జనం మూలం ఇదమ్‌ స్టార్టప్‌!

చుట్టూ అల్లుకున్న సమస్య చూడగలిగి, వాటి నుంచి అవకాశాల్ని సృష్టించుకునేవారే నిజమైన స్టార్టప్‌ లీడర్లు. ప్రతి సమస్యని అవకాశంగా మలుచుకుని దానికి తగిన పరిష్కారంతో అంకుర సంస్థగా ముందుకొస్తే చాలు. ప్రజలే ఆదరిస్తారు. ఆయువు పోస్తారు. విజయవంతమైన ఏ స్టార్టప్‌లోనైనా ప్రధానంగా కనిపించేది ఒకటే..

Published : 11 May 2019 02:06 IST

స్టార్టప్‌ కోచ్‌

చుట్టూ అల్లుకున్న సమస్య చూడగలిగి, వాటి నుంచి అవకాశాల్ని సృష్టించుకునేవారే నిజమైన స్టార్టప్‌ లీడర్లు. ప్రతి సమస్యని అవకాశంగా మలుచుకుని దానికి తగిన పరిష్కారంతో అంకుర సంస్థగా ముందుకొస్తే చాలు. ప్రజలే ఆదరిస్తారు. ఆయువు పోస్తారు. విజయవంతమైన ఏ స్టార్టప్‌లోనైనా ప్రధానంగా కనిపించేది ఒకటే.. ‘జనాలకు చేకూరే మేలు.’
మదిలో మెదిలే ఆలోచనకు మూలం ఉంటుంది. మరి, మీ స్టార్టప్‌ ఆలోచనకు మూలం ఏంటి?
ఎప్పుడైనా ఆలోచించారా? లేదనేది సమాధానం అయితే.. ఇప్పుడైనా థింక్‌ చేయండి. ఎందుకంటే.. దేనికైనా మూలాల్లోకి వెళ్తేనే స్పష్టత వస్తుంది.. మీ ఆలోచనకు ఉన్న బలం తెలుస్తుంది!
* విఘ్నేష్‌కి మొదట్నుంచీ క్రికెట్‌ అంటే ఇష్టం. ఉన్నత చదువుల్లోనూ క్రికెట్‌ వెంటే. చదువు అయ్యాకా అదే ధ్యాస. చివరికి తన స్టార్టప్‌ కూడా క్రికెట్‌ రంగానికి సంబంధించినదే అయ్యుండాలనుకున్నాడు. ఎంతో ఆలోచించాడు. ఎన్నో ఐడియాలు.. ఒక్కటీ వర్కవుట్‌ కాలేదు. కారణం తెలియక సతమతమయ్యాడు. తనకి ఎంతో ఇష్టమైన క్రికెట్‌ని దూరంగా తరిమేశాడు. విశాలమైన గ్రౌండ్‌లో వికెట్ల మధ్య ఒంటరిగా మిగిలిపోయాడు.
- ప్రియ ఫ్యాషన్‌ గర్ల్‌. స్కూల్‌ ఫ్యాషన్‌ పోటీల్లో తనే ఫస్ట్‌. కాలేజీకి వచ్చే సరికి తనో ఫ్యాషన్‌ ఐకాన్‌. చదివిందీ ఫ్యాషన్‌ టెక్నాలజీనే. ఇంకేముందీ.. ఈ రంగంలోనే తనో ప్రత్యేక స్థానం సంపాదించాలనుకుంది. సొంతంగా స్టార్టప్‌ పెట్టింది. భిన్నమైన కలెక్షన్స్‌ని రూపొందించింది. మార్కెటింగ్‌ చేసింది. ఆశించిన స్థాయిలో ఆదరణ రాలేదు. గుర్తింపు దక్కలేదు. దీంతో డిప్రెషన్‌కి లోనయ్యింది. అయోమయంతో తనపై నమ్మకాన్ని కోల్పోయింది.

విఘ్నేష్‌, ప్రియలే కాదు. చాలా మంది మిలీనియల్స్‌ అంకురాలతో చిగురిస్తూ మహా వృక్షాల్లా మారాలనుకుని మొగ్గదశలోనే వాడిపోతున్నారు. అన్ని వనరులు సక్రమంగా ఉన్నా విజయం ముందు చతికిలపడుతున్నారు? కారణాలు చాలానే ఉన్నా. ప్రధానంగా ఒక్కటి మాత్రం మననం చేసుకోవడం లేదు. అదే ‘జనం..’ అంకుర సంస్థలతో ఎదగాలనుకునే వారందరూ మర్చిపోతున్న విలువైన ఫార్ములా. ‘జనం మూలం ఇదమ్‌ జగత్‌!’. మీరు చదివింది కరెక్టే. ‘ధనం మూలం ఇదమ్‌ జగత్‌’ అన్నట్టుగా. స్టార్టప్‌లను విజయవంతంగా నడపాలంటే జనాల మధ్యకి వెళ్లాలి. సమాజంలో భాగం కావాలి.

జనం.. జనం..
దేశంలో ఎక్కడికైనా వెళ్లండి. జనం.. జనం.. 130 కోట్లకు పైనే. రైలు టికెట్లు దొరకవు. సినిమా హాళ్లు హౌస్‌ఫుల్‌.. ఎన్ని షాపింగ్‌ మాల్స్‌ ఓపెన్‌ చేసినా ఖాళీగా కనిపించవు. పరిమిత వనరులు.. విపరీతంగా ఉన్న జనాభా. ఇదే ఫోకస్‌ పాయింట్‌ అవ్వాలి. ఉదాహరణకు ఒకప్పుడు గంటలు గంటలు లైన్లో నిల్చుంటేగానీ.. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సినిమా టికెట్లు దొరికేవి కావు. ఇప్పుడు.. ఉన్నచోటే కూర్చుని మహర్షి సినిమా టికెట్లు బుక్‌ చేస్తున్నారంటే టికెట్టు బుకింగ్‌ సర్వీసులే అందుకు కారణం. ఇంకా చెప్పాలంటే.. కొన్నేళ్ల ముందు ఇష్టమైన బిరియాని తినాలంటే ఎండనకా.. వాననకా హోటళ్లు వెతుక్కుంటూ వెళ్లాల్సిందే. ఇప్పుడు.. క్షణాల్లో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే.. నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తోంది. ఇలా మీరేదైనా తీసుకోండి. ప్రజాదరణ పొందిన స్టార్టప్‌ ఏదైనా జనం పడుతున్న ఇబ్బందుల నుంచి పుట్టుకొచ్చిందే. అలా కాకుండా ‘నేను నా ఆలోచనలు.. నేనూ నా అభిరుచులు’ అనే ధోరణిలో ఆలోచిస్తే అంకుర సంస్థ ఎదుగుదల పరిమితంగానే ఉంటుంది.
వాళ్లే నాయకులు
ప్రజా సమస్యల్ని గుర్తించి వాటికి తగిన పరిష్కారాల్ని చూపించిన వారే నాయకులవుతారు. వారు ప్రజల చేత ఎన్నుకోబడతారు. నాయకులుగా కీర్తిగడిస్తారు. ఇదే మాదిరిగా జనం చుట్టూ అల్లుకున్న సమస్య చూడగలిగి, వాటి నుంచి అవకాశాల్ని సృష్టించుకునేవారే నిజమైన స్టార్టప్‌ లీడర్లు. ప్రతి సమస్యని అవకాశంగా మలుచుకుని దానికి తగిన పరిష్కారంతో అంకుర సంస్థగా ముందుకొస్తే చాలు. ప్రజలే ఆదరిస్తారు. ఆయువు పోస్తారు. విజయవంతమైన ఏ స్టార్టప్‌లోనైనా ప్రధానంగా కనిపించేది ఒకటే.. ‘జనాలకు చేకూరే మేలు.’ అది ఎలాగైనా కావచ్చు. ఉరుకుల పరుగుల జీవితాల్లో కాస్త సంతోషాన్ని పంచేదై ఉండొచ్చు. శ్రమని తగ్గిస్తూ కంఫర్ట్స్‌ని అందించేది కావొచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ పనులు చక్కబెట్టే వీలు కల్పించిన వాట్సాప్‌.. ఎక్కువ శ్రమ పడకుండా బిల్లు చెల్లింపులు చేసే వెసులుబాటు కల్పించిన పేటీఎం.. లాంటివి అదే కోవలోకి వస్తాయి. అవి ఒకప్పుడు అంకుర సంస్థలే. ఇప్పుడవి ప్రపంచ ప్రజానికానికి ఎంతగా దగ్గరయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
వారే ప్రామాణికం
దైనందిన జీవితంలో ఎన్నో చూస్తుంటాం. కాలేజీ బస్సు కిటికీలో నుంచి.. ఆఫీస్‌కి వెళ్తూ మెట్రో రైలు విండోలో నుంచి.. బయటి ప్రపంచాన్ని నిశితంగా చూస్తుంటాం. ‘అయ్యో..’ అనిపించే సందర్భాలు ఎన్నో ఉంటాయ్‌. మీరు పుట్టిన పల్లెటూరు మొదలు ఇప్పుడు మీరు తిరుగుతున్న మెట్రో నగరాల వరకూ ప్రజలు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు మీరు పరిష్కారం అవ్వొచ్చు. మీరు చేసే ఆవిష్కరణలకు మూలం జనమే అయితే పెట్టుబడుల కోసం కాళ్లు అరిగేలా తిరగక్కర్లేదు. ఆవిష్కరణ వెనకున్న ఉద్దేశాలే ఇన్వెస్టర్లను మీ దగ్గరికి తీసుకొస్తాయి. నేటి డిజిటల్‌ ప్రపంచంలో మీ స్టార్టప్‌లకు ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగు పరచగలిగే శక్తి పుష్కలంగా ఉండాలి. అప్పుడే యూజర్లు మీరు అందించే సర్వీసుకి దగ్గరవుతారు. దీంతో మీ యూజర్‌బేస్‌ పెరుగుతుంది. మీ స్టార్టప్‌ విలువని నిర్ణయించేది ఒక్క లాభాలే కాదు. మీకున్న వినియోగదారుల సంఖ్య. అందుకే.. అప్పట్లో స్టార్టప్‌ దశలో ఉన్న వాట్సాప్‌ని లక్షల కోట్లు వెచ్చించి ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. దాని వెనకున్న ముఖ్య ఉద్దేశం ఒక్కటే.. వాట్సాప్‌ వినియోగదారుల్ని ఎఫ్‌బీ తమ వినియోగదారులుగా మలుచుకోవడం. అందుకే.. ‘జనం మూలం ఇదం జగత్‌’!!
కోటిరెడ్డి సరిపల్లి కేజీవీ గ్రూపు ఛైర్మన్‌

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని