ఒక్క గెలుపులోనే కిక్‌ లేదు!

వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు చూస్తున్న క్రికెట్‌ అభిమానులందరూ గెలుపుని అంతే తీవ్రంగా కోరుకుంటారా? ‘అవును..కోరుకుంటాం.. వరల్డ్‌ కప్‌ని టీమ్‌ ఇండియా ముద్దాడకుంటే.. ఇన్ని రోజులు మ్యాచ్‌లు చూడడం ఎందుకు? దండగేగా?’ అనేది మీ సమాధానం కూడానా? అయితే, మీ గెలుపు నిర్వచనాన్ని మార్చుకోవాల్సిందే. లేకుంటే..

Updated : 29 Feb 2024 18:32 IST

అంకుర సమరం

వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు చూస్తున్న క్రికెట్‌ అభిమానులందరూ గెలుపుని అంతే తీవ్రంగా కోరుకుంటారా? ‘అవును..కోరుకుంటాం.. వరల్డ్‌ కప్‌ని టీమ్‌ ఇండియా ముద్దాడకుంటే.. ఇన్ని రోజులు మ్యాచ్‌లు చూడడం ఎందుకు? దండగేగా?’ అనేది మీ సమాధానం కూడానా? అయితే, మీ గెలుపు నిర్వచనాన్ని మార్చుకోవాల్సిందే. లేకుంటే.. క్రికెట్‌ అభిమానులుగా ఎన్నో రోజులు ఉండలేరు. వచ్చే నెల్లో టీమ్‌ ఇండియా ప్రపంచ కప్‌ని దక్కించుకోకపోతే మీరు చతికిల పడతారు. ‘ఛీ.. ఛీ.. ఇంకెప్పుడు నేను క్రికెట్‌ మ్యాచ్‌లే చూడను..’ అంటూ స్పోర్ట్స్‌ ఛానల్స్‌ని ప్లాన్‌లో నుంచి తీసేస్తారు. ఇదంతా చేసేది మీలో ఉన్న ‘గెలుపు భూతం’ (సక్సెస్‌ మోన్‌స్టర్‌). ఇది క్రెకెట్‌తో ఆగదు.. మీ కెరీర్‌లో.. చదువులో.. అన్ని పనుల్లోనూ వెంటాడుతుంది. ముఖ్యంగా అంకుర సంస్థల నిర్వహణలో.. అనుక్షణం విశ్రాంతి లేకుండా చేస్తుంది.. విజయం దక్కకుంటే విసుగు వచ్చేలా చేస్తుంది. మరి, ఈ సక్సెస్‌ భూతానికి చెక్‌ పెట్టాలంటే? గెలుపు పట్ల మీ దృక్కోణాన్ని మార్చుకోవాలి... అప్పుడే మీరు ఆటని ఆస్వాదిస్తారు. పడి.. లేస్తారు!
ఒత్తిడి కాదు ఉపశమనం..
గెలవాలి.. ఎలాగైనా గెలవాలనుకుని, గెలుస్తారు. కానీ, ఆ గెలుపు వెనక ఒత్తిడే ఎక్కువ. దానికి ఉపశమనాన్ని వెతుక్కునే లోపు మరో ఛాలెంజ్‌ ముందుంటుంది. మళ్లీ గెలుపు కోసం ఆరాటం మొదలు. ఇదో ‘విన్నింగ్‌ లూప్‌’. ఈ చట్రంలో పడి గెలుపుని ఆస్వాదిస్తున్నారా? లేదనే కొన్ని సర్వేలు చెబుతున్నాయి. పబ్లిక్‌, ప్రైవేటు రంగాలకు చెందిన 83 మంది సీఈఓలు చెబుతున్న ప్రకారం.. దేంట్లోనైనా గెలిచి తీరాలనే తపన కచ్చితంగా అధిక ఒత్తిడికి దారి తీస్తోందట. నిత్యం అదే తపనతో విజయాల్ని అందుకుంటారేగానీ.. ప్రయాణాన్ని ఆస్వాదించలేరు. సాధించిన విజయO ఉత్సాహాన్నివ్వాలేగానీ ఒత్తిడిలా అనిపించకూడదు. ఉదాహరణకు చదువులో ఎప్పుడూ మీరే ఫస్ట్‌. గొప్ప ఆశయాలతో అంకుర సంస్థని నెలకొల్పి జయభేరిని కొనసాగించాలనుకున్నారు. కానీ, ఎన్నో ఒడిదుడుకుల మధ్య గెలవాలనే ఆరాటంతో ముందుకు సాగుతున్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. అనుకోని అవాంతరం.. ముందుకు తూలారు. గెలుపే ఆశయమైతే ఇక లేవరు. ఓడిపోయామని జారబడిపోతారు.
‘జాయ్‌ ఆఫ్‌ జర్నీ’ అవసరం..
చుట్టూ చూస్తే పోటీ పతాక స్థాయికి వచ్చేసింది. ఈ అంకురాల పోటీలో నేను ఎక్కడున్నా? అని ప్రశ్నించకోవడం వేరు. పోటీలో ఎప్పుడూ నేనే ముందు ఉండాలనుకోవడం వేరు. అలుపెరుగక విజయాలే లక్ష్యంగా పరుగెడితే అలసట అనిపించకపోవచ్చు. అనుకున్నది సాధించాను అనుకోవచ్చు. కానీ, ‘జాయ్‌ ఆఫ్‌ జర్నీ’లో మజా తెలియదు. మైళ్లు దాటొస్తారుగానీ.. జీవితంలో మైలురాళ్లు ఉండవు. అప్పుడు ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించినా... మీరే రాజు అయినా.. రాజ్యంలో విలువలు ఉండవు. విలువలు లేని చోట వ్యవస్థ బలంగా నాటుకోదు. అప్పుడు సాధించినదంతా పేక మేడలా కూలిపోతుంది.
‘ఫోమో’గా మిగిలిపోతారు
గెలుపే లక్ష్యం అయినప్పుడు మీలో మీకు తెలియని వ్యక్తిత్వం పుట్టుకొస్తుంది. అదే ‘ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌’ అవుట్‌. ఏదైనా దక్కించుకోలేక పోయానేమో అన్న భయం అది. మీ అంకుర సంస్థకు మీరో నాయకుడు అయినప్పుడు ఫోమోగా ప్రవర్తించడం మంచిది కాదు. మీ ఆలోచనలు, ఉత్పత్తులపై ఇతరులకు నమ్మకం ఏర్పడదు. ఎలాగైనా గెలవాలనుకునే తీవ్రమైన వాంఛ మీలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయకుండా.. భయాన్ని దిట్టంగా పరిచయం చేస్తుంది.

ఒక్క పరుగే కావచ్చు

చదువు అయ్యాక అంకురం వైపు అడుగులేస్తే.. గెలవాలనుకునే ఆత్రుత కంటే సునిశిత పరిశీలనతో ఒక్కొక్కటి నేర్చుకునే ధ్యాసే మంచిది. అప్పుడు ఏళ్లు గడుస్తున్నా గెలవలేకపోతున్నాం అనే ఒత్తిడి కంటే ఏదోఒకనాడు గెలుస్తాం అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని సార్లు ఇరవై బాల్స్‌ ఆడి కేవలం ఒక్క పరుగు మాత్రమే తీయాల్సివస్తుంది. అంత మాత్రాన బ్యాట్స్‌మాన్‌ సెంచరీ చేయలేడు అనుకోనక్కర్లేదు. మ్యాచ్‌ గెలవడం కష్టమే అనుకోనక్కర్లేదు. గెలవాలనుకునే ఆందోళనతో మొదటి బాల్‌నే సిక్స్‌ కొట్టడానికి ప్రయత్నిస్తే అవుట్‌ అవ్వొచ్చు.. సిక్స్‌ వెళ్లొచ్చు.. మ్యాచ్‌ గెలవొచ్చు. కానీ, గెలిచామన్న ఆనందం కంటే ఆందోళన ఎక్కువైతే సమస్యే. అది ఆందోళనతో కూడిన విజయం అవుతుంది.

- కోటిరెడ్డి సరిపల్లి కేజీవీ గ్రూపు ఛైర్మన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని