ఇలాంటివాళ్లూ ఉంటారా?

అమ్మానాన్నలకు నేను, చెల్లీ ఇద్దరమే సంతానం. చిన్నపిల్ల కావడంతో తనని ఇంట్లో అందరూ చాలా గారాబం చేసేవాళ్లు. నేను నల్లగా, సన్నగా ఉంటే తను తెల్లగా, అందంగా ఉండేది. క్లాసులో ఎప్పుడూ తనే ఫస్ట్‌. చాలా చురుకైన పిల్ల. చదువు, ఆటపాటలు అన్నింట్లోనూ తనే ముందు.

Published : 14 Sep 2019 00:10 IST

మ్మానాన్నలకు నేను, చెల్లీ ఇద్దరమే సంతానం. చిన్నపిల్ల కావడంతో తనని ఇంట్లో అందరూ చాలా గారాబం చేసేవాళ్లు. నేను నల్లగా, సన్నగా ఉంటే తను తెల్లగా, అందంగా ఉండేది. క్లాసులో ఎప్పుడూ తనే ఫస్ట్‌. చాలా చురుకైన పిల్ల. చదువు, ఆటపాటలు అన్నింట్లోనూ తనే ముందు. నేను మా ఊళ్లోనే డిగ్రీ చదివాను. తను ఇంజినీరింగ్‌ చేసింది. మంచి సంబంధం రావడంతో నాన్న నాకు పెళ్లి చేశారు. అలా ఆనందంగా సాగిపోతున్న నా జీవితంలో ఊహించని కుదుపు. ఫ్రెండ్‌ పెళ్లికి వెళ్లిన నా చెల్లి తిరిగి రాలేదు. ఫ్రెండ్‌కి యాక్సిడెంట్‌ అయ్యిందని చెప్పి బయలుదేరిన నా భర్త వారం దాటినా ఫోన్‌ చేయలేదు. నేను కాల్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌. ఆచూకీ తెలియక పోలీస్‌ కంప్లైంట్‌ కూడా ఇచ్చాం. ఈలోగా చెల్లి రాసిన ఉత్తరం కనిపించింది. ‘‘నా కోసం వెతకొద్దు. నాకు బావంటే ప్రాణం. మేమిద్దం పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుని వెళ్లిపోతున్నాం’’ అని ఉంది ఆ ఉత్తరంలో.. ఏం జరిగిందో, ఏం జరుగుతుందో అర్థంకాలేదు. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. చెల్లి ఎంతో అందంగా ఉన్నా, చదువులో ముందున్నా నేనెప్పుడూ తనను చూసి అసూయ పడలేదు. తను ఎప్పుడూ హాయిగా ఉండాలనే కోరుకున్నాను. కానీ ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా ఊహించలేదు.

నా భర్త విషయానికి వస్తే.. అతడికి నా చెల్లెలు నచ్చితే... ఆమెనే పెళ్లి చేసుకుంటే సరిపోయేది. నన్ను చేసుకుని నా జీవితాన్ని నాశనం చేయడం ఎందుకో అర్థంకాలేదు. మొత్తానికి బావామరదళ్లు ఆడిన వింత నాటకంలో నేను సమిధనయ్యాను. ఊళ్లో పరువు పోయిందని అమ్మానాన్న మంచం పట్టారు. ఇంట్లో వాళ్లంతా చిన్నతనం నుంచీ చెల్లి ఏది అడిగితే అది చేశారు. నాకోసం కొన్న డ్రెస్‌లు, బ్యాగ్‌లు బాగుంటే తనే తీసేసుకునేది. ఇవ్వనంటే పెద్ద గొడవ చేసేది. ఎందుకొచ్చిన గొడవని తను అడిగినవన్నీ ఇచ్చేసేదాన్ని. చివరికి నా భర్త కూడా తనకు నచ్చుతాడని ఊహించలేదు.

ఇది జరిగిన తర్వాత అమ్మానాన్నల ముందు బాధపడితే వాళ్లు మరింత కుంగిపోతారని ధైర్యం నటించేదాన్ని. కానీ ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రాత్రులెన్నో. నా తప్పు లేకపోయినా నాకేంటీ శిక్ష అని బాధ పడిన రోజులెన్నో. ఒక్కసారిగా జరిగిందంతా అబద్ధమై.. చెల్లి మళ్లీ ఇంటికి తిరిగి వస్తే ఎంత బాగుంటుందో అని ఎన్నోసార్లు అనుకున్నాం. ఇదంతా జరిగి ఇప్పటికి మూడేళ్లయ్యింది. ఏడాది కిందట ఈ విషయాలన్నీ తెలిసిన మా ఊరి వ్యక్తి నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అపురూపంగా చూసుకుంటున్నారు. నేను అందగత్తెను కాదు. కానీ ఎదుటివాళ్లు బాధపడితే చూస్తూ ఊరుకోలేని మంచి మనసు నాకుంది. అందుకేనేమో... దేవుడు నాకు మంచి మనసున్న భర్తను ఇచ్చాడు. అత్తమామలు నన్ను కన్న కూతురిలా చూసుకుంటున్నారు. అమ్మానాన్నల ఆనందానికి హద్దేలేదు. మంచివాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుందని నాన్న ఎప్పుడూ చెబుతుంటారు. నా విషయంలో అది నిజమైందనిపిస్తుంది.

- నీలిమ

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని