వయష్‌..!

పెద్దాళ్లున్నారే.. ‘వయసు పోతే తిరిగి రాదు’ అని ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. నిజంగానే వయసులోనే ఆనందం ఉంటుందా?...

Published : 12 Oct 2019 00:36 IST

ప్రస్తుతాన్నే ప్రేమిద్దాం

పంచుకుందాం

పెద్దాళ్లున్నారే.. ‘వయసు పోతే తిరిగి రాదు’ అని ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. నిజంగానే వయసులోనే ఆనందం ఉంటుందా? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు కాక ఇంకెప్పుడు తప్పక ఆలోచించాలి. ఎందుకంటే.. వయసు క్షణం ఆగదు. మనమే దానితో పోటీ పడాలి. అందుకే ఈ ప్రశ్న.. మనం ఏ వయసులో ఎక్కువ హ్యాపీగా ఉంటాం?

1-8

‘నేను క్రికెటర్‌ అవుతా.. కలెక్టర్ని అయిపోతా’ అంటూ.. ఆడిందే ఆట... పాడిందే పాట. భయం ఉండదు. భరోసాతో పని లేదు. ఎంత స్వచ్ఛమైన వయసు!!

8-14

‘నేను చేసుకోగలను. నాకు తెలుసు’ అని స్వతంత్రంగా ఆలోచించే పరువం.. కొత్త పరిచయాల కోసం వెతకడం. వారితో అన్నీ పంచుకోవడం.. స్వీట్‌ టీన్స్‌లా విచ్చుకునే వయసులో ఎన్ని పరిమళాలో..!!

14-18

సమాజంతో వై-ఫైలా కనెక్ట్‌ అయ్యే వయసు.. అనుభవాల బ్లూటూత్‌ నెట్‌వర్క్‌ కోసం అన్వేషించడం. ఆకర్షణ గాలానికి చిక్కకుండా గోల్స్‌ వైపు దృష్టి మళ్లించడం. విన్నింగ్‌ పాస్‌వర్డ్‌ కోసం ఎథికల్‌ హ్యాకర్‌లా ప్రోగ్రామింగ్‌ చేసే వయసులో ఎన్ని ట్విస్ట్‌లో..!!

18-25

సెల్ఫ్‌ లవ్‌ మొదలయ్యే దశ. వాస్తవాలతో ఒంటికి అంటిన ఆకర్షణని ఫార్మెట్‌ చేసే వయసు. బిజీగా ఉన్న కూడలిలో నిలబడి మీ గమ్యం ఎటో తెలుసుకునే క్రమం.. ప్రయత్నాలతో పడుతూ.. లేవడం.. ఆ కిక్కే వేరప్పా!

25-35

జీవితాన్ని పంచుకోవడంలో తీపిని గ్రహించే వయసు.. ఉద్యోగం.. ఉన్నత శిఖరాలు.. విహారాలు.. ప్రపంచం చాలా పెద్దదని తెలుసుకునే విశాలత్వం.. ప్రయాణం కంటే.. గమ్యాన్ని చేరాలనుకునే ఉత్సాహంలో ఎన్ని ఆశలో..!!

35-45

వృక్షంలా నీడగా మారే దశ.. తప్పులు చెప్పడం.. క్షేమాన్ని కోరడం.. విలువల్ని పంచడం. గమ్యం కంటే.. ప్రయాణం ముఖ్యమనే వయసు. అనుభవాల ఆనందం అంతా.. ఇంతా కాదు!!

45-65

అందర్లోనూ మనల్నే చూసుకుంటూ.. ఇంట్లో అందరితో ఆడుకునే వయసు. జ్ఞాపకాలతో రిలాక్స్‌ అయ్యే ముఖంలో ఎంత సంతృప్తో!!!

మేం వయసుకు వచ్చాం.. అంటూ అల్లరి చేసే వయసులో ఉన్నారు. ఎప్పటికీ అదే జోన్‌లో ఉండడం సాధ్యం కాదు. అందుకే ఉరకలేసే వయసుని ఉన్నపళంగా జుర్రుకుంటూ లక్ష్యం వైపు సాగిపోండి. వయసు కేవలం ఒక నంబర్‌ మాత్రమే.. ఎప్పటిదప్పుడు ఆస్వాదించడంలోనే కిక్‌ వెతుక్కోవాలి.

జరసోచో..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని