నాలా మోసపోవద్దు

నా పేరు సావిత్రి. మాది హైదరాబాద్‌కు దగ్గర్లోని పట్టణం. నేను ఇంజినీరింగ్‌లో అడుగుపెట్టిన కొన్ని రోజులకే ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. బాగా మాట్లాడేవాడు. క్రమంగా మా ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. ఒక రోజు ప్రపోజ్‌ చేశాడు.

Published : 15 Jun 2019 00:20 IST

నా పేరు సావిత్రి. మాది హైదరాబాద్‌కు దగ్గర్లోని పట్టణం. నేను ఇంజినీరింగ్‌లో అడుగుపెట్టిన కొన్ని రోజులకే ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. బాగా మాట్లాడేవాడు. క్రమంగా మా ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. ఒక రోజు ప్రపోజ్‌ చేశాడు. కాదనడానికి నాకు ఎలాంటి కారణం కన్పించలేదు. ఓకే చెప్పేశాను. తనను పూర్తిగా నమ్మేశాను. అతనూ నేనే ప్రాణమన్నట్లే ఉండేవాడు. ప్రపంచంలో అన్నిటికంటే తనే ముఖ్యమయ్యాడు. ఇంజినీరింగ్‌ నాలుగేళ్లు... నాలుగు క్షణాల్లా గడిచిపోయాయి. నేను హైదరాబాద్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చూసుకొని... ఎంటెక్‌లో చేరాను. తను ఎంఎస్‌ చేయడానికి అమెరికాకు వెళ్లాడు. తను తిరిగి వచ్చిన వెంటనే మా పెళ్లి... కుటుంబం... ఇలా నేను కలల లోకంలో ఉండిపోయా. తను రోజురోజుకూ మాట్లాడటం తగ్గించేశాడు. మాట్లాడినా కసురుకోవడం ప్రారంభించాడు. నాకు అర్థమైంది తను నన్ను దూరం పెడుతున్నాడని.. కానీ నేనేం చేయలేకపోయాను. ఎందుకంటే తనంటే నాకు పిచ్చి. తను ఒక మాట మాట్లాడినా చాలులే అనుకునేదాన్ని. ఒక రోజు కాల్‌ చేసి ‘నేను నిన్ను సంతోషంగా చూసుకోలేను. నీకు పనికిరాను. మనం విడిపోదాం... బ్రేక్‌అప్‌’ అన్నాడు. తనే ప్రాణంగా కొట్టుకుంటున్న నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లైంది. ఎందుకిలా అని నిలదీశాను. తను పాత సమాధానమే చెప్పాడు. హృదయం కన్నీటి సంద్రమైంది. ‘తను నిన్ను వద్దంటుంటే పట్టుకు వేలాడటం మంచిది కాద’ని స్నేహితురాళ్లు ఓదార్చారు. నా మనసు నా మాట వినడం లేదు. మళ్లీమళ్లీ కాల్‌ చేశాను. తను లిఫ్ట్‌ చేయలేదు. తనే పిచ్చిగా బతికినదాన్ని పిచ్చిదానిగా మారిపోయాను. అమ్మకు విషయం తెలిసి... నన్ను ఇంటికి తీసుకెళ్లింది. ఓదార్చింది. నచ్చజెప్పింది. విషయం నాన్నకూ తెలిసిపోయింది. ఆయన కుమిలిపోయారు. నన్ను చూసి వాళ్లిద్దరూ దిగాలుపడిపోయారు. చాలాకాలం మౌనంగా ఉండిపోయాను. మామూలు మనిషిని కావడానికి ఆరునెలలు పట్టింది. మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి ఉద్యోగం చూసుకొన్నా. ప్రేమను మరిచిపోదామని కఠినంగా ప్రయత్నిస్తున్నా. ఇంతలో నాన్న గుండెపోటుతో చనిపోయారని అమ్మ ఫోన్‌ చేసింది. తట్టుకోలేకపోయాను. ఇంటికి వెళ్లిపోయాను. ఏడ్చాను. ఏడుస్తున్నాను. ఏడుస్తూనే ఉన్నాను. నా వల్లే నాన్నకు ఇలా అయ్యిందేమోనన్న అపరాధ భావన నన్ను కుంగదీస్తోంది. చచ్చిపోవాలనిపిస్తోంది. నేను వెళ్లిపోతే అమ్మ ఏమైపోతుందోననే ఆలోచన నన్ను ఆపేస్తుంది. ప్రేమ మిగిల్చిన విషాదానికి అయిదున్నర అడుగుల రాతి శిల్పంలా రోజూ చస్తూ బతుకుతున్నాను.
ఫ్రెండ్స్‌ అందరికీ నేను చెప్పేదొక్కటే... పెళ్లి అనే భరోసా లేకుండా ప్రేమకు అంగీకరించొద్దు...  నాలా మోసపోవద్దు.!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని