ఆమె జ్ఞాపకాలతోనే నా ప్రయాణం

సీఎంఏ చివరి సంవత్సరం శిక్షణ కోసం విజయవాడలోని ఒక కోచింగ్‌ సెంటర్‌లో జాయినయ్యాను. ఒకరోజు మధ్యాహ్నం క్లాసు ముగించుకుని వస్తుంటే మొదటిసారిగా సాహితిని చూశాను. ఇంతకుముందు ఎన్నడూలేని అనుభూతి కలిగింది. ఆమె ఎంతోకాలం నుంచి తెలిసిన ఆప్తురాలిలా అనిపించింది. తను నా జూనియరని తెలిసింది. అప్పటినుంచి రోజూ తను కాలేజీకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు అనుసరిస్తూ ఉండేవాడిని. స్నేహితులంతా

Updated : 22 Jun 2019 01:17 IST

సీఎంఏ చివరి సంవత్సరం శిక్షణ కోసం విజయవాడలోని ఒక కోచింగ్‌ సెంటర్‌లో జాయినయ్యాను. ఒకరోజు మధ్యాహ్నం క్లాసు ముగించుకుని వస్తుంటే మొదటిసారిగా సాహితిని చూశాను. ఇంతకుముందు ఎన్నడూలేని అనుభూతి కలిగింది. ఆమె ఎంతోకాలం నుంచి తెలిసిన ఆప్తురాలిలా అనిపించింది. తను నా జూనియరని తెలిసింది. అప్పటినుంచి రోజూ తను కాలేజీకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు అనుసరిస్తూ ఉండేవాడిని. స్నేహితులంతా నీ మనసులో మాట చెప్పమని ప్రోత్సహించేవారు. కానీ తెలియని బిడియం, ఎందుకిలా వెంటపడుతున్నావని ఎక్కడ నిలదీస్తుందోననే భయంతో నా ఇష్టాన్ని చెప్పలేకపోయాను. పరీక్షలు పాసైన తర్వాత.. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తన తల్లిదండ్రులను అడగాలని ఆ క్షణంలోనే గట్టిగా నిర్ణయించుకున్నా. కష్టపడి చదివి పరీక్షలు పాసై మద్రాస్‌ స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాను. ఇదంతా జరగడానికి రెండేళ్లు పట్టినా తనను మరచిపోలేదు. ఉద్యోగంలో చేరిన రెండు నెలల తర్వాత తనను వెతుక్కుంటూ విజయవాడ వెళ్లాను. తను హైదరాబాద్‌లో ఉంటుందని తెలిసి వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఇంతలో సహోద్యోగి మల్లీశ్వరి పరిచయమైంది. మాటల సందర్భంలో మల్లీశ్వరి, సాహితితో కలిసి చదువుకుందని తెలిసింది. నా ఆనందానికి అడ్డులేకుండా పోయింది. ఆమె నుంచి చిరునామా తీసుకొని, వెంటనే ఉద్యోగానికి రెండు రోజులు సెలవుపెట్టి తన కోసం వెళ్లాను. వాళ్ల ఇంటికి వెళుతున్నప్పుడు... ఎలా పరిచయం చేసుకోవాలి.. తన తల్లిదండ్రులను పెళ్లికి ఎలా ఒప్పించాలని ఆలోచిస్తూనే చిక్కడపల్లిలోని వాళ్లింటికి వెళ్లి తలుపుతట్టాను. తలుపు తీసిన పెద్దాయనకు నన్ను నేను పరిచయం చేసుకున్నాను. సాహితితో కలిసి చదువుకున్నానని చెప్పాను. ఆ తర్వాత మెల్లగా సాహితిని ప్రేమించానని, నాతో పెళ్లికి అంగీకరించమని వేడుకున్నాను. ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. సాహితి వాళ్ల అమ్మగారిని పిలిచి ఇద్దరూ బాధపడటం మొదలుపెట్టారు. ఏం జరుగుతుందో నాకేమీ అర్థంకాలేదు. ‘‘అమ్మా, ప్రేమించడం తప్పయితే నన్ను క్షమించండి. నా మనసులో మాట చెప్పానుగానీ మిమ్మల్ని బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు’’ అన్నాను. వాళ్లు అతికష్టం మీద తమాయించుకుని ‘‘సాహితి ఇకలేదయ్యా’’ అన్నారు. నాకంతా అయోమయంగా ఉండి నోటమాట రాక అలా చూస్తూ ఉండిపోయా. ‘‘సాహితీ విజయవాడలో ఉన్నప్పుడే ఒకబ్బాయిని ప్రేమించింది. అతడు కాదనడంతో ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది’’ అన్నారు. నాకు కన్నీరాగలేదు. ఇక అక్కడ ఉండలేక వెంటనే బయలుదేరాను. ఆమె జ్ఞాపకాల్లోంచి బయటపడటం అసాధ్యమనిపించింది. నాలుగేళ్లు చెన్నైలో ఉద్యోగం చేసినా ఆమెను మరచిపోలేకపోయాను. తాగుడికి అలవాటు పడ్డాను. నా పరిస్థితిని చూసి బాధపడ్డ మిత్రులు ఎంతో ప్రయత్నించి చెన్నై నుంచి నన్ను ఖతర్‌ పంపారు. ఇకనైనా సాహితిని మరచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించమని చెప్పారు. మరచిపోవడానికి తను సంఘటన కాదు... మధుర జ్ఞాపకం. ఆమె ఆలోచనలే నా ప్రాణం. వాటితోనే నా ప్రయాణం.

- చక్రవర్తి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని