నిత్యాన్వేషణ

ఆలోచనో.. ఆవిష్కరణో..సోలోగానో.. బృందంగానో..అంకుర సంస్థ పెట్టేశారు.. పెట్టుబడులు తెచ్చేశారు.. ఓ వైపు కస్టమర్లు.. మరోవైపు సర్వీసులు.. అంతటితో అంకుర సంస్థ సాఫీగా సాగినట్టేనా? ఏం కాదు, కేవలం రోడ్‌ మ్యాప్‌ క్రియేట్‌ అయినట్టు అంతే! ఇంకేం చేయాలి? ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా అంకురాన్ని ఆవిష్కరించాలి. అందుకు ఎలా సిద్ధం కావాలి?

Published : 07 Sep 2019 00:47 IST

స్టార్టప్‌ కోచ్‌

ఆలోచనో.. ఆవిష్కరణో..సోలోగానో.. బృందంగానో..అంకుర సంస్థ పెట్టేశారు.. పెట్టుబడులు తెచ్చేశారు.. ఓ వైపు కస్టమర్లు.. మరోవైపు సర్వీసులు.. అంతటితో అంకుర సంస్థ సాఫీగా సాగినట్టేనా? ఏం కాదు, కేవలం రోడ్‌ మ్యాప్‌ క్రియేట్‌ అయినట్టు అంతే! ఇంకేం చేయాలి? ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా అంకురాన్ని ఆవిష్కరించాలి. అందుకు ఎలా సిద్ధం కావాలి?
ట్రెండ్‌ని సెట్‌ చేయడమే కాదు..
మనదైన ట్రెండ్‌ని సెట్‌ చేశాం. చాల్లే అని రిలాక్స్‌ అయితే మరొకరు మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌ని సెట్‌ చేసేస్తారు. అందుకే.. ట్రెండ్‌ని సెట్‌ చేయడం ఒక్కటే కాదు. దాన్నెప్పుడు నిత్యనూతనంగా చూపేందుకు ఫాలో అవ్వాల్సిందే. అమితాబ్‌ బచ్చన్‌ ఎప్పుడో డైలాగ్‌లతో తనదైన ముద్ర వేసి అక్కడే ఆగిపోలేదు. భిన్నమైన క్యారెక్టర్లలో పరకాయ ప్రవేశం చేస్తూ నేటి తరాన్ని కూడా తనకి ఫ్యాన్స్‌గా మార్చేసుకుంటున్నారు.
షార్ట్‌కట్స్‌: పీఎంఎఫ్‌ (ప్రాడక్ట్‌ మార్కెట్‌ ఫిట్‌)
ఎప్పటికప్పుడు స్టార్టప్‌ పీఎంఎఫ్‌ లక్ష్యం మారుతుండాలి. తగిన ప్రణాళికతో ‘ఫిట్‌’గా దూసుకెళ్లాలి.

విశ్లేషించకుంటే వెనక్కే!
ఎంత స్థిరమైన వ్యాపారమైనా విశ్లేషణ కొరవడితే పోటీలో వెనుకబడటమే. కనుమరుగైనా ఆశ్చర్యపడక్కర్లేదు. ఉదాహరణకు సినిమా థియేటర్లనే తీసుకోండి. అప్‌డేట్‌ అవుతున్న మల్టీప్లెక్స్‌ కల్చర్‌కి తగినట్టుగా చిన్న థియేటర్లు అప్‌డేట్‌ అవ్వకపోవడం వల్ల ఎన్నో వందల సినిమా థియేటర్లను మూసేయాల్సివచ్చింది. అందుకే గాడిలో పడిన అంకురాన్ని వీధుల్లో నుంచి మైట్రో రైలు ట్రాకులోకి తీసుకురావాలంటే ఎప్పటికప్పుడు మార్కెట్‌ని విశ్లేషించాలి. మీరు సేవలు, ఉత్పత్తుల్లో భవిష్యత్తు మార్పుల్ని ముందే అంచనా వేస్తేనే స్టార్టప్‌ సినిమా వంద రోజులు ఆడుతుంది.
షార్ట్‌కట్స్‌: యూఐ (యూజర్‌ ఇంటర్ఫేస్‌)
సేవలు, ఉత్పత్తులు.. దేంట్లోనైనా వినియోగదారుడు చూడగలిగేది, యాక్సెస్‌ చేయగలిగేదే యూఐ. యూజర్ల దృష్టి కోణం నుంచి చూస్తూ యూఐని ఎప్పటికప్పుడు మెరుగుపరచడం అనివార్యం.

బృందానికో బాధ్యత..
స్టార్టప్‌లో సొంత డబ్బులు పెట్టినప్పుడు.. సీడ్‌ ఫండింగ్‌ తెచ్చుకున్నప్పుడు.. ఎంత కసితో పని చేశారో గుర్తుందా? అదే కసిని నిత్యం కొనసాగించాలి. మొదట్నుంచీ మీతో కలిసి పని చేసిన బృంద సభ్యులతో సమావేశమై వచ్చిన మార్పుని చర్చించండి. ఒకప్పటి కసికి అనుభవాన్ని జోడించి మెరుగైన ఆలోచనలు, ఆవిష్కరణలు చేసే దిశగా అడుగులు వేయాలి. ఉన్న బృందంలో కొందరిని గ్రూపుగా ఏర్పాటు చేసి ‘మార్కెట్‌ రిసెర్చ్‌’ చేయాలి. వార్తా పత్రికల్లో మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించిన వ్యాసాల్ని చదవడం ద్వారా రాబోయే మార్పులకు సిద్ధపడొచ్చు. రిసెర్చ్‌లో వచ్చే ఆలోచనలు, ప్రాజెక్టు నమూనాల్ని రికార్డు చేసి భద్రం చేయాలి.
షార్ట్‌కట్స్‌: యాక్సెలరేటర్‌
అంకురాల నిర్వహణలో వేలు పట్టుకుని నడిపే దశనే యాక్సెలరేటర్‌ మోడ్‌ అని పిలుస్తున్నారు. ఒక్కసారి ఆ దశ దాటాక మీకు మీరే యాక్సెలరేటర్‌ పాత్ర పోషించాలి. బృందం మొత్తాన్ని ఎక్కించుకుని ఎత్తు పల్లాల్లో  మీ యాక్సెలరేటర్‌ స్కిల్స్‌ని వాడుకుని కుదుపులు లేకుండా స్టార్టప్‌ని ముందుకు తీసుకెళ్లాలి.

కోటిరెడ్డి సరిపల్లి, కేజీవీ గ్రూపు ఛైర్మన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని