2050? 

తర్వాత తరాల కోసం...తరలిన తెలుగు తేజం! 2050.. ఉత్తరభారతం వేడెక్కిన పెనంలా మారిపోబోతోంది అక్కడి రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తారు... ఉత్తరభారతదేశం నుంచి దక్షిణాదికి ప్రజలు వలసలు వస్తారు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వంటి పొరుగుదేశాలూ ఇదే బాటపడతాయి.. పోలీసులకు భద్రతా సవాళ్లు ఎదురవుతాయి....

Published : 16 Feb 2019 00:34 IST

తర్వాత తరాల కోసం...తరలిన తెలుగు తేజం! 2050.. ఉత్తరభారతం వేడెక్కిన పెనంలా మారిపోబోతోంది అక్కడి రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తారు... ఉత్తరభారతదేశం నుంచి దక్షిణాదికి ప్రజలు వలసలు వస్తారు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వంటి పొరుగుదేశాలూ ఇదే బాటపడతాయి.. పోలీసులకు భద్రతా సవాళ్లు ఎదురవుతాయి.. రాజకీయ నాయకుల అజెండాలూ మారతాయి.. ఇవన్నీ వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినవికావు కొట్టిపారేసి ఊరుకోవాల్సిన విషయాలూ కావు.. నవ్వుకుని వదిలేయాల్సినవీ కావు. రాబోయే విపత్తుకు సూచనలంటూ ఐరాస వేదికగా ఎలుగెత్తుతుందో గళం. ప్రపంచ యువతరాన్ని తట్టిలేపుతున్న  ఆ స్వరం మరెవరో కాదు ఐరాస సచివాలయంలో రాజకీయ వ్యవహారాల అధికారిగా పనిచేస్తున్న తెలుగు తేజం రాజా కార్తికేయ గుండు..

ఇంజినీరింగ్‌ చదివి ఉంటే నా జీవితం ఎలా ఉండేదో ఊహించుకోవడం పెద్ద కష్టమేం కాదు. వారాంతాల్లో ఆనందం వెతుక్కుని మళ్లీ వీకెండ్స్‌ వచ్చేంతవరకు ఎదురుచూసేవాడినేమో! కానీ అలా జరగలేదు. నా జీవితాన్ని అలాంటి మూసలోంచి బయట పడేసిన సంఘటనలు రెండు ఉన్నాయి. ఒకటి నేను నిజాం కాలేజీలో చదువుతుండగా 2001 గుజరాత్‌ భుజ్‌లో గణతంత్ర దినోత్సవం రోజు వచ్చిన  భూకంపం. ఆ సమయంలో గుజరాత్‌ వెళ్లిన నేను స్విట్జర్లాండ్‌ ఆర్మీతో కలిసి అక్కడి ప్రభుత్వం వద్దన్నా వినకుండా సహాయక బృందంలో చేరాను. శిథిలాల కింద ఉన్న ఓ నాలుగేళ్ల పాపని, మరో ముగ్గురి ప్రాణాలని కాపాడాను. ఎలా మర్చిపోతాను ఆ సంఘటనను! రెండోది.. 2004లోని పెను సునామీ నాటి ఘటన. అండమాన్‌ నికోబార్‌లో  ప్రజలని రక్షించడానికి అక్కడికి వెళ్లాను. నాతో పాటు సహాయక పనులు చేస్తున్న ఒకాయన గురించి ఆరా తీశాను. భార్య, కొడుకు సునామీలో పడి కొట్టుకుపోయారట. తన చేతిలో బిడ్డ ప్రాణాలతోనే ఉన్నాడు. కానీ జ్వరం. అయినా నాతో పాటు సునామీ సహాయ చర్యల్లో పాల్గొన్నాడు. నీకు అవసరమా అని అడిగాను? ‘మా ఊరు మాత్రం మా కుటుంబంలాంటిది కాదా సార్‌’ అన్నాడు. ఆశ్చర్యం అనిపించింది. మా అమ్మ డైనింగ్‌ టేబుల్‌ ముందు కూర్చున్న ప్రతిసారి ఓ మాట అనేది. ఓరేయ్‌ మనం అన్నం వడ్డించుకునేటప్పుడు మన తర్వాత తినేవాళ్లకి కూడా ఉందో లేదో చూసుకోవాలిరా అనేది. ఈ మాటలే.. నేను, నా కోసం అని హద్దులు గీసుకోవడం కాదు నా తర్వాత తరాలకి నేనేం మిగిల్చిపోతున్నానూ అనే ఆలోచనను నేర్పాయి.

పక్కా గాంధేయవాది ఆయన... 
నేను పుట్టింది వైజాగ్‌లో. నాన్నది ఏలూరు. అమ్మది శ్రీకాకుళం దగ్గర వాదాడ. తాతగారు గుండు వెంకట కృష్ణమూర్తి పక్కా గాంధేయవాది. ఆయనే నాకు స్ఫూర్తి. 86 ఏళ్ల వయసులో కూడా రాట్నంతో ఒడికిన నూలుతో నేసిన దుస్తుల్నే ధరించేవారు. నాన్న వల్లీశ్వర్‌ విలేకరి కావడంతో దేశమంతా తిరిగాను. ఇంజినీరింగ్‌లో సీటు రాలేదు. మేనేజ్‌మెంట్‌ కోటాకి వెళ్లడం ఇష్టం లేక నిజాం కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివాను. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ 99 బ్యాచ్‌ ఆల్‌ఇండియా టాపర్‌ని. కొన్ని ఆరోగ్య కారణాలరీత్యా అందులో కొనసాగలేకపోయాననుకోండి. తర్వాత దిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌లో చదువుకున్నాను. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌ వైపుగా వెళ్లేవాడినే. కానీ అలా జరగలేదు. నిజాం కాలేజీలో ఉన్నప్పుడే పైన చెప్పిన భుజ్‌ సంఘటన జరిగింది. తర్వాత సునామీ ఘటన. మనమేం చేయగలం అనే పదం నాకు నచ్చదు. ఏదో ఒకటి చేయాలి అనే తపన విపరీతంగా ఉండేది. సునామీ సమయంలో అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నాను. వేలాది శవాలు. ఓ రోజు దారితెలియక అడవిలో చిక్కుకున్న నాకు అనుకోకుండా ఓ దారి కనబడింది. నిజానికి ఆ దారి గురించి మన సైన్యాలకు కూడా తెలియదు. ఆ దారిని జపాన్‌ ప్రభుత్వం రెండో ప్రపంచం యుద్ధ సమయంలో వేసి మర్చిపోయింది. ఈ విషయాన్ని భారతీయ సైన్యాలకు చెప్పగానే అడవుల్లో ఉన్న ప్రజలను చేరుకోవడానికి ఆ దారిని ఉపయోగించుకున్నాయి. ఇప్పుడు అది ప్రధాన రహదారిగా మారింది. ఈ సంఘటనల తర్వాత అమెరికా వెళ్లి జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ చదువుకున్నాను. ఆ తర్వాత కొంతకాలం యూఎస్‌ కాంగ్రెస్‌లో పనిచేశాను. అక్కడ నుంచి ఐక్యరాస్యసమితి సచివాలయంలో రాజకీయ సంబంధాల అధికారిగా 2011 నుంచి పనిచేస్తున్నాను.

ప్రజల్లో నమ్మకం పెంచడమే మా పని... 
దేశాలకు దేశాలకు మధ్య జరిగే యుద్ధాలు ఎంత వినాశనాన్ని తెస్తాయో తెలిసిందే. నిజానికి అంతర్యుద్ధాలు కూడా దేశాలని అంతకుమించి అతలాకుతలం చేస్తాయి. ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడమే ఈ అంతర్యుద్ధాలకి కారణం. రాజకీయ సంబంధాల అధికారిగా నా పని.. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం రావాలంటే ఎటువంటి విధానాలు తయారుచేయాలో ఐరాస రాయబారులకు సలహాలివ్వటం. అందులో భాగంగానే అఫ్ఘానిస్థాన్‌, ఇరాక్‌లతో పనిచేశాను. ప్రస్తుతం న్యూయార్క్‌లో పనిచేస్తున్నాను. ఇరాక్‌లో ఉగ్రవాదం, వలసలు మీకు తెలిసిందే. అఫ్ఘానిస్థాన్‌ది కాస్త భిన్నమైన వాతావరణం. అక్కడ నాలుగేళ్ల పాటు పనిచేశాను. ఇరాక్‌లో రెండేళ్లు పనిచేశాను. నిజానికి ప్రతి సంవత్సరం దేశంమారొచ్చు. కానీ నాకు మాత్రం ఒక దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మనం మనస్ఫూర్తిగా అక్కడి అభివృద్ధికి సంబంధించిన సూచనలు చేయగలం అనిపిస్తుంది. అందుకే చిన్నాపెద్దా అని చూడకుండా ప్రతి ఒక్కరితో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపించేవాడిని. మూడుసార్లు అక్కడ జరిగిన ఎన్నికల్లో పనిచేశాను. అన్ని రోజులు అక్కడ పనిచేసిన తర్వాత నాకు ప్రజాస్వామ్యం విలువ ఎంతగొప్పదో అర్థమైంది. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఐరాస సచివాలయంలో పాలస్తీనా వివాదంపై పనిచేస్తున్నాను.

ఆస్ట్రేలియాలో ఇదే మాట్లాడుతున్నా... 
గతంతో పోలిస్తే ప్రకృతి విపత్తుల గురించి ఇప్పుడు ఎక్కువ చర్చించుకుంటున్నాం. అందులో మానవ తప్పిదం ఉందనీ ఒప్పుకుంటున్నాం. సరే.. ఆ ప్రకృతి విపత్తుల విషయంలో మన సంసిద్ధత ఎంత? అంటే మనం ఆ మార్పులకు అడాప్ట్‌ అవుతున్నామా? అనేది నా ప్రశ్న. లేదు! ఇది లేకపోవడం వల్లనే కేరళ వరదల్లో అంత ఆస్తినష్టం. అంతకు మందు ముంబయి వరదలు. రైతు ఆత్మహత్యల్లో ప్రభుత్వాల పాత్రే కాదు.. పర్యావరణ పాత్రనీ మనం గుర్తించాలి. నష్టాన్ని తగ్గించుకోవడానికి అన్ని రంగాలతో కలిసి తగిన విధానాలు తయారు చేసుకోవాలి. పర్యావరణ మార్పులని కచ్చితంగా అంచనా వేయడానికి ఒక సంవత్సరం కాలంలోనే ఆర్కిటిక్‌, అంటార్కిటిక్‌ రెండు ధ్రువాలకు చేరుకున్నా. ఎంతో వేగంగా అక్కడి మంచు కరిగిపోతోంది. అయితే మనకేంటి అనుకోవద్దు. ఈ పర్యావరణ మార్పులు రాజకీయ, సామాజిక భద్ర]తా విషయాల్లో పెనుమార్పులు తీసుకొస్తాయి. అదెలా అంటారా? 2050లో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు 52 డిగ్రీలకు చేరుకుంటాయి. ఈ వేడి తట్టుకుని రైతులు బయట పని చేయలేరు. ఐదుకోట్లమంది ప్రజలు అక్కడ నుంచి దక్షిణాదికి వలస రావొచ్చు. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ వంటి చుట్టుపక్కల దేశాల నుంచీ వలసలు పెరగొచ్చు. దాంతో రాజకీయ సమస్యలు మొదలై, పోలీసు బలగాలు పెంచడం వంటి సవాళ్లు ఎదురవటం ఖాయం. సముద్రాల్లో ఆమ్లగుణాలు పెరగడం వల్ల మత్స్య సంపద తరుగుతోంది. ఆహారకొరతని ఎలా ఎదుర్కోవాలి? ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు సిడ్నీ, మెల్‌బోర్న్‌లలో జరిగే ‘ది ఆస్ట్రేలియా ఇండియా యూత్‌ డైలాగ్‌’ సదస్సులో ఈ విషయాలన్నీ చర్చిస్తున్నా. తక్కిన సంపన్న దేశాల మాదిరిగా కాకుండా నిరంతర అభివృద్ధితో ఉన్న దేశం ఆస్ట్రేలియా. ఆ దేశం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అక్కడ ఓటు వేయకపోతే రుసుము కట్టాల్సిందే. భవిష్యత్తులో ఆస్ట్రేలియా, భారత్‌ కలిసి పనిచేయాల్సిన సందర్భాల గురించీ చర్చించనున్నాం.

గురజాడ అప్పారావుగారు, శ్రీశ్రీ రచనలంటే ఇష్టం. పరాయి దేశాల్లో తెలుగు పుస్తకాల గురించి, తెలుగు రచయితల గురించి మాట్లాడ్డం అంటే చాలా ఇష్టం.

- శ్రీసత్యవాణి గొర్లె


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని