టెక్నాలజీ వసంతం

చల్లగాలికి అడ్డొస్తున్న కిటికీ కర్టెన్‌ తీయాలంటే విండో వరకూ వెళ్లక్కర్లేదు..ఓపెన్‌ కర్టెన్‌’ అంటే చాలు.. పక్కకు జరుగుతుంది!

Published : 26 Oct 2019 00:56 IST

* చల్లగాలికి అడ్డొస్తున్న కిటికీ కర్టెన్‌ తీయాలంటే విండో వరకూ వెళ్లక్కర్లేదు..ఓపెన్‌ కర్టెన్‌’ అంటే చాలు.. పక్కకు జరుగుతుంది!
* మంచి నిద్రలో ఉన్నారు. ఉక్కబోతతో మెలకువ వచ్చింది. ఏసీ ఆన్‌ చేయాలంటే.. రిమోట్‌ కోసం వెతకక్కర్లేదు. ‘ఏసీ ఆన్‌’ అని పిలిస్తే గదిలో ఏసీ పని చేయడం మొదలుపెడుతుంది..
*ఆఫీస్‌ నుంచి ఇంటికి బయలుదేరారు. ఇంటికెళ్లే సరికి గీజర్‌లో వేడినీళ్లు సిద్ధంగా ఉండాలంటే? ఫోన్‌లో యాప్‌ ఓపెన్‌ చేసి ఇంట్లోని గీజర్‌ని ఆన్‌ చేయొచ్చు... టెక్నాలజీపై తనకున్న ఆసక్తితోనే ఇవన్నీ సాధ్యం అయ్యేలా చేశాడు విశాఖ యువకుడు. పేరు వసంత రజనీశ్‌. అంకుర సంస్థని స్థాపించి ఐఓటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) ఉత్పత్తులతో ఇంటిని స్మార్ట్‌గా మార్చేస్తున్నాడు. టెక్నాలజీ విశ్లేషకుల ప్రశంసలు పొందుతున్నాడు.

చదివింది విశాఖ నగరంలోని వీతం కళాశాలలో ఇంజినీరింగ్‌. తర్వాత ఐ.ఐ.ఎం. కలకత్తా నుంచి ఎంబీఏ పట్టా కూడా పొందాడు. ఒకప్పటి ఐ.టి. దిగ్గజ సంస్థల్లో పని చేశాడు. ఐఓటీ పరిజ్ఞానంపైనే పని చేస్తూ దేశ విదేశాలు చుట్టొచ్చాడు. తనే ఎందుకు సొంతంగా కంపెనీ పెట్టి ఐఓటీ పరికరాల్ని రూపొందించకూడదు అనుకున్నాడు. అంతే...  అత్యధిక వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు. మిత్రుడిని వ్యాపార భాగస్వామిగా చేసుకుని విశాఖలోని ఇన్నోవేషన్‌ వ్యాలీలో 2017లో తొలుత ‘యాంటర్‌ ఐఓటీ’ పేరుతో చిన్న అంకుర సంస్థను స్థాపించాడు. నూతన ఉత్పత్తుల రూపకల్పనకు వీలుగా పరిశోధనలు చేసి ‘డబ్ల్యు.ఒ.డబ్ల్యు-ఆర్‌’, ‘ఎన్‌-వే’ అనే రెండు ఉత్పత్తులను రూపొందించి వాటికి మేధోసంపత్తి హక్కులనూ సాధించాడు.  
రిమోట్‌ నొక్కకుండానే..
ఇప్పుడంతా టెక్నాలజీమయం. ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ పరిజ్ఞానాలను వినియోగించడానికి ఆసక్తి చూపిస్తున్నారన్న నమ్మకంతో ‘యాంటర్‌ స్మార్ట్‌ హోమ్స్‌’ పేరుతో పలు ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడం ప్రారంభించాడు. కేవలం నోటి ఆజ్ఞలతోనే పలు ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులు పనిచేసేలా వాటిని ఆధునికీకరించడంపై దృష్టిపెట్టాడు. ఇంటికి దగ్గరలో లేనప్పుడు చేతిలోని స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించి కూడా ఇంట్లో ఉపకరణాలు పనిచేసేలా సొంతంగా పరిజ్ఞానాలను, యాప్‌ను, ఎనిమిది వరకు ఉత్పత్తులను అభివృద్ధి చేసి ఔరా! అనిపిస్తున్నాడు. లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు, టీవీలు, గీజర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉపకరణాలనైనా ఎలాంటి మీటలు, రిమోట్‌లు నొక్కాల్సిన అవసరం లేకుండా కేవలం నోటి ఆజ్ఞలతో ఐఓటీ ఉత్పత్తులు పని చేస్తాయి. ఒక్కసారి ఆయా ఉపకరణాలు పనిచేయడానికి పలకాల్సిన ‘ఆజ్ఞ’(కమాండ్‌)లను నమోదు చేసుకుంటే చాలు. అలా అని స్మార్ట్‌ పరిజ్ఞానాలున్న అదనపు ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన పని కూడా లేదు. ఇప్పటికే ఉన్న ఉపకరణాలనే ఐఓటీ. పరిజ్ఞానాలతో పనిచేసేలా ఆధునికీకరించుకుంటే సరిపోయే వెసులుబాటు కూడా ఉండడం మరో విశేషం. అమెరికా, ఫ్రాన్స్‌కి చెందిన సంస్థలతో సెక్యూరిటీ ఉత్పత్తుల రూపకల్పనలో ఒప్పందం కుదుర్చుకున్నాడు రజనీశ్‌.
వ్యయాల తగ్గింపే లక్ష్యం....
- వి.రజనీశ్‌, వ్యవస్థాపక సీఈవో
స్మార్ట్‌ పరిజ్ఞానాల వినియోగం అత్యంత సౌకర్యవంతంగా ఉండడంతో పాటు అనవసర వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలు, ఇళ్లకు అవసరమైన ఐఓటీ ఉత్పత్తులను రూపొందిస్తున్నాం. నా వ్యాపార భాగస్వామి కనకమేడల హేమంత్‌కుమార్‌ షికాగోలోని కార్యాలయంలో ఉంటూ మా సంస్థకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాలను పర్యవేక్షిస్తుంటారు. స్మార్ట్‌ పరిజ్ఞానాల వినియోగంతో ఆయా ఉత్పత్తుల రక్షణ, భద్రత గణనీయంగా పెరగడంతోపాటు వినియోగ వ్యయాలు బాగా తగ్గుతాయి.
- బీఎస్‌ రామకృష్ణ, ఈనాడు, విశాఖపట్నం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని