అచ్చ తెలుగు..బ్యాండ్‌ బాజా!

మ్యూజిక్‌ బ్యాండ్స్‌ అంటే హాలీవుడ్‌, బాలీవుడ్‌ బీట్సే వినిపిస్తాయి.. కానీ ‘కప్రీషియో’ టీమ్‌ బ్యాండ్‌ శైలి ప్రత్యేకం. ‘పూవుల్లో దాగున్న పళ్లెంతో అతిశయం..’ అంటూ తీయని తెలుగు పాటల సాహిత్యానికి కొత్త బాణీలు అద్దుతారు.. ‘శశివదనే.. శశివదనే స్వర నీలాంబరి నీవా..’ అని తమ లైవ్‌ మిక్సింగ్‌ స్వరాలతో అలరిస్తారు.. కేవలం పాటలే కాదు.. అడపాదడపా తెలుగుదనం ఉట్టిపడేలా స్టేజ్‌లపై పంచెల్లో కనిపిస్తారు....

Updated : 13 Apr 2019 03:37 IST

మ్యూజిక్‌ బ్యాండ్స్‌ అంటే హాలీవుడ్‌, బాలీవుడ్‌ బీట్సే వినిపిస్తాయి.. కానీ ‘కప్రీషియో’ టీమ్‌ బ్యాండ్‌ శైలి ప్రత్యేకం. ‘పూవుల్లో దాగున్న పళ్లెంతో అతిశయం..’ అంటూ తీయని తెలుగు పాటల సాహిత్యానికి కొత్త బాణీలు అద్దుతారు.. ‘శశివదనే.. శశివదనే స్వర నీలాంబరి నీవా..’ అని తమ లైవ్‌ మిక్సింగ్‌ స్వరాలతో అలరిస్తారు.. కేవలం పాటలే కాదు.. అడపాదడపా తెలుగుదనం ఉట్టిపడేలా స్టేజ్‌లపై పంచెల్లో కనిపిస్తారు.. మూడేళ్లుగా వేదికలపై సంగీత సునామీని సృష్టిస్తున్న కప్రీషియో కుర్రాళ్లను ‘ఈతరం’ పలకరించింది.

‘మేము పక్కా లోకల్‌!! అంటూ.. మనం పుట్టి పెరిగిన కమ్మని తెలుగు భాషలోనే పాడుతూ మ్యూజిక్‌గా బ్యాండ్‌లా స్థిరపడలేమా?’ అనే కసితోనే ఆడియన్స్‌ ముందుకు వెళ్లామంటున్న తెలుగు బ్యాండ్‌ పుట్టింది హైదరాబాద్‌లోనే. కప్రీషియో ఇటలీ పదం. ‘లైఫ్‌ ఫార్‌్్మ ఆఫ్‌ మ్యూజిక్‌’ అని దానర్థం. ఈ బృందంలోని సాయితేజ బాణీలు కట్టడంలో స్పెషలిస్ట్‌. కిరణ్‌ మంచి గాయకుడు. వీరి స్నేహం నుంచి పుట్టిందే కప్రీషియో. ఇద్దరి అభిరుచీ కలవడంతో 2017లో బ్యాండ్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత కీబోర్డు ప్లేయర్‌ నోయల్‌, సింగర్‌ గణేష్‌లు కలిశారు. కొన్నాళ్లకు వీరి స్థానంలో కీబోర్డు ప్లేయర్‌ శ్రావణ్‌ జతకలిశాడు. సాయితేజ, కిరణ్‌, శ్రావణ్‌లకి సింగర్‌ దిన్కర్‌, బేస్‌ గిటారిస్ట్‌ శ్యామ్‌ తోడయ్యారు. ఇటీవలే రిథమ్‌ గిటారిస్టు అనిరుధ్‌ ‘కప్రీషియో’ బ్యాండ్‌లో చేరాడు.



మొహం మీదే మాట్లాడేవారు..

‘తొలినాళ్లలో మేం ఇంగ్లిష్‌, హిందీ పాటల్ని పాడేవాళ్లం. ఏ బ్యాండ్‌లోనూ తెలుగు పాటలు వినిపించేవి కావు. అందరిలా మనమెందుకు ఉండాలి? తెలుగులోనే బ్యాండ్‌ ఎందుకు నడపలేం’ అనుకున్నాం అంటాడు సాయితేజ. ఈ విషయం కిరణ్‌కి చెప్పాడు. మిగతా సభ్యులదీ ఇదే మాట. దీంతో తెలుగుపాటల్ని పాడటం ప్రారంభించారు. అందరూ ఉన్నత విద్యావంతులే. మంచి ఉద్యోగాలే! అయినా, నెల జీతం, ఆఫీసు గోడలు.. ఇలా ఈ ఇన్‌బాక్స్‌లో ఇమడలేని తత్వం వారిది. అందుకే కష్టపడితే పోయిందేముందని బౌండరీలను దాటారు. సాయితేజ తప్ప మిగతావాళ్లంతా తల్లిదండ్రుల్ని ఏడాది గడువు అడిగారు. తామనుకున్నది వర్కవుట్‌ కాకుంటే మీ మాటే వింటామని సర్దిచెప్పి బ్యాండ్‌ మోగించారు. తొలినాళ్లలో పబ్స్‌, కాఫీ షాప్స్‌.. వేదికలపై తెలుగులో పాటలు పాడుతుంటే వీరిని ఎవరూ పట్టించుకోలేదు. కొందరు ‘తెలుగులో బ్యాండ్‌ ఏమిటి?.. మీకేమైనా పిచ్చిపట్టిందా?’ అంటూ విమర్శించారు కూడా! వారాంతాల్లో కూడా కేవలం ఐదు, పదిమంది మాత్రమే షో చూసేవారు. అయినా వెనక్కి తగ్గలేదు వీళ్లు. ఈరోజు కాకుంటే రేపైనా మరింతమంది వింటారనే నమ్మకంతో ముందడుగేశారు. ‘కొత్తతరానికి తెలుగు సంస్కృతి చాటి చెప్పేలా పంచెకట్టు, ఖాదీ చొక్కాతో ప్రదర్శనలు ఇచ్చేవాళ్లం. అయితే పంచె సరిగ్గా కట్టుకోవడం రాక వేదికపైనే ఊడిపోయిన సందర్భాలూ ఉన్నాయి.. ప్రస్తుతం పండగలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పంచెకట్టుతో అలరిస్తున్నామ’ని చెప్పుకొచ్చాడు తేజ.



అదే మా కల

ఈ ఆరుగురికి ఎ.ఆర్‌.రెహ్మాన్‌ అంటే ఆరోప్రాణం. చాలా షోల్లో రెహ్మాన్‌ పాటలే ఎక్కువగా ఆలపిస్తుంటారు. ఇళయరాజా పాటలతో మైమరిపిస్తుంటారు. ‘ఏ దివిలో విరిసిన..’ వంటి ఆ పాతమధురాలూ అందుకుంటారు. ఒక పాట నుంచి మరో పాటలోకి.. ఓ చరణం చటుక్కున కట్టిపడేస్తుంది.. ఓ పల్లవి ఆలోచనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది.. చకచకా ట్రాక్స్‌ని మార్చేస్తూ క్షణాల్లో సంగీత ప్రియుల్ని తమ మెలోడీతో మాయ చేసేస్తారు. హైదరాబాద్‌తో పాటు విశాఖ, విజయవాడ, గోవా లాంటి ప్రాంతాల్లోనూ కమ్మని తెలుగు పాటలతో అలరించిందీ బృందం. షో మధ్యలో హిందీ, ఇంగ్లిష్‌ పాటలు పాడమని ఎవరైనా అడిగితే.. ‘మా సిద్ధాంతం తెలుగు పాటలు పాడటమే’ అని ముక్తకంఠంతో జవాబిస్తారంతా! అంతేకాదు ఈ బ్యాండ్‌లో డ్రమ్స్‌ గోల ఉండదు. ఎలక్ట్రికల్‌ గిటారు మోగదు. శ్రావ్యమైన వాద్యాలతో వీనుల విందైన పాటలను అందిస్తారు. ఇన్నాళ్లూ దేశీయంగా అభిమానం మూటగట్టుకున్న కప్రీషియో.. ఇప్పుడు అమెరికాలోని తెలుగువాళ్లను మెప్పించే పనిలో ఉంది. సొంతంగా స్వరాలు కూర్చి సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది కూడా. ‘తెలుగువాళ్లుండే ప్రతి చోటుకి వెళ్లి అలరించాలనేదే మా లక్ష్యం. ఏ.ఆర్‌.రెహ్మాన్‌ చూస్తుండగా ఒక షో ప్రదర్శించాలన్నది మా జీవిత కల. అంతేకాదు మంచి మంచి ఆల్బమ్స్‌ చేసి అంతర్జాతీయంగా తెలుగులో బెస్ట్‌ బ్యాండ్‌ ఏదంటే కప్రీషియో అని అందరూ చెప్పుకోవాల’ని అంటారీ మ్యూజిక్‌ తరంగ్స్‌!



‘పాడుతా తీయగా’ పునాది
- కిరణ్‌


 

ఈ బ్యాండ్‌లో సింగర్‌ని అయిన నేను.. హైదరాబాద్‌లో పుట్టిపెరిగా. చదువులపై ఆసక్తి లేకపోవటంతో బిటెక్‌ మధ్యలో మానేశా. అమ్మ లేరు, నాన్న రిటైర్డ్‌ ఉద్యోగి. నాకో అక్క ఉంది. ఐదో తరగతి నుంచి కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నా. మా గురువు పేరు ప్రతిమ శశిధర్‌. ఇపుడీస్థితిలో ఉన్నానంటే ఆమె చలవే. నేను ‘పాడుతా తీయగా’ కార్యక్రమం క్వార్టర్‌ ఫైనల్స్‌కి రావటంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కర్ణాటక సంగీతంతో పాటు.. హిందుస్థాన్‌, పాశ్చాత్య సంగీతంపై టచ్‌ ఉంది. ఏ జోనర్‌ అయినా పాడతాను. ముఖ్యంగా మెలోడీలంటే ఇష్టం. నాకే కాదు మా బ్యాండ్‌కీ మంచి పేరు రావాలన్నదే నా ఆశ



అంతా మ్యూజిక్‌ ఆర్టిస్టులమే
- సాయి తేజ

మాది హైదరాబాద్‌. మా అమ్మ శారద ‘సితార’ ప్లే చేస్తుంది. నాన్న రమణమూర్తిగారు తబలా ఆర్టిస్టు. నేను, మా చెల్లి పర్క్యూషన్స్‌ (వాద్యాలు) ప్లే చేస్తాం. ఇలా ఇంటిల్లిపాదీ మ్యూజిక్‌ ఆర్టిస్టులే. బీటెక్‌ చదివే రోజుల్లోనే నేను పదిహేడు, మా చెల్లి పదమూడు పర్క్యూషన్స్‌ (మొత్తం 30 ఇన్‌స్ట్రుమెంట్స్‌) 50 నిమిషాల్లో ప్లే చేశాం. దీంతో లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డు లభించింది. నేను విప్రోలో ఉద్యోగం చేసేవాణ్ణి. రాత్రి ఉద్యోగం. మా నాన్నకి నేను ఉద్యోగం చేయటం నచ్చక సరిగా మాట్లాడేవారు కాదు. సంగీతం వైపు ప్రయత్నాలు చేయాలన్నదే ఆయన కోరిక. ఆర్నెల్ల తర్వాత ఉద్యోగం ఏంటో అర్థమైంది. రాజీనామా చేశా.



ఇంట్లో ప్రోత్సాహం
- దిన్కర్‌

మా అమ్మ పద్మ గృహిణి. నాన్న డాక్టర్‌ గోపాల్‌కిషన్‌ రావు. ఎలక్ట్రానిక్‌ ఇంజినీర్‌గా రిటైర్‌ అయ్యారు. నేను చిన్నప్పుడే కర్ణాటక సంగీతం నేర్చుకున్నా. బీ-ఫార్మసీ తర్వాత లండన్‌లో ఉద్యోగం చేశా. కొన్నాళ్లకు చెన్నై వచ్చి ఉద్యోగం చేస్తుండగా    ‘ఇట్స్‌ మై లవ్‌స్టోరీ’ సినిమాలో ‘నిన్నలా లేదే..’ పాట పాడే అవకాశం వచ్చింది. ఉద్యోగం, సంగీతం.. ఇలా రెండు పనులు చేస్తూ పోయా. ఇంట్లోవాళ్లు సంగీతం కొనసాగించమని ప్రోత్సహించారు. దాదాపు వంద సినిమాల్లో పాటలు పాడాను. గతేడాది నవంబరు 1 నుంచి ‘కప్రీషియో’తో నా ప్రయాణం మొదలైంది.



కంపోజర్‌ కావాలని
- శ్రావణ్‌

మాది వరంగల్‌. నాన్న అనిల్‌కుమార్‌ సంగీతజ్ఞుడు. నాకు కీబోర్డు నేర్పించింది నాన్నే. కాంటెంపరరీ మ్యూజిక్‌ చేస్తా. జాజ్‌ మ్యూజిక్‌ ఇష్టం. కప్రీషియో నన్ను నిలబెట్టింది. మ్యూజిక్‌ కంపోజర్‌ కావాలన్నది నా కల.



ఇంటర్‌ నుంచి
- శ్యామ్‌

మాది హైదరాబాద్‌. నాన్న జనార్దన్‌, అమ్మ అంజనాదేవి. మా బృందంలో బేస్‌ గిటార్‌ ప్లే చేస్తా. ఇంటర్‌ నుంచి గిటార్‌ నేర్చుకోవడం ప్రారంభించా. మంచి మ్యుజిషియన్‌గా రాణించాలన్నది నా ఆశయం.

- రాళ్లపల్లి రాజావల

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని