ప్రేముంచేస్తున్నారు

రమ్య ఇంటర్‌తోనే చదువు ఆపేసింది. కుటుంబ భారాన్ని మోసేందుకు షాపింగ్‌ మాల్‌లో సేల్స్‌ గర్ల్‌గా మారింది. పని వేళలు.. వెళ్లే రూటూ రోజూ ఒకటే. మాల్‌లో రోజూ వందల మందిని చూసే తనకి ఓ వ్యక్తి మాత్రం భిన్నంగా అనిపించేవాడు. తను వెళ్లే రూటులో రోజూ ఒకో చోట తారసపడేవాడు. తననే చూస్తూ.. అప్పుడప్పుడూ మాల్‌లోకీ వచ్చేవాడు. మాట కలిపాడు. ప్రేమిస్తున్నా అంటూ మెప్పించాడు. ఇద్దరం ఏదైనా లాంగ్‌ టూర్‌కి వెళ్దాం అంటూ ఒప్పించడానికి చూసేవాడు......

Updated : 16 Mar 2019 01:57 IST

లెట్స్‌ చెక్‌

ప్రేమలో మునగడం వేరు..ప్రేమలో ముంచేయడం వేరు..టీనేజ్‌లో కచ్చితంగా తెలుసుకోవాల్సిన థియరీ ఇది!! ఏవేవో ఫార్ములాల్ని ఫాలో అవ్వక్కర్లేదు. ‘జీరో పాయింట్‌ నథింగ్‌’లో మీరున్నారేమో చెక్‌ చేసుకోండి!!


* రమ్య ఇంటర్‌తోనే చదువు ఆపేసింది. కుటుంబ భారాన్ని మోసేందుకు షాపింగ్‌ మాల్‌లో సేల్స్‌ గర్ల్‌గా మారింది. పని వేళలు.. వెళ్లే రూటూ రోజూ ఒకటే. మాల్‌లో రోజూ వందల మందిని చూసే తనకి ఓ వ్యక్తి మాత్రం భిన్నంగా అనిపించేవాడు. తను వెళ్లే రూటులో రోజూ ఒకో చోట తారసపడేవాడు. తననే చూస్తూ.. అప్పుడప్పుడూ మాల్‌లోకీ వచ్చేవాడు. మాట కలిపాడు. ప్రేమిస్తున్నా అంటూ మెప్పించాడు. ఇద్దరం ఏదైనా లాంగ్‌ టూర్‌కి వెళ్దాం అంటూ ఒప్పించడానికి చూసేవాడు. రమ్య తిరస్కరించేది. ఎలాగోలా ఒప్పించాడు. కట్‌ చేస్తే. ముంబయి వీధుల్లో పిచ్చిచూపులు చూసుకుంటూ.. చిరిగిన దుస్తుల్లో రమ్య.. భాషరాని చోట.. బాధని పంచుకునేవారు లేక.. బేలగా చూస్తోంది!!

*‘విజయ్‌ దేవరకొండ అంటే నాకు పిచ్చి’ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ చాలా పెద్దగా అరిచింది అభినయ. కార్తీక్‌కి వినిపించేలా. తనని చూసి నవ్వాడు. ఇద్దరూ ఇంజినీరింగ్‌ సెకండ్‌ ఇయర్‌. మాటలే కాదు. అభిరుచులూ ఒక్కటే అనుకుంటూనే సెమిస్టర్‌లు ముగుస్తున్నాయి. సినిమాలు.. షికార్లు.. టూర్‌లు. కట్‌ చేస్తే.. ఇంజినీరింగ్‌ చివరి సెమిస్టర్‌. అభినయ ప్రవర్తనలో మార్పు. తప్పుకొని తిరగడం మొదలుపెట్టింది. కారణం చెప్పేది కాదు. కార్తీక్‌ ముందే వేరొకరితో క్లోజ్‌గా తిరగడం.. ఎదురు పడితే చూసిచూడనట్టు వెళ్లిపోవడం. కార్తిక్‌ తట్టుకోలేకపోయాడు. చదువుపై ఫోకస్‌ చేయలేక.. క్లాస్‌ రూమ్‌లో ఉండలేక ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకేశాడు. కొన్ని నెలలుగా కోమాలోనే ఉన్నాడు.
... ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. పెట్రోల్‌ దాడులు, కత్తితో దాడులు, ఆత్మహత్యలు ఎన్నో!! మాకెందుకీ క్రైం స్టోరీస్‌ అనుకుంటున్నారా? ఆకర్షణ.. తడబాటు.. పొరబాటు.. పేరేదైనా యువత అక్షరాలా వలపు వలలో ఈజీగా చిక్కుకుంటోంది. గుండెపై కమిలిన గాయంతో అసలైన ప్రేమపై అపనమ్మకం పెంచుకుంటోంది. ఇలా తప్పటడుగులు వేయడంలో అబ్బాయిలు.. అమ్మాయిలకు తేడా లేదు. కలలు కూలిపోవడం కామన్‌.


‘నథింగ్‌’లా మిగిలిపోవద్దు
జీవితంలో ‘జీరో’గా ఉండడం వేరు.. జీరో నుంచి జీవితాన్ని ప్రారంభించడం వేరు. కొన్ని విషయాల్లో మనం ‘జీరో’ కావడమ కొంప ముంచుతోంది. ప్రేమ ప్రస్థానంలో అనూహ్య మలుపులకు కారణమవుతోంది. ఎదుటివారు ఈజీగా మనపై వలవిసిరేలా చేస్తోంది. ఉచ్చుల్లో పడేలా చేస్తోంది.జీరో లక్ష్యం: ‘చదువులో నా సామర్థ్యం ఎంత? జీవితంలో ఏం సాధించాలి?’ ఇటువంటి లక్ష్యాలు ఏమీ లేని జీవితమే మనకు అతిపెద్ద ఉచ్చు! లక్ష్యమంటూ ఉన్నవాళ్లు.. అందుకోసం కష్టపడేవాళ్లెవరూ లవ్‌ ట్రాప్స్‌లో అంత ఈజీగా పడరు.జీరో ప్రేమ: కారణాలేవైనా.. ఇతరుల నుంచి సానుభూతి కోరుకోవడం. వారనుకునే ప్రేమ కోసం తపించడం.. ఎదుటివారు మనల్నే చూస్తున్నారనుకోవడం.. మనకోసం తపిస్తున్నట్టు ఆరాటపడటం.. అభిరుచులు కలవడం.. ఇవి ఉంటే చాలు. ప్రేమనుకుంటారు. కానీ, అది ఒట్టి ఆకర్షణే.జీరో స్వేచ్ఛ: కావాల్సినంత స్వేచ్ఛ లేదనుకోడం. దీంతో ఏ చిన్న అవకాశం దొరికినా సంకెళ్లు తెంచుకుని విహరించాలనుకోవడం. ఇదే ఇతరులకు అవకాశం. ఇంకేముందీ.. ఏం ఆశిస్తున్నారో దాన్ని బిస్కెట్‌లా వేస్తారు. ట్రాప్‌లో పడతారు.జీరో నిగ్రహం: ఆనందం, బాధ ఏదైనా నిగ్రహించుకోలేకపోవడం. వెంటనే ప్రదర్శించడం. దీంతో క్లారిటీ కోల్పోడం. ఎంత తెలివైన వాళ్లయినా నిగ్రహం లేకుంటే ఈజీగా బుట్టలో పడతారు. ఈ వీక్‌నెస్‌ ఆధారంగా లవ్‌వల పన్నేందుకు కాచుకుని ఉంటారు.జీరో విచక్షణ: మంచిచెడుల్ని బేరీజు వేసుకునే విచక్షణ లేకపోవడం. దాని వల్ల ఎలాంటి పర్యవసానాల్ని ఎదుర్కోవాల్సివస్తుందో అని తిరిగి ఆలోచించకపోవడం. దీంతో భవిష్యత్తుపై ఎలాంటి అవగాహన ఉండదు. తప్పటడుగు అప్పుడే పడుతుంది.


ప్రేమించడం అంటే ఎంజాయ్‌ చేయడం కాదు. మీదైన వ్యక్తిత్వానికి బలం పెంచుకోవడం. నమ్మే సిద్ధాంతాల్ని పంచుకోవడం. ఒకరికి మరొకరు బలం అవ్వడం. ఇరువురి కలలకు కొత్త రెక్కలవ్వడం. ఇవేం పట్టకుండా ముంచే ప్రేమలో పడితే. ఎంజాయ్‌మెంట్‌ ముందుంటుంది. అదే నిజం అనుకుని ముందుకెళ్లే వాళ్లు ఒక్కసారి ఆలోచించండి.. భవిష్యత్తులో ఎప్పుడు తలచుకున్నా ఆనందానుభూతుల్ని అందించేదే నిజమైన ఎంజాయ్‌మెంట్‌! అలాకాకుండా మళ్ళీ తలచుకోకూడదు... మరచిపోతే బాగుండు.. అదో పీడకల అనిపించేది ఎంజాయ్‌మెంట్‌ కానేకాదు. మిలీనియల్స్‌ సెల్ఫ్‌లవ్‌పై కూడా అవగాహన పెంచుకోవాలి. ఎవరినివారు ఇష్టపడుతూ స్పష్టత కలిగి ఉంటారో అలాంటి వారు త్వరగా ప్రభావితం అవ్వరు. ముఖ్యంగా అమ్మాయిల్లో ఇలాంటి దృక్పథం ఉంటే మంచిది. అంతేకాదు.. మీరు జీరోగా ఉన్నప్పటికీ మిమ్మల్ని హీరోల్ని చేస్తారనుకునేవారితో ప్రతీదీ పంచుకుంటే మంచిది. అనుకోకుండా పుట్టిన ప్రేమ.. ఆన్‌లైన్‌ లవ్‌ ఏదైనా పంచుకోండి.. అప్పుడే.. ‘జీరో పాయింట్‌ నథింగ్‌’లో ఉండరు.

- తన్వీ పిన్నమనేని, సైకాలజిస్ట్‌, పినాకిల్‌బ్లూమ్స్‌ నెట్‌వర్క్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని