మరాఠీ తెరపై తెలుగు సుధాకరం!

మొన్నీ మధ్యే ప్రకటించిన జాతీయ అవార్డుల గురించి ప్రస్తావన వస్తే గుర్తొచ్చేది మహానటి కీర్తి సురేష్‌, ఆ సినిమా డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌లు.. కానీ, మీకు తెలుసా? వీరితో పాటు తన మొదటి సినిమాకే జాతీయ ఉత్తమ నూతన దర్శకుడిగా అవార్డు అందుకున్నాడో తెలుగు యువకుడు.. పేరు సుధాకర్‌ రెడ్డి ఎక్కంటి. తన జర్నీని ఈతరంతో పంచుకున్నాడిలా...

Published : 31 Aug 2019 00:32 IST

మొన్నీ మధ్యే ప్రకటించిన జాతీయ అవార్డుల గురించి ప్రస్తావన వస్తే గుర్తొచ్చేది మహానటి కీర్తి సురేష్‌, ఆ సినిమా డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌లు.. కానీ, మీకు తెలుసా? వీరితో పాటు తన మొదటి సినిమాకే జాతీయ ఉత్తమ నూతన దర్శకుడిగా అవార్డు అందుకున్నాడో తెలుగు యువకుడు.. పేరు సుధాకర్‌ రెడ్డి ఎక్కంటి. తన జర్నీని ఈతరంతో పంచుకున్నాడిలా...
నేను మరాఠీ భాషలో తీసిన తొలి సినిమా ‘నాల్‌’ (బొడ్డు తాడు)కు ఈ ఏడాది రెండు జాతీయ అవార్డులొస్తాయని అస్సలు ఊహించలేదు. అయితే ఆ సినిమాను అవార్డుల కోసం మాత్రం తీయలేదు. మరాఠా ప్రాంతంలోని ఓ కుగ్రామంలో ఓ పిల్లాడి ప్రపంచాన్ని అందంగా, ఆర్ద్రంగా ఆవిష్కరిద్దామని చేసిన చిరు ప్రయత్నమది. ఆ సినిమా కథ కల్పనతో కూడుకున్నదే అయినా, దానికి నేపథ్యం మాత్రం నా బాల్యంలోంచి తీసుకున్నదే. చిన్నప్పుడు మన ఇళ్లల్లో జరిగిన సంఘటనల్లోంచే ఆ సినిమాకు కథను అల్లుకున్నాను. తల్లీబిడ్డల మధ్య అపురూపమైన బంధం ఏర్పడడానికి... బిడ్డ తప్పనిసరిగా తల్లి రక్తం పంచుకుని, పేగు తెంచుకుని పుట్టాల్సిన అవసరం లేదనే ఉదాత్తమైన భావనకు అందమైన ఊహను జోడించి ఈ కథను రాసుకున్నాను. కథ రాసుకోవడం ఒక ఎత్తు అయితే, అందులోని పాత్రలకు ప్రాణం పోసే పాత్రలు దొరకడం మరొక ఎత్తు. ఆ రకంగా నా కథలోని తల్లి, తండ్రి, బిడ్డ పాత్రలకు దేవిక, నాగరాజ్‌ మంజులే, శ్రీనివాస్‌ పోకలే రూపంలో అద్భుతమైన ఆర్టిస్టులు దొరకడం అదృష్టం. కథలో పిల్లాడి పాత్ర కోసం మరాఠా గ్రామాల్లో దాదాపు 600 మంది చిన్నారుల్ని ఆడిషన్‌ చేశాం. అందులోంచి ఈ అబ్బాయి దొరికాడు. ఆ పిల్లాడికే ఈసారి జాతీయ ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్టుగా అవార్డు వచ్చింది. నాకు ఇందిరాగాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడిగా అవార్డొచ్చింది. నాకు అవార్డు రావడం కంటే కూడా, ఆ పిల్లాడి (నాల్‌ సినిమాలో చైత్య పాత్రధారి)కి అవార్డు రావడం నాకు గొప్ప ఆనందాన్నిచ్చింది.

అలా పుణె ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కి వెళలా..
మా స్వస్థలం గుంటూరు దగ్గర చిరుమామిళ్ల. వ్యవసాయాధారిత కుటుంబం. పొలాలు కౌలుకు తీసుకుని చేసే క్రమంలో మా కుటుంబం తెలంగాణా-మహారాష్ట్ర సరిహద్దులోని మహదేవపూర్‌ దాకా వలస వెళ్లాల్సి వచ్చింది. ఆ రకంగా బాల్యం కొంతకాలం గోదావరి ఒడ్డున గడిచింది. నాకు ఇద్దరు అన్నలు, ఒక అక్క. ఇంట్లో నేనే చిన్నవాణ్ని. ఇంటర్‌ దాకా గుంటూరు జిల్లాలోని నడికుడిలో చదివా. తర్వాత హైదరాబాదులోని జేఎన్టీయూ ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీలో ఫొటోగ్రఫీ డిప్లొమా చేశాను. ఆ తర్వాత ఈనాడు పేపర్లో చదివి పుణె ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కి దరఖాస్తు చేశా. తొలి ప్రయత్నంలోనే సీటొచ్చింది. పుణె ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ అన్నది సినిమా ఆర్టిస్టులకు కల్పతరువు లాంటిది. పుణె వెళ్లాకే నా కెమెరా కన్ను మరింత ఉన్నతంగా విహంగవీక్షణం చేయగలిగింది. నా మస్తిష్క ప్రపంచం మరింత విస్తృతమైంది. పుణె ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సు చేస్తుండగానే ‘ప్రోగ్రాం ఫర్‌ క్రియేటివ్‌ కంటెంట్‌’ పేరిట యునెస్కో షార్ట్‌ ఫిలింస్‌ కోసం ఓ ప్రకటన ఇచ్చింది. నేనొక స్క్రిప్ట్‌ రాసి పంపితే ఎంపికైంది. ఆ కథతోనే ‘ఏక్‌ ఆకాశ్‌’ గా షార్ట్‌ మూవీ తీశాను. ఇద్దరు పిల్లల మధ్య చిన్నపాటి ఘర్షణను, ఐక్యతను ఆవిష్కరించే చిత్రమది.  ఆ షార్ట్‌ ఫిలింకి కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులొచ్చాయి. తర్వాత మధుమాసం, పౌరుడు, దళం, సైరాట్‌ లాంటి ఏడెనిమిది తెలుగు, మరాఠీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌ గా పనిచేశాను. ప్రస్తుతం ‘సైరాట్‌’     సినిమా ఫేం నాగరాజ్‌ మంజులే దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్న హిందీ చిత్రం ‘ఝుండ్‌’ సినిమాకు, అలాగే తెలుగులో ‘జార్జిరెడ్డి’ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌ గా చేస్తున్నా. ఈ ప్రాజెక్టులు అయ్యాక మంచి కథతో సొంత దర్శకత్వంలో సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నా. ఆ సినిమా తెలుగులోనా, మరాఠీలోనా అన్నది ఇప్పుడే చెప్పలేను. షూటింగుల నుంచి ఖాళీ దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్‌తో కలిసి ట్రావెల్‌ చేయడానికి ఇష్టపడతాను.

 


గుంటూరు నుంచి హైదరాబాద్‌, పుణె మీదుగా ముంబయి దాకా ప్రయాణించి ఛాయగ్రహణ కళను ఔపోసన పట్టాడు. ఆపై ఇటు తెలుగు, అటు మరాఠీలో అరడజనుకు పైగా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌ గా పనిచేసి, అనంతరం ‘నాల్‌’ అనే మరాఠీ చిత్రానికి దర్శకత్వం వహించి తొలి ప్రయత్నంలోనే ఈ ఏడాది రెండు జాతీయ అవార్డులను సాధించాడు.


టాలెంట్‌ చాలు...
గుంటూరోళ్లకి కాస్త సినిమా పిచ్చి ఎక్కువ. ఆ పిచ్చితోనే నేనూ సినిమా పరిశ్రమలోకి వచ్చా. ఇంట్లో కూడా ఎవరూ నాకు అడ్డు చెప్పలేదు. అయితే ఈ ఫీల్డులోకి వచ్చే ముందు అవసరమైన బేసిక్స్‌ నేర్చుకుని పట్టు సాధించాను. ఫీల్డులోకి వచ్చాక తగినంత శ్రమ చేసి నన్ను నేను రాటుదేల్చుకున్నాను. ఆ క్రమంలోనే సినిమాటోగ్రాఫర్‌గా, కథా రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా నాకు అవకాశాలు లభించాయి. వాటిని అందిపుచ్చుకున్నాను. సినిమా పరిశ్రమలోకి రావాలనే కోరిక నేటి యువతలో ఎక్కువగానే కనిపిస్తుంది. అది తప్పేం కాదు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన డిజిటల్‌ యుగంలో అవకాశాలూ అపారంగా ఉన్నాయి. యూట్యూబ్‌ కూడా ఓ బ్రహ్మాండమైన మీడియం. ఈ అవకాశాల్ని అందిపుచ్చుకోవడానికి మనం చేయాల్సిందల్లా తగిన శ్రమ చేసి, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు సానపెట్టుకోవడమే. కష్టే ఫలి అన్న నానుడి అందరికీ తెలిసిందే కదా.

- నాగరాజ్‌, ఈటీవీ

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని