డీజేజేలు

ఉర్రూతలూగించే మ్యూజిక్‌కి... ఉన్నచోటు నుంచి కదల్లేని వ్యక్తే మూలం. ఉరిమే ఉత్సాహంతో యువత వేసే స్టెప్పులకు... కాలి చిటికెన వేలు కదల్చలేని టీనేజరే ఓ ఎనర్జీ. అందుకే ఆ కుర్రోడు డీజే అయ్యాడు. అమ్మ సాయంతో కలల్ని సాకారం చేసుకునే పనిలో ఉన్నాడు.

Published : 15 Jun 2019 00:25 IST

వ్యాధులను జయించిన రూపేష్‌

ఉర్రూతలూగించే మ్యూజిక్‌కి... ఉన్నచోటు నుంచి కదల్లేని వ్యక్తే మూలం. ఉరిమే ఉత్సాహంతో యువత వేసే స్టెప్పులకు... కాలి చిటికెన వేలు కదల్చలేని టీనేజరే ఓ ఎనర్జీ. అందుకే ఆ కుర్రోడు డీజే అయ్యాడు. అమ్మ సాయంతో కలల్ని సాకారం చేసుకునే పనిలో ఉన్నాడు.

అదొక పబ్‌... వాద్యాలున్న టేబుల్‌కు అవతలివైపు డీజే కూర్చుని ఉన్నాడు. అతని వేళ్లు లయబద్ధంగా మ్యూజిక్‌ను సృష్టిస్తుంటే...  అక్కడున్న యువతంతా ఉత్సాహంగా నృత్యం చేస్తున్నారు. వారిలో హుషారును తెప్పిస్తున్న ఆ డీజే మాత్రం అక్కడి నుంచి కదల్లేడు. ‘ఆస్టియోజెనిసిస్‌ ఇంపెర్‌ఫెక్టా’ వ్యాధి కారణంగా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 50సార్లకి పైగా అతని ఎముకలు విరిగిపోయాయి. ఆరోగ్యం సహకరించకపోయినా...డిగ్రీ పూర్తి చేశాడు. చక్రాల కుర్చీకి పరిమితమైనా మ్యూజిక్‌లో కోర్సు చేసి డీజేగా నిలబడ్డాడు. ‘డెల్‌ ఇఎంసీ ఇండియా’లో ఉద్యోగమూ సంపాదించాడు బెంగళూరుకు చెందిన రూపేష్‌ రాబర్ట్‌. ఆ ప్రయాణం... అతని మాటల్లోనే...

‘‘మాది బెంగళూరు. అమ్మ విమల, నాన్న స్టాన్లీ రాబర్ట్‌. 1992లో పుట్టా. అప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నానట. ఎడమకాలి మడమ కొంచెం వంకరగా ఉందట. దానికి వైద్యులు ఫిజియోథెరపీ ద్వారా సరిచేయొచ్చు అన్నారట. అయితే నా అనారోగ్యం నేను పుట్టిన 11వ రోజు నుంచే మొదలైంది. స్నానం చేయించి అమ్మ నన్ను నిద్రపుచ్చిన తరువాత నా ఎడమకాలి తొడ వాయడం గుర్తించింది. డాక్టర్‌కి చూపిస్తే విరిగిందని పిండి కట్టు వేశారట. మళ్లీ 21వ రోజున అలాగే జరిగింది. తిరిగి నెలలోపు మళ్లీ నా ఎడమకాలు విరిగిపోయింది. దాంతో వైద్యపరీక్షలు చేయించగా నాకు ఎముకలు విరిగే వ్యాధి ఉందని తెలిసింది. దాంతో కుర్చీ లేదా మంచానికే పరిమితమైపోయా.

అమ్మే అన్నీ...
అమ్మ నన్ను స్కూల్‌కు పంపాలని అనుకుంది. స్థానికంగా ఓ స్కూల్‌లో ఎల్‌కేజీలో చేర్పించింది. వారానికి ఒకసారైనా ఏదో ఒక ఎముక విరిగిపోతుంది. దానికి పిండి కట్టు వేయించుకుని, నాలుగురోజుల తరువాత ఆ కట్టుతోనే స్కూల్‌కు వెళ్లేవాడిని. అమ్మ నర్సుగా పనిచేసేది. ఆమె జీతం 900 రూపాయలే. చిన్న అద్దె గదిలో ఉండేవాళ్లం. నాన్న ఒక ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేసేవారు. ఆర్థికంగా చాలా వెనకబడి ఉండేవాళ్లం. అప్పులు చేసి అమ్మ నాకు చికిత్సలు చేయించేది. క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్‌లో ఉండేవాడిని.

సంగీతమే తోడుగా...
చిన్నప్పటి నుంచి సంగీతమంటే చాలా ఇష్టం. దాంతో నా ఆరోఏట నుంచే అమ్మ నాకు కీ బోర్డు నేర్పించింది. డిగ్రీ పూర్తయ్యాక డీజే అవ్వాలని ఉందని అమ్మకి చెప్పా. కోర్సు కోసం ‘బీట్స్‌ సెన్సేషన్‌-ప్రొ డీజే అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మ్యూజిక్‌ అకాడమీ’లో చేరా. ఇది కూడా పై అంతస్తులోనే. లిఫ్టు లేదు. అమ్మ నన్ను మోసుకెళ్లేది. క్లాసు అయిన తరువాత తీసుకొచ్చేది. అలా అక్కడ కోర్సు ముగించి డీజేగా మారా. మొదట స్నేహితుల ఇళ్లలో కార్యక్రమాలకు డీజేగా వెళ్లేవాడిని. అలా పెళ్లిళ్లలకు, పబ్‌ల్లో వాయించే అవకాశాలను పొందా. ఇప్పుడు డీజేగా పనిచేస్తున్నా. నా స్నేహితులు చేసిన కొన్ని లఘుచిత్రాలకు సంగీతాన్ని సమకూర్చా. భవిష్యత్తులో సినిమాలకు సంగీతాన్ని సమకూర్చాలని ఉంది. ఇళయరాజా పాటలంటే ఇష్టం. సమయం దొరికితే చాలు.. నేనూ... నా కీబోర్డు... అమ్మ... ఇవే నా ప్రపంచం.

క్యాన్సర్‌ సోకింది

నన్ను పట్టభద్రుడిని చేయాలని అమ్మ కోరిక. ఎక్కడా లిఫ్టు సౌకర్యం లేకపోవడంతో వెతికి వెతికి ఇండియన్‌ అకాడమీలో చేర్పించింది. బీకాం చదువుతుండగా మరో బాధ నన్ను వెంటాడింది. ఎడమ దవడ వాచింది. తీవ్రంగా జ్వరం..  బయాప్సీ టెస్టులో అది క్యాన్సర్‌ ట్యూమర్‌ అని చెప్పారు. రేడియో థెరపీ చేయాలన్నారు. నగలు అమ్మేసింది. బ్యాంకు నుంచి అప్పు తెచ్చింది. చికిత్సలో నెల రోజులపాటు శారీరకంగా నరకం అనుభవించా. వికలాంగ గుర్తింపు పత్రం, రేషన్‌కార్డులతో ఉచితంగా శస్త్రచికిత్స చేశారు. అప్పుడే నాకు ముఖానికి పెరాలసిస్‌ వచ్చే ప్రమాదముందన్నారు. చాలా భయపడ్డా. చివరికి కోలుకున్నా. అయితే క్యాన్సర్‌ నుంచి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ప్రతీ సంవత్సరం పరీక్షలు చేయించుకోవాల్సిందే. ఇంత అనారోగ్యంలోనూ బీకాం ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యా.
- సిహెచ్‌ వసుంధరాదేవి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని