కలాం చెప్పారని..

ఒక్కమాటలో చెప్పాలంటే తనకున్న లక్ష్యం ఒక్కటే.. మానవ సేవ. కొన్నేళ్లుగా తను నమ్మిన సేవా సిద్ధాంతాలతో ఓ ఉద్యమంలా ముందుకు సాగుతున్నాడీ మణిమారన్‌..కుష్ఠు రోగులకు సేవ చేస్తూ.. వందలాది అనాథ శవాలకు  అంతిమ సంస్కారాలు చేస్తున్నాడు..

Updated : 21 Sep 2019 04:20 IST

మణిలాంటి మనిషి కథ

చదివింది తొమ్మిదో తరగతే..అయినా డాక్టరేట్లు అందుకున్నాడు!
* సాయం చేసే మనసుకి దక్కిన గౌరవం అది..
చేసేది దుస్తుల వ్యాపారం..సంపాదనలో 10 శాతమే తీసుకుంటున్నాడు!
* 90 శాతం సమాజ సేవకే పంచేస్తున్న సేవా దృక్పథం అది..
ఒక్కమాటలో చెప్పాలంటే తనకున్న లక్ష్యం ఒక్కటే.. మానవ సేవ. కొన్నేళ్లుగా తను నమ్మిన సేవా సిద్ధాంతాలతో ఓ ఉద్యమంలా ముందుకు సాగుతున్నాడీ మణిమారన్‌..కుష్ఠు రోగులకు సేవ చేస్తూ.. వందలాది అనాథ శవాలకు  అంతిమ సంస్కారాలు చేస్తున్నాడు..
మణిమారన్‌ స్వస్థలం తమిళనాడులోని తలైయాంపళ్లం గ్రామం. సాధారణ రైతు కుటుంబం. బడిలో సబ్జెక్టుల కంటే.. జీవితాన్ని సేవకు అంకితం చేసిన మహనీయుల చరితలే ఆసక్తిగా అనిపించేవి, ఆలోచింపజేసేవి. తొమ్మిదో తరగతిలో చదువు ఆగిపోయింది. కూలీగా సిమెంటు బస్తాలు మోశాడు. తన జీవిత లక్ష్యం సేవా మార్గం అని తెలుసుకున్నాక ఆగలేదు. కోల్‌కతాలోని మదర్‌ థెరిసా ఆశ్రమమే అందుకు సరైందని పయనమయ్యాడు. అక్కడ దిగ్గానే రైల్వేస్టేషన్‌లో సామగ్రిని దొంగిలించారు. భాష తెలియక, ఏం చేయాలో తోచక ఓ ముఠా బారిన పడ్డారు. వాళ్లు వారం పాటు భిక్షాటన చేయించారు. ఓ తమిళ ఆటో డ్రైవర్‌ సాయంతో అక్కడి నుంచి తప్పించుకొని మదర్‌ థెరిసా ఆశ్రమం చేరుకున్నాడు. నిర్వాహకులు అతన్ని స్థానికంగా ఉన్న ఓ కుష్ఠురోగుల ఆశ్రమానికి తీసుకెళ్లి సేవ చేయమన్నారు. ఓ రోగి మలమూత్రాలను శుభ్రం చేసి, దుస్తులు తొడిగాడు. ‘నువ్వు ఈ సేవ తమిళనాడులో కూడా చేయవచ్చని’ నిర్వాహకులు మణిమారన్‌కు నచ్చజెప్పి పంపించారు.

ఒంటరిగా కాకుండా..
తిరుప్పూర్‌ తిరిగి వచ్చేసి ఓ బనియన్‌ పరిశ్రమలో పనిచేస్తూ కుష్ఠురోగులకు సేవలు చేయడం కొనసాగించాడు. వచ్చే జీతంతో ప్రతినెలా 100 మందికి అన్నదానం, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టేవాడు. 2008లో తిరుప్పూర్‌ వచ్చిన అబ్దుల్‌ కలాం ‘‘నువ్వు సేవ చేయట్లేదు. బాధ్యతను నెరవేరుస్తున్నావు. నిన్ను చూసి మిగతావారు చేస్తే అది సేవ. ఒంటరిగా కాకుండా ఓ సంస్థను ప్రారంభించి సాయం చేయాలని’’ సూచించారు. మరుసటి ఏడాదే మణిమారన్‌ ‘వరల్డ్‌ పీపుల్‌ సర్వీస్‌ సెంటర్‌’ ప్రారంభించారు. ప్రస్తుతం తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో సుమారు 450 మంది వాలంటీర్లు ఆయనతో కలిసి పని చేస్తున్నారు.
అనాథలకు ఆత్మీయ బంధువు..
ఎక్కడైనా కుష్ఠు రోగులు కనిపిస్తే ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ఒంటిపై పుండ్లు, ఇతర శరీర భాగాలను శుభ్రం చేసి ప్రథమ చికిత్స అందిస్తాడు. హోమ్‌లో చేర్చడమే కాదు... అక్కడి రోగుల్లో ఎవరైనా మరణిస్తే అంతిమ సంస్కారాలు చేస్తాడు. ఇప్పటి వరకు 957 అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు చేశాడు. తను చేసిన సేవలకు ఎన్నో అవార్డులు.. ‘గోల్డ్‌ మెడల్‌ ఫర్‌ ఇండియా’, ‘అమేజింగ్‌ ఇండియన్స్‌’,  ‘ముఖ్యమంత్రి రాష్ట్ర యువజన పురస్కారం’ అందుకున్నాడు. యూనివర్సల్‌ తమిళ్‌ యూనివర్సిటీ (2014), ఇంటర్నేషనల్‌ పీస్‌ యూనివర్సిటీ (2018), యూనివర్సల్‌ ప్రెస్‌ మీడియా ఎడ్యుకేషన్‌ విద్యాపీఠ్‌ (2018), గ్లోబల్‌ పీస్‌ యూనివర్సిటీ (2019) నుంచి గౌరవ డాక్టరేట్లు, మరెన్నో సత్కారాలు అందుకున్నాడు. ‘ప్రస్తుతం బనియన్‌, టీ షర్టులు విక్రయించే వ్యాపారం చేస్తున్నా, 90 శాతం ఆదాయాన్ని సేవకే వినియోగిస్తున్నా. సేవలకు అడ్డంకి అవుతుందని పెళ్లి కూడా చేసుకోలేదు’ అని మణిమారన్‌ తెలిపాడు.

 

- సతీశ్‌బాబు, చెన్నై, న్యూస్‌టుడే
 


చెట్టుపై రాత్రంతా..
- మణిమారన్‌

2008, మే నెలలో తిరుప్పూర్‌ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నప్పుడు బస్సు టైరు పంక్చర్‌ అ³ంది. బస్సు దిగి అక్కడున్న హోటల్‌ ముందు నిలుచున్నా. కుష్ఠుతో బాధపడుతున్న ఒక మహిళ హోటల్‌ యజమానిని నీళ్లు అడిగితే, విసుక్కుంటూ గ్లాసుతో ముఖంపై నీళ్లు కొట్టి పొమ్మన్నాడు. చేసేది లేక ఆమె పక్కనున్న మురుగు కుంటలో నీళ్లు తాగబోయింది. నేను ఆపి నీళ్లు, ఆహారం కొనిచ్చా. ‘30 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నాను. నన్ను ఏదైనా ఆశ్రమంలో చేర్పించు’ అంది. పుండ్లు శుభ్రం చేసి, స్నానం చేయించి దుస్తులు మార్చా. ‘ఊరికి వెళ్లొచ్చాక ఆశ్రమానికి తీసుకెళ్తానని’ చెప్పా. తిరిగొచ్చి చూస్తే ఆమె కనిపించలేదు. రోజంతా ఆమె కోసం వెతుకుతూ ఆ రాత్రికి అక్కడి బస్టాపులోనే నిద్రపోయా. నా పక్కనే జరిగిన దొంగతనం.. నన్నూ నిందితుడిగా మార్చింది. గస్తీ పోలీసులు వచ్చి ఆరా తీస్తూ నేను చెప్పేది వినకుండా చావబాదారు. పారిపోయి ఓ టీ దుకాణంలో దాక్కున్నా. అక్కడి వాళ్లూ దొంగ అనుకుని దాడి చేశారు. గాయాలతో వీధుల్లో పరుగెడుతుంటే కుక్కలు వెంటపడ్డాయి. నిస్సహాయ స్థితిలో ఆ రాత్రికి ఓ చింత చెట్టు ఎక్కి కూర్చున్నా. ఒక్క రాత్రికే నా పరిస్థితి అలా మారితే.. ఓ మహిళ కుష్ఠు వ్యాధితో 30 ఏళ్లుగా ఎన్ని బాధలు పడిందో ఊహించలేకపోయా.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని