‘నో’ చెప్పడం నేర్చుకోండి

నా పేరు స్రవంతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను. కొన్ని నెలల క్రితం ఓ అబ్బాయి పరిచయమయ్యాడు. తన మాటలు నచ్చి తనతో స్నేహం కొనసాగిస్తున్నాను....

Published : 12 Oct 2019 00:31 IST

మనలో మనం!

నా పేరు స్రవంతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను. కొన్ని నెలల క్రితం ఓ అబ్బాయి పరిచయమయ్యాడు. తన మాటలు నచ్చి తనతో స్నేహం కొనసాగిస్తున్నాను. కానీ మాట్లాడుతూ, మాట్లాడుతూ మధ్య మధ్యలో నన్ను తాకుతుంటాడు. చేతులు పట్టుకుంటాడు. భుజంపై చేయివేస్తాడు. అతని మాటల్లో మాత్రం ఎటువంటి చెడు ప్రవర్తన కనిపించదు. పద్దతిగానే మాట్లాడుతాడు. కానీ తను తాకుతుంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. తనని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ పరిచయం ఎటు దారితీస్తుందో తెలియక ఆందోళనగా ఉంది. నన్ను ఏం చేయమంటారు?

మీరు ఆందోళన చెందకండి. మీరు ఏ తప్పూ చేయడం లేదు. అయితే జీవితంలో కొన్ని సార్లు నిర్భయంగా ‘నో’ అని చెప్పడం అలవాటు చేసుకోండి. మీ పట్ల మీ స్నేహితుడి ప్రవర్తనకు నో చెప్పండి. మిమ్మల్ని తాకకుండా మాట్లాడమని చెప్పండి. అతనిపై మీకున్న అభిప్రాయం స్నేహం మాత్రమే అని క్లారిటీ ఇవ్వండి. మీపై అతని అభిప్రాయాన్ని నేరుగా తెలుసుకోండి. మీ మధ్య స్నేహం బాగుండాలి అంటే ఎలా ఉండాలి. ఎలా ఉండకూడదో తెలియజేయండి. ఇకపై అతన్ని కలిసేటప్పుడు మీ ఇతర స్నేహితులు కూడా దగ్గర ఉండేట్టు చూసుకోండి. అంతేగాని.. ఇలా మీలో మీరు ఇబ్బంది పడుతూ అతనితో స్నేహం కొనసాగించడం మీకే ప్రమాదం. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితముంటుంది. ముఖ్యంగా తాకే విషయంలో అనుమతి, అంగీకారం అవసరం. కుటుంబ సభ్యులు ఉన్నంత చనువుగా ఇతరులతో అంగీకారం లేకుండా చనువు తీసుకోవడం ఇబ్బందికరమే. అందువల్ల తనని తాకకుండా మాట్లాడమని చెప్పండి. మీతోనే కాదు ఆడవారితో అసభ్యకరంగా ప్రవర్తించకూడదని చెప్పండి. ముఖ్యంగా అతని మాటల్లో దురుద్దేశం లేదని మీరంటున్నారు. కనుక మీరు చెప్పే విషయాలు తను అర్థం చేసుకుంటాడు. మీ పట్ల తన ప్రవర్తన మార్చుకుంటాడు. మీరిలా చెప్పిన తర్వాత కూడా అతనిలో మార్పు రాకపోతే అతనికి దూరంగా ఉండటం మంచిది. మాట్లాడడం తగ్గించండి. మరోవైపు మీ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కనుక మీకు మంచి భవిష్యత్తు ఉంది అని గుర్తించండి. సందర్భానుసారంగా మీ అభిప్రాయాలను చెప్పడానికి వెనుకాడకండి. ఎందుకంటే మన స్నేహితుల విషయంలోనైనా, మన కెరీర్‌ విషయంలోనైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేప్పుడు అప్రమత్తత అవసరం.

మీకు పరిష్కారం అందని ఎలాంటి మానసిక సమస్య అయినా మాతో పంచుకోండి.

నిపుణులతో పరిష్కారం అందిస్తాం. మా ఈ మెయిల్‌- youthpage@eenadu.net

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని