మీ గమ్యానికో జీపీఎస్‌

దారెటైనా..ఫోన్‌లో జీపీఎస్‌ ఆన్‌ చేస్తాం! వేగంగా గమ్యాన్ని చేరుకుంటాం. అలాగే, లైఫ్‌లో లక్ష్యం ఏదైనా.. వేగంగా, క్షేమంగా చేరుకునేందుకు మీకో జీపీఎస్‌ ఉందా? మరైతే ఎందుకు ఆలస్యం? లైఫ్‌ నెట్‌వర్క్‌ని రీసెట్‌ చేయండి. మీరు ఏ లొకేషన్‌లో ఉన్నా ఇలా సిద్ధం అవ్వండి. ఇక మీ గమనంలో సంతోషం వై-ఫైలా వెంటే తిరుగుతుంది....

Updated : 20 Apr 2019 06:11 IST

దారెటైనా..ఫోన్‌లో జీపీఎస్‌ ఆన్‌ చేస్తాం! వేగంగా గమ్యాన్ని చేరుకుంటాం. అలాగే, లైఫ్‌లో లక్ష్యం ఏదైనా.. వేగంగా, క్షేమంగా చేరుకునేందుకు మీకో జీపీఎస్‌ ఉందా? మరైతే ఎందుకు ఆలస్యం? లైఫ్‌ నెట్‌వర్క్‌ని రీసెట్‌ చేయండి. మీరు ఏ లొకేషన్‌లో ఉన్నా ఇలా సిద్ధం అవ్వండి. ఇక మీ గమనంలో సంతోషం వై-ఫైలా వెంటే తిరుగుతుంది.

*విఘ్నేష్‌ కష్టపడి చదివాడు. కానీ, మంచి మార్కులు రాలేదు. తను ఆశించిన గ్రేడు రాలేదని మానసిక ఒత్తిడికి గురయ్యాడు. చుట్టూ ఉన్నవారు తనని తక్కువ చేసి చూస్తారన్న ఆలోచన మరో వైపు. మదిలో రకరకాల ఆలోచనలు చుట్టుముట్టేస్తున్నాయి. ఎటు వెళ్లాలో తెలియడం లేదు. ఎవరితో పంచుకోవాలో అర్థం కావడం లేదు. లైఫ్‌ మ్యాప్‌పై తన జీపీఎస్‌ నావిగేషన్‌ స్ట్రక్‌ అయ్యింది. అప్పుడు విఘ్నేష్‌ ఏ వైపు వెళ్లాలి?

* వర్షిణికి ఆశించిన గ్రేడే వచ్చింది. కానీ, ఆ సంతోషం ఎంతో సమయం లేదు. ఎందుకంటే ఇప్పుడు తన లక్ష్యం పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకుని సాధించడం. కానీ, ఏదో తెలియని ఆందోళన. పోటీ పరీక్షల్లో రాణించగలనా? అని. సమయాన్ని సద్వినియోగం చేసుకోగలనా?.. నాకంత సామర్థ్యం ఉందా?.. ఇలా నెగిటివ్‌ ఆలోచనలు బుర్రలో. ఎలా ఆపాలి? ఎక్కడ ఆపాలి? వర్షిణికి అర్థం కాని పరిస్థితి.

... విఘ్నేష్‌, వర్షిణిలేనా? చాలా మంది మిలినియల్స్‌కి చదువు, ఉద్యోగంలో ఎప్పటికప్పుడు నెట్‌వర్క్‌ జామ్‌ అవుతుంది. ‘నిబద్ధతతో పని చేసినా సమయానికి ప్రాజెక్టుల్ని  పూర్తి చేయలేకపోతున్నాననో.. సరైన గుర్తింపు రావడం లేదనో..నా జీవితం ఎందుకిలా నిస్సారంగా ఉందనో.. ’ ఇలా కారణాలు  టీనేజర్లు ఆందోళనలకు గురవుతూ వారి గమనాన్ని  గందరగోళం చేసుకుంటున్నారు. అందుకే వారి జీపీఎస్‌ని  రీసెట్‌ చేయడం అనివార్యం. దీంతో దారి పొడవునా పాజిటివ్‌ సిగ్నల్స్‌ చేరతాయి.


మీరెలాంటి ‘ఓపెనర్‌’

క్రికెట్‌లో ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌లే కీలకం. ఓపెనింగ్‌ ఇన్నింగ్స్‌ బాగుంటే మ్యాచ్‌ మొత్తం పాజిటివ్‌గా సాగుతుంది. జట్టుకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇదే మాదిరి రోజులో మీ ఓపెనింగ్‌ ఇన్సింగ్స్‌ ఎప్పుడు మొదలు పెడుతున్నారనేది చాలా కీలకం. ఓ 24 గంటలు మీ అధీనంలో ఉండాలంటే మీ జీపీఎస్‌ ‘5ఏఎం’కే ఆన్‌ అవ్వాలి. ట్రాఫిక్‌ ఎలర్ట్‌లు, రూట్‌ ఛేంజ్‌ల్ని సూచించకుండా జీపీఎస్‌ సరాసరి గమ్యానికి చేరుస్తుంది. చదువుల్లో ఫార్ములాలైనా.. స్టార్టప్‌ స్కిల్స్‌ అయినా.. మైండ్‌ ర్యామ్‌లోకి త్వరగా చేరతాయి.
అప్పుడే వన్‌డే మ్యాచ్‌లా మీ పని ప్రణాళికాబద్ధంగా సాగుతుంది. జీవన గమనంపై నియంత్రణ సాధించాలంటే.. తెల్లవారు జాములన్నీ  మీ వశం అవ్వాలి. లేచాక కొంత సమయం పాటు మీ వ్యక్తిగత జీవితాన్ని విశ్లేషిస్తూ డైరీ రాయండి.


అవో ‘క్రిటిక్స్‌’ అంతే!

జీపీఎస్‌ ఫాలో అవుతూ కొన్నిసార్లు రాంగ్‌ టర్న్‌ తీసుకుంటాం. రూట్‌ మ్యాప్‌ని సరిగా సెట్‌ చేసుకుని చేరాల్సిన చోటుకి చేరతాం. ఇదే మాదిరి లైఫ్‌లోనూ దారితప్పుతాం. బ్యాడ్‌ సిగ్నల్స్‌లా అవి బ్యాడ్‌ డేస్‌ అన్నమాట! బాధని కలిగిస్తాయి. భయం వేస్తుంది. ప్రయాణాల్లో సిగ్నల్స్‌ లేక సిమ్‌ డిసేబుల్‌ అయినట్టుగా జీవితంలో ఇలాంటి కష్టమైన రోజులు రావడం సర్వసాధారణం. చెప్పాలంటే.. అవో క్రిటిక్స్‌ మనలో లోపాల్ని ఎత్తి చూపేందుకు అతిథుల్లా వచ్చిపోతుంటాయి. వాటిని ఆహ్వానించాలే తప్పా కంగారు పడి దూరంగా పారిపోకూడదు.


మీ డ్రైవర్‌ ఎవరు?

విజయం కోసం సాగించే ప్రయాణంలో ‘సక్సెస్‌’నే డ్రైవర్‌గా పెట్టుకోవాలనుకోవడం కరెక్టు కాదు. సంతోషం మీ డ్రైవర్‌ అవ్వాలి. అప్పుడే మీరు సెట్‌ చేసిన జీపీఎస్‌ ‘జాయ్‌’తో నిండిపోతుంది. దీంతో జర్నీ సంతోషంగా వెళ్లాల్సిన చోటుకి చేరుతుంది. దారిపొడవునా మీ జాయ్‌ని రెట్టింపు చేసే మనుషులు ఎదురవుతారు. సందర్శించే ప్రాంతాలు మీకు సంకల్ప బలాన్ని పెంచుతాయి. అప్పుడు మీకు సంతోషాన్నిచ్చే వాటిని చేయడానికి ఏ మాత్రం వెనకాడరు. ఈ క్రమంలో దారిపొడవునా ఎత్తు పల్లాల్లా ఎదురయ్యే నెగిటివ్‌ స్పీడ్‌ బ్రేకర్లను కుదుపు లేకుండా దాటేస్తారు.


జర్నీలో ‘బ్రేక్స్‌’

ఏకబిగిన ప్రయాణం అంటే అలసటే. అందుకే ఆహ్లాదకరమైన చోటుని వెతుక్కుని సేద తీరతాం. ఇదే మాదిరిగా వారంలో వచ్చే ‘సన్‌డే’ని ఆహ్లాదకరంగా ప్లాన్‌ చేయండి. సన్నిహితులతో కలిసి వంట చేసుకుని తినండి. ఇలా మిమ్మల్ని మీకు కొత్తగా చూపేది ఏదైనా చేయండి. మీకు మీరు ‘సెల్ఫ్‌హెల్ప్‌’ చేసుకోవాలి. మీకు మీరే పుస్తకాలు బహుమతిగా ఇచ్చుకుని చదవండి. ప్రేరణ కలిగించే పాడ్‌క్యాస్ట్‌లు వినండి. దీంతో వారం మొత్తం మీరు శక్తిమంతంగా పని చేస్తారు.


ఫాలో ‘ఫార్ములాస్‌’

*చక్కని మానవ సంబంధాలు ఉండాలి
* దేంట్లోను వెలితి కనిపించనివ్వొద్దు
* మీతో మీరే సాన్నిహిత్యం పెంచుకోవాలి.
* పరిధుల్ని పెట్టుకుని మీతో ఉన్న హీరోని జీరో చేయొద్దు.
* భయాన్ని పోగొట్టే సాహసయాత్రలు చేయండి. 

* భయాన్ని పోగొట్టే సాహసయాత్రలు చేయండి.
* వ్యాయామం చేస్తూ మీ శరీరాన్ని మీరే ఆశీర్వదించుకోవాలి.
* ప్రకృతి ఒడిలో ఎక్కువగా గడపండి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని