పోకిరి కాదు..  నా ఊపిరి

రెండ్రోజుల నుంచి అనిత ఏదో తలచుకొని తెగ బాధ పడుతోంది. తను నా హాస్టల్‌మేట్‌. మంచి ఫ్రెండ్‌. ఏం జరిగిందని అడిగా. క్లాస్‌లో ఒకడు ఏడిపిస్తున్నాడంది. వాడి అంతు చూడాలని బయల్దేరాం.

Published : 25 May 2019 01:48 IST

రెండ్రోజుల నుంచి అనిత ఏదో తలచుకొని తెగ బాధ పడుతోంది. తను నా హాస్టల్‌మేట్‌. మంచి ఫ్రెండ్‌. ఏం జరిగిందని అడిగా. క్లాస్‌లో ఒకడు ఏడిపిస్తున్నాడంది. వాడి అంతు చూడాలని బయల్దేరాం. ‘ఏదో సరదాకి కామెంట్‌ చేశాను తప్ప ఏడిపించే ఉద్దేశం లేదు. తనింత సెన్సిటివ్‌ అనుకోలేదు.. సారీ’ గుడ్లురిమేసరికి కాళ్లబేరానికొచ్చాడు ఆ పోకిరి. చెప్పినట్టే తర్వాత అనిత జోలికి రాలేదు. ఫర్లేదు మంచి అబ్బాయే అనిపించింది. తనుండేది మా హాస్టల్‌ పక్కనే కావడంతో అప్పుడప్పుడూ కనిపించేవాడు. ఓసారి ఎదురుపడితే పలకరింపుగా నవ్వా. దగ్గరికొచ్చి చొరవగా మాట కలిపాడు. ‘నా పేరు ఆనంద్‌. నాకో చెల్లి. నాన్న ఊరిపెద్ద’ వివరాలు చెప్పాడు. ఆపై మా మధ్య వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ మామూలైపోయింది. తను బాగా కేరింగ్‌ టైపు. ఏదైనా అవసరం ఉంటే క్షణాల్లో వాలిపోయేవాడు. అన్ని పనులూ చేసిపెట్టేవాడు. ఓ అమ్మాయి పడిపోవడానికి ఇంతకన్నా ఏం కావాలి? తనకీ నేనన్నా ఇష్టమే. రోజులు గడుస్తున్నకొద్దీ మా ప్రేమాయణంలో వేగం పెరిగింది. మా కోర్సులైపోగానే ఇద్దరికీ ఉద్యోగాలొచ్చాయి. మా ప్రేమ గురించి పెద్దలకు చెప్పి పెళ్లికి ఒప్పించాలనుకున్నాం. కానీ ఓ సంఘటన మా ఆశల్ని కాలరాసింది.
ఆనంద్‌ చెల్లి ఎవరో అబ్బాయిని ప్రేమించింది. ఇంట్లో ఒప్పుకోరని తనతో పారిపోయే ప్రయత్నం చేసింది. పరువు పోయిన బాధలో ఆనంద్‌ నాన్నకి గుండెపోటొచ్చి ఆసుపత్రి పాలయ్యారు. ‘చెల్లిలా నువ్వూ ప్రేమలో పడి ఉన్న కాస్త పరువూ తీసి మమ్మల్ని చంపొద్ద’ని మాట తీసుకున్నారట. ఈ పరిస్థితుల్లో మేమేం చేయగలం? పెద్దల్ని చంపుకోలేక మా ప్రేమనే త్యాగం చేశాం. భార్యాభర్తలం కాకపోయినా జీవితాంతం మంచి స్నేహితుల్లా ఉండాలనుకున్నాం.
     ఇక్కడే నా జీవితం మరో మలుపు తిరిగింది. నన్ను గాఢంగా ప్రేమిస్తున్నానన్నాడో సీనియర్‌ కొలీగ్‌. ఆనంద్‌తో నా ప్రేమ, బ్రేకప్‌ విషయమంతా అతడికి చెప్పేశా. ‘ఇందులో తప్పేముంది? పరిస్థితులు అనుకూలించక మీరు విడిపోయారు. అయినా నాకేం అభ్యంతరం లేద’న్నాడు. ఆ మంచి మనసుకి కృతజ్ఞత చెబుతూనే అంగీకారం తెలిపా. పెళ్లయ్యాక నన్ను ఉద్యోగరీత్యా స్టేట్స్‌కి తీసుకెళ్లిపోయాడు. ఆర్నెల్లదాకా చిలకాగోరింకల్లా ఉన్నాం. ఆ తర్వాతే అసలు వ్యథ మొదలైంది. ఓసారి నేను ఇండియా వచ్చి తిరిగెళ్లా. తర్వాత తన ప్రవర్తనలో విపరీతమైన మార్పు. ఫోన్‌ మాట్లాడితే ‘నీ పాత లవర్‌తోనా’ అనేవాడు. ఎవరి నుంచి కాల్‌ వచ్చినా లౌడ్‌ స్పీకర్‌ ఆన్‌ చేయమనేవాడు. అద్దం ముందుంటే ‘ఎవరికోసం రెడీ అవుతున్నావ్‌’ అని వెకిలి కామెంట్లు. ఈ టార్చర్‌ భరించలేక ‘ఎందుకీ అనుమానం? ఆనంద్‌ నాకు బెస్ట్‌ఫ్రెండ్‌ మాత్రమే. మా మధ్య ఇంకేం లేదు. అయినా అతడితో మాట్లాడితే తప్పేంటి’ నిలదీశా. మరింత రెచ్చిపోయాడు. చేయి చేసుకోవడం మొదలెట్టాడు. ఇదంతా తెలిస్తే కన్నవాళ్లు బాధ పడతారని మౌనంగా భరించా. ఈలోపు మా వీసా గడువు తీరిపోయి ఇండియా వచ్చేశాం. ఇక్కడా అదే నరకం. తట్టుకోలేక ఓసారి పుట్టింటికెళ్లా. జరిగిందంతా చెప్పా. ఇరువైపులా పెద్దల్ని పిలిపించి మాట్లాడారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా మళ్లీ పాత బుద్ధి పోనిచ్చుకోలేదు. ధైర్యంగా ఉండే నేను బేలగా మారిపోయా. తీవ్ర మానసిక వేదన తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించా. పేరెంట్స్‌ వచ్చి తీసుకెళ్లిపోయారు. డైవోర్స్‌కి దరఖాస్తు చేశాం.
        అదిగో.. చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఆనంద్‌కి ఫోన్‌ చేశా. అప్పటికే తనకు పెళ్లై ఒక పాప. బాధ చెప్పుకొని ఏడిస్తే ఆప్తుడిలా ఓదార్చాడు. మానసిక ఒత్తిడి తగ్గించడానికి కౌన్సెలింగ్‌ ఇప్పించాడు. ‘ఉద్యోగం చేస్తేనే నీ బాధలన్నీ మర్చిపోతావ్‌, నీకంటూ ఓ గుర్తింపు ఉంటుంద’ని నాలో తపన రగిల్చాడు. ఎంబీఏలో చేర్చాడు. పెన్‌ నుంచి ఫీజు దాకా అన్నీ భరించాడు. అతడి ఆర్తి, నా కష్టం ఊరికే పోలేదు. ప్రస్తుతం నేను మంచి పొజిషన్‌లో ఉన్నానంటే ఇదంతా ఆనంద్‌ చలవే. వ్యర్థం అనుకున్న నా జీవితానికో అర్థం ఇచ్చాడు. మాది ప్రేమా? స్నేహమా? ఇంకేదైనా? చాలామంది చాలారకాలుగా అనుకుంటున్నారు. ఐ డోన్ట్‌కేర్‌. ఎప్పటికీ తనంటే నాకిష్టమే. ఈ జన్మలో అర్ధాంగి కాలేకపోయా. మరుజన్మకైనా అతడి కోసం ఎదురుచూస్తుంటా.
- అఖిల (పేర్లు మార్చాం)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని