టిక్‌.. టిక్‌.. టీకా

ఓ దృశ్యం మన దృక్పథాన్ని మారుస్తుంది...ఓ సంఘటన మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది...అలా ఓ ప్రాజెక్టు పనిపై ప్రభుత్వాసుపత్రిలో రెండు వారాలు పని చేసిన విద్యార్థికి అక్కడి సంఘటనలు...

Published : 19 Oct 2019 00:43 IST

అలారం యాప్‌

ఓ దృశ్యం మన దృక్పథాన్ని మారుస్తుంది...ఓ సంఘటన మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది...అలా ఓ ప్రాజెక్టు పనిపై ప్రభుత్వాసుపత్రిలో రెండు వారాలు పని చేసిన విద్యార్థికి అక్కడి సంఘటనలు సరికొత్త లక్ష్యాన్ని ఏర్పరిచాయి. చిన్న నిర్లక్ష్యం కారణంగా పసికందులు మృత్యువాత పడకుండా, వారి తల్లిదండ్రులను ముందస్తుగా మేల్కొలిపే ఓ వ్యవస్థకు ప్రాణం పోసేలా చేశాయి. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలతోపాటు, ఆ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళతానని ఆయనే స్వయంగా హామీ ఇచ్చేలా చేసింది. ఆ ప్రశంస అందుకున్నది ఒంగోలుకు చెందిన పాపాని ప్రసాదరావు, శ్రీదేవి దంపతుల కుమారుడు రిత్విక్‌ చంద్ర. అతడికి అంతటి అర్హతను తెచ్చిపెట్టింది వ్యాక్సినేషన్‌ అలర్ట్‌ యాప్‌.
ఆలోచన..
బెంగళూరులో 11వ తరగతి చదువుతున్న రిత్విక్‌కి రెండేళ్ల క్రితం చేపట్టిన ప్రాజెక్టు నుంచే వ్యాక్సినేషన్‌ అలర్ట్‌ యాప్‌ ఆలోచన పుట్టింది. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు వారాల పాటు పని చేశాడు. ఆ సమయంలో అక్కడ చాలా మంది చిన్నారులు సరైన సమయంలో టీకాలు వేయించక పోవడంతో మృత్యువాత పడుతున్నట్లు గుర్తించాడు. చిన్నారులు మృతి చెందకుండా ఉండాలంటే.. వారికి సకాలంలో టీకాలు వేయించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం ముఖ్యమనిపించింది రిత్విక్‌కి. దేశ వ్యాప్తంగా సుమారు 38 శాతం మంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు సకాలంలో టీకాలు వేయించడం లేదని, జాతీయ సర్వే నివేదికల్ని విశ్లేషించి తెలుసుకున్నాడు. సమస్య పరిష్కారానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఆచరణ..
తనకి వచ్చిన అలర్ట్‌ యాప్‌ ఆలోచనను స్నేహితులతో పంచుకున్నాడు. అనంతరం గురువుల సహకారంతో తల్లిదండ్రుల మొబైల్‌ ఫోన్‌లకు సంక్షిప్త సందేశాల ద్వారా అలర్ట్‌ మెసేజ్‌లు పంపించే యాప్‌ను రూపొందించే పనిలో పడ్డాడు. ‘ద యాప్‌ ఇమ్యూనైజేషన్‌ ఈజ్‌ డిసైడెడ్‌ టూ ఇంప్రూవింగ్‌ వ్యాక్సినేషన్‌ రైట్స్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మేలు జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. యాప్‌ని పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ‘ప్రీ ఇమ్యునైజేషన్‌’ పేరుతో గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు.

తొమ్మిది భాషల్లో సందేశాలు
- రిత్విక్‌ చంద్ర
టీకాల కోసం చిన్నారులను తీసుకొచ్చే తల్లిదండ్రులతో మొదట మాట్లాడా. వారి ఫోన్‌ నంబర్లు సేకరించా. సంక్షిప్త సందేశాలు తెలుగులో పంపడం మొదలుపెట్టా. నా ఆసక్తిని గమనించిన కొంత మంది వైద్యులు తమ వద్దకు వచ్చే చిన్నారుల తల్లిదండ్రుల సెల్‌ నంబర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. యాప్‌ ప్రయోజనాలు ఎక్కువ మందికి చేరాలనే ఉద్దేశంతో సుమారు తొమ్మిది ప్రాంతీయ భాషల్లో సంక్షిప్త సందేశాలు పంపేందుకు వీలుగా ప్రోగ్రాం తయారు చేసుకున్నా.
అప్రమత్తం..
రెండేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలనేది అందరికి తెలిసిందే. కానీ, ఎంత మంది  తల్లిదండ్రులు విధిగా గుర్తుంచుకుని సకాలంలో టీకాలు వేయిస్తున్నారు? దానికి సమాధానమే అలర్ట్‌ యాప్‌. పేరెంట్స్‌ తమ స్మార్ట్‌ ఫోన్‌లో ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని బిడ్డ పుట్టిన తేది, ఇతర విషయాల్ని ఎంటర్‌ చేస్తే చాలు. ఆయా టీకా వేయించడానికి కొన్ని రోజుల ముందు ‘ఇమ్యునైజేషన్‌ వ్యాక్సినేషన్‌ రిమైండర్‌’ యాప్‌ తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తుంది. సంబంధిత సమాచారాన్ని చేరవేస్తుంది.. దీంతో చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించే మార్గం సుగమం అవుతుంది.
- కాకుమాను సుబ్బారావు, గౌతమ్‌ నగర్‌, న్యూస్‌టుడే


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని