లోకాలు గెలిచేందుకు ఈ కాలు చాలదా?

అన్నట్లు పన్నెండేళ్ల వయసులో ఆటో ప్రమాదంలో ఒక కాలు కోల్పోయినా పట్టుదలతో భిన్నమైన క్రీడల్లో రాణిస్తున్నాడు కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అర్షద్‌. తనకున్న తపన ఏకంగా హిమాలయ అధిరోహణకు అడుగులు పడేలా చేసింది. తైక్వాండో, ఆర్చరీ, బాడీ బిల్డింగ్‌, హ్యాండ్‌ సైక్లింగ్‌, మారథాన్‌, వీల్‌ఛైర్‌ ఫెన్సింగ్‌..

Updated : 14 Sep 2019 04:16 IST

సంకల్పం ముందు వైకల్యం ఎంత?
ఎదురీత ముందు విధి రాత ఎంత?


..అన్నట్లు పన్నెండేళ్ల వయసులో ఆటో ప్రమాదంలో ఒక కాలు కోల్పోయినా పట్టుదలతో భిన్నమైన క్రీడల్లో రాణిస్తున్నాడు కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అర్షద్‌. తనకున్న తపన ఏకంగా హిమాలయ అధిరోహణకు అడుగులు పడేలా చేసింది. తైక్వాండో, ఆర్చరీ, బాడీ బిల్డింగ్‌, హ్యాండ్‌ సైక్లింగ్‌, మారథాన్‌, వీల్‌ఛైర్‌ ఫెన్సింగ్‌.. ఇలా పలు క్రీడల్లోనూ రాణిస్తూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించడంతో పాటు ప్రభుత్వ కొలువు సాధించడమే లక్ష్యం అంటున్నాడు అర్షద్‌..

కాలు కోల్పోయినా..
చిన్నతనం నుంచే క్రీడల్లో రాణిస్తూ తైక్వాండోలో గ్రీన్‌ బెల్ట్‌ సాధించాడు. చురుకుగా యుద్ధవిద్యలు నేర్చుకుంటుండగా విధి చిన్నచూపు చూసింది. ఏడో తరగతి చదువుతున్న సమయంలో ఆటో ప్రమాదానికి గురై ఎడమ కాలు పోగొట్టుకున్నాడు. అయినా అర్షద్‌లో క్రీడలపై మక్కువ తగ్గలేదు. కొందరు దాతల సాయంతో విలువిద్యలో శిక్షణ పొందాడు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటుతూనే.. క్రీడాకారుడిగా ఎదగాలంటే బలం అవసరమని గుర్తించి బాడీ బిల్డింగ్‌పై దృష్టి పెట్టాడు. నిపుణుల సలహాలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. ‘మిస్టర్‌ ఆంధ్ర’, ‘మిస్టర్‌ రాయలసీమ’గా ఎంపికయ్యాడు. అంతేనా.. స్విమ్మింగ్‌లోనూ రాణించి ఎన్నో పతకాలు దక్కించుకున్నాడు. దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేశాడు. వచ్చే జీతాన్ని తన బాడీ బిల్డింగ్‌కు కావాల్సిన డైట్‌కు ఉపయోగించుకునేవాడు. ప్రభుత్వ కొలువు కోసం రెండేళ్లపాటు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ సమయంలోనే హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ ఆసరా అయ్యింది. కృత్రిమ కాలును అమర్చి క్రీడల్లో పాల్గొనడానికి మార్గం చూపింది.

మొన్న ఆగస్టు 26న హిమాలయాల అధిరోహణలో భాగంగా గంగోత్రి నుంచి ప్రారంభమై 21,365 అడుగుల ఎత్తున్న భగీరథి-2ని చేరుకునే సాహసం చేశాడు. అయితే మంచు వర్షంతో చరియలు విరిగి పడటంతో 18వేల అడుగుల ఎత్తు వరకు చేరుకుని వెనుదిరిగాడు.

రాణించడమే లక్ష్యం
* 2017లో జాతీయ స్థాయిలో బిలాస్‌పూర్‌లో జరిగిన వీల్‌ఛైర్‌ ‘ఫెన్సింగ్‌’ పోటీల్లో సిల్వర్‌ మెడల్‌.
* 2018లో ఎన్‌ఎస్‌జీ దిల్లీలో నిర్వహించిన మారథాన్‌లో 3 కి.మీ. పరుగెత్తి ప్రతిభ చాటాడు.
* 2019లో ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో హ్యాండ్‌ సైక్లింగ్‌ విభాగంలో 4వ స్థానం.
* 2019లో డెహ్రాడూన్‌లో ఐస్‌పై ఒక కాలితో ‘స్కీయింగ్‌’ చేశాడు.

- యడ్లపాటి బసవ సురేంద్ర ఈనాడు డిజిటల్‌-కర్నూలు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు