రేమలో గెలుపు.. ఓటములు గురించి ఆలోచించడం మానేసి.. ప్రేమ ఎందుకు పుట్టిందో తెలుసుకోండి. అదెలాంటి ప్రేమో అర్థం చేసుకోండి. ఆకర్షణ ఓఎస్‌పై ప్రేమ ప్రోగ్రామ్‌ని ఒక్కసారి కంపైల్‌ చేసి వదిలేయడం కాదు. నిత్యం అప్‌డేట్‌ చేస్తుండాలి. వెర్షన్లు మారుతున్నకొద్దీ మీకు స్పష్టత వస్తుంది. బగ్స్‌ ఏమైనా వస్తే సరి చేసుకోవచ్చు. ఏకంగా తిరగరాసుకోవచ్చు. భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌, అనుష్కల మధ్య ఇలా ఒకసారి భేదాభిప్రాయాలు వచ్చాయి. వారు మూలాలకు వెళ్లి సర్దుకున్నారు. ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. అలా ఉన్నప్పుడు ప్రేమలో గెలుపు, ఓటములు జీవిత గమనంపై నెగిటివ్‌గా ప్రభావితం చేయవు. మరింత పాజిటివ్‌గా ముందుకు తీసుకెళ్తాయి. ఎలాగంటే..

మార్కులేసుకోవద్దు

ఇంటర్‌.. డిగ్రీ... ఇంజినీరింగ్‌.. చదువుల కాలం. ఎవ్వరైనా ఆలోచించేది మార్కుల గురించే. సాధించే మార్కులే పాస్‌, ఫెయిల్‌ని పరిచయం చేస్తాయి. పాస్‌ అయితే పార్టీ చేసుకుంటారు. ఫెయిల్‌ అయితే ‘ఏముందీ.. సెప్టెంబరు ఉందిగా!’ అంటారు. ఇంత వరకూ బాగానే ఉంది. మరి, ఈ వయసులో పుట్టే ప్రేమ సంగతేంటి? ఒకటే క్లాస్‌ రూమో.. పక్క బ్రాంచో.. చూపులు కలుస్తాయ్‌. ప్రేమంటారు. పోటీ పడి లవ్‌ చేసుకుంటారు. దానికి మార్కులు వేసుకుంటారు. పాస్‌ అయితే ఫర్వాలేదు. ఫెయిల్‌ అయితే.. ఎగ్జామ్‌లా లైట్‌ చేసుకోరెందుకు? చదువులో ఉన్న స్పష్టత ప్రేమలో ప్రదర్శించరెందుకు? పాఠ్యాంశాల్ని రివ్యూ చేసినట్టుగా ప్రేమనీ రివ్యూ చేయరెందుకు? చదువుల్లో మార్కుల ఆరాటం తగ్గి పాఠ్యాంశాలపై అవగాహన పెంచుకుంటే సబ్జెక్టులో సారాన్ని గ్రహిస్తాం. ఇదే మాదిరి ప్రేమ పుస్తకంలోనూ సెమిస్టర్లు ఉంటాయ్‌. అదేదో క్రాష్‌ కోర్సులా తీసుకోవద్దు. ఒక్కో సెమిస్టర్‌ని అర్థం చేసుకుంటూ వెళ్తే ప్రేమలోని సారాన్ని గ్రహిస్తాం. గెలుపు, ఓటములకీ అతీతంగా ఎందుకు ప్రేమించారో అవగతమవుతుంది. అప్పుడు ప్రేమలో పీహెచ్‌డీ వైపు ప్రయాణం మొదలవుతుంది. ఇక మీదైన డైలాగ్‌ ఇలా ఉండొచ్చు...
- ప్రేమించిన వ్యక్తిని వదులుకోవడం అంటే..
ప్రేమని వదులుకోవడం కాదు!!

లెక్కలేసుకోవద్దు

ఎమ్‌ఎన్‌సీ కంపెనీ కావచ్చు.. ఏ గల్లీలోనో ఉన్న చిన్న సంస్థ కావచ్చు. సంపాదిస్తూ.. కెరీర్‌లో ఎదగాలనుకునే కాలం. ఇక్కడ అన్నింటిలోనూ లెక్కలే. సమయానికి ఇంక్రిమెంట్‌లు.. పదోన్నతులు వస్తే ‘సక్సెస్‌’ అనుకుంటూ సెటిల్‌ అవుతారు. లేదంటే.. రిజైన్‌ చేసి వేరే కంపెనీలకు వెళ్తారు. తప్పేం లేదు. మరి, ఈ వాతావరణంలో పుట్టే ప్రేమ మాటేంటి? పక్కన  డెస్క్‌ కావచ్చు.. ఆఫీస్‌ క్యాబ్‌లో ముందు సీటు కావచ్చు.. ఒకరికొకరికి ‘హాయ్‌.. బాయ్‌’లతో పరిచయం.. ప్రేమ. ఎప్పుడు, ఎక్కడ కలుద్దాం అంటూ ఆహ్వానాలు. లెక్కలు పక్కాగా ఉన్నా.. ఏవేవో కారణాలతో ప్రేమ బ్యాలెన్స్‌ తప్పితే. జీవితం అంధకారం ఎలా అవుతుంది? వెంటనే లవ్‌ బ్యాలెన్స్‌ షీట్‌ని రివ్యూ చేయాలి. మీరెందుకు ప్రేమని డిపాజిట్‌ చేయాలనుకున్నారో విశ్లేషించండి. జీవనాధారమైన ఉద్యోగం విషయంలో బాధ్యతగా మెసలుకునేప్పుడు జీవితం మొత్తం ఆస్వాదించే ప్రేమలో ఇంకెంత బాధ్యతగా మెలగాలి. లోటుపాట్లుంటే సరి చేసుకుని ఒకరికొకరు ప్రేమలో డెబిట్‌, క్రెడిట్‌ అవ్వాలి తప్పితే.. ఎకౌంట్‌ని డిలీట్‌ చేద్దాం అనే ఆలోచనకు రాకూడదు. ఒకవేళ లవ్‌ బ్యాంకులో మీ ఎకౌంట్‌ పొసగకుంటే లావాదేవీల్ని ముగించుకుని ముందుగు సాగేందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడు ప్రేమపై మీ కోణం ఇలా ఉండొచ్చు...
- ప్రేమించినోళ్లు భాగస్వాములు కాకపోవచ్చు.
భాగస్వామిగా వచ్చిన వారూ ప్రేమించొచ్చు!

పరిస్థితులే మారేది!

ఎందుకు ప్రేమిస్తున్నారు? అనే ప్రశ్నకు సమాధానాలు భిన్నంగా ఉంటాయి. పూర్తిగా వ్యక్తిగతమైనవి. అయితే, కచ్చితంగా ప్రేమని వ్యక్తం చేయడానికి ముందే అవగాహనకి రావాలి. అప్పుడు ప్రేమించేవారిని భిన్న కోణాల్లో నుంచి చూడ్డానికి వీలు పడుతుంది. అప్పుడే ఎలాంటి స్పందనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు ఇరువురి చుట్టూ ఉన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఓ అంచనాకి వస్తుండాలి. ఇద్దరు ఏడాది నుంచి ప్రేమలో ఉన్నారు. అనుకోకుండా వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయంటే.. వారు మారిపోయారు అనుకోవడం కరెక్టు కాదు. వారి చుట్టూ ఉన్న పరిస్థితులు మారాయ్‌ అనుకోవాలి. అప్పుడు ఒకరిపై ఒకరికి ద్వేషం పుట్టకుండా.. వారి చుట్టూ పరిస్థితులపై విశ్లేషణ మొదలవుతుంది. దీంతో వారికున్న పరిధులపై స్పష్టత వస్తుంది. అప్పుడు ఇరువురు నిందించుకోవడం మానేసి.. వారి చుట్టూ ఉన్న పరిస్థితులపై పోరాటం మొదలెడతారు. అవగాహనకొస్తారు. అప్పుడు ఒకరి నిర్ణయం పట్ల మరొకరికి గౌరవం పుడుతుంది. దేన్నయినా స్వీకరించడానికి సిద్ధపడతారు. 

- టీఎస్‌ రావు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని