మైత్రీ ఇడియట్స్‌

కాలేజీ లైఫ్‌ ఫ్రెండ్స్‌ వేరు. కడదాకా వెన్నంటి ఉండే బెస్టీలు వేరు. కొందరు కోర్సులు ముగిశాక ఎప్పుడో ఓ ఫోన్‌ కాల్‌లా మిగిలిపోతే.. ఇంకొందరు కాలంతో పాటూ మనతో ప్రయాణిస్తారు.

Updated : 02 Nov 2019 12:32 IST

కాలేజీ లైఫ్‌ ఫ్రెండ్స్‌ వేరు. కడదాకా వెన్నంటి ఉండే బెస్టీలు వేరు. కొందరు కోర్సులు ముగిశాక ఎప్పుడో ఓ ఫోన్‌ కాల్‌లా మిగిలిపోతే.. ఇంకొందరు కాలంతో పాటూ మనతో ప్రయాణిస్తారు. అలాంటి ఇద్దర్ని క్యాంపస్‌ కానుకగా ఇచ్చింది నాకు. గత ఏడాది సరిగ్గా ఈ సమయంలోనే వాడు యూఎస్‌ బయలుదేరాడు. నాకింకా గుర్తు సిటీ అంతా దీపావళి వెలుగులు చిమ్ముతుంటే.. ఆ వెలుగు జిలుగుల్లా వాడి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెండ్‌ ఆఫ్‌ ఇవ్వడానికి ఎయిర్‌పోర్టుకి బయలుదేరా.. ఆ ప్రయాణంలో మా నాలుగేళ్ల ‘హ్యాపీడేస్‌’ అన్నీ నన్ను చుట్టేశాయి. ఇది మా కథ.. వాడి రెబల్‌ ప్రేమ కథ కూడా..

బీటెక్‌ మొదటిరోజు. నా టైం బాగోక మొదటి క్లాసుకే ఆలస్యమయ్యా. లోపలికెళ్తుంటే ‘గెటవుట్‌’ అన్నారు హెచ్‌వోడీ. అప్పటికే నాలాంటి ఇంకో బాధితుడు ఉన్నాడక్కడ. వాడే విక్కీ.. విక్రమ్‌. మొహమాటానికి చిరునామా నేనైతే.. డేరింగ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ వాడు. ఎక్కడుండాలో తెలియని నాకు వాళ్లింట్లోనే ఆశ్రయమిచ్చాడు. అందమైన వాళ్ల కుటుంబంలో నన్నొకడ్ని చేశాడు. ఓరోజు లంచ్‌ టైంలో ‘ఈమె ప్రియ.. నా స్కూల్‌ ఫ్రెండ్‌ రా’ అంటూ ఓ అమ్మాయిని పరిచయం చేశాడు. మా ముగ్గురి అల్లరి అంతాఇంతా కాదు. ఏది ప్రేమో, ఏది ఆకర్షణో తెలియని ఎన్నో జంటలకు విక్కీ ‘ట్రూత్‌ ఆర్‌ డేర్‌’ గేమ్‌తో బ్రేకప్‌ చెప్పించేవాడు. ‘ఇంతమందిని విడదీస్తున్న వీడు తప్పకుండా ప్రేమలో పడతాడు’ అనుకునేవాళ్లం నేనూ, ప్రియ.

బీటెక్‌ పూర్తైంది. ఉద్యోగ ప్రయత్నాల్లో నేను. తర్వాత ఏంటని వాడు. కొన్నాళ్లయ్యాక ‘బెంగళూరులో ప్రియ బంధువుల పెళ్లి.. వెళ్దాం’ అన్నాడు. నాకో ఇంటర్వ్యూ ఉంది నేను రాను అన్నా వినలేదు. ముగ్గురం వెళ్లాం. ఆ వేడుకలో ఓణీలు వేసుకొని వచ్చిన దేవకన్యల్లా అమ్మాయిలు అటూఇటూ తిరుగుతున్నారు. కాసేపయ్యాక నా పక్కనున్న విక్కీగాడు నన్నొదిలేసి మండపంవైపు అడుగులేశాడు. పెళ్లి వేదిక దిగుతున్న ఓ అమ్మాయిని కళ్లార్పకుండా చూస్తున్నాడు. ఇన్నేళ్లలో తను ఏ అమ్మాయిని ఎప్పుడలా చూడలేదు. నాకు సీన్‌ అర్థమయ్యే లోపే.. ప్రియ వచ్చి ‘తను నా కజిన్‌ చిన్నూ. హైదరాబాదే’ అంటూ పరిచయం చేసింది. ఈరోజు వీడేదో షాక్‌ ఇస్తాడు అనుకున్న. నా అంచనా నిమిషాల్లోనే నిజమైంది. నేను పక్కనుండగానే ‘చిన్నూ.. ఐ లవ్యూ’ అని ఆ అమ్మాయి కళ్లలోకి చూస్తూ చెప్పేశాడు. తనెక్కడ గొడవ చేస్తుందోనని నాలో టెన్షన్‌. తను అయోమయంగా మొహం పెట్టి సైలెంట్‌గా అక్కణ్నుంచి వెళ్లిపోయింది. చిన్నూ పేరెంట్స్‌కి విషయం తెలిస్తే గొడవలవుతాయని మేం భయపడుతుంటే వాడేమో తాపీగా చిన్నూ కోసం వెతుకుతున్నాడు. చివరికి ఎలాంటి గొడవ లేకుండా హైదరాబాద్‌ చేరుకున్నాం.

నేను ఇంటర్వ్యూకి వెళ్తుంటే ‘రేయ్‌ ఎఫ్‌బీలో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపా. యాక్సెప్ట్‌ చేస్తుందంటావా?’ అనడిగాడు. కనీసం నాకు ‘ఆల్‌ ది బెస్ట్‌’ కూడా చెప్పలేదని తిట్టుకుంటూ బయల్దేరా. నేనొచ్చేసరికి రాత్రైంది. వాడు కనపడలేదు. అమ్మానాన్నలూ తెలియదన్నారు. ప్రియకి ఫోన్‌ చేసి చెప్ఫా భయంతో జరిగిందంతా విక్కీ వాళ్ల నాన్నకి చెబుతుండగా.. ఫోన్‌ రింగ్‌ అయ్యింది. ‘మీ అబ్బాయికి యాక్సిడెంట్‌ అయ్యింది. వెంటనే రండి.’ అని. వెళ్లేసరికి ఐసీయూలో ఉన్నాడు. అప్పటికి రాత్రి 12 కావస్తోంది. ఆరోజు నా పుట్టినరోజు. ఉదయం వాడు స్పృహలోకి రాగానే.. ఏం జరిగిందిరా అని అడిగితే.. నవ్వుతూ నాకు బర్త్‌డే విషెష్‌ చెప్పాడు. వాడెంత కూల్‌ క్యారెక్టరో చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి? కొన్ని రోజులకు ఇంటికి పంపారు. కానీ, విక్కీలో ఊహించని మార్ఫు మొదట్లోలా ఆ జోష్‌ లేదు. ‘చిన్నూ గురించేనా?’ అనడిగితే విషయం దాటవేసేవాడు. ఓసారి ప్రియ బాగా కోప్పడింది. ‘రేయ్‌.. అది వాళ్లింట్లో చెప్పనందుకు సంతోషించు. లేదంటే గొడవలయ్యేవి. అయినా తనిక నీకు కనిపించదు. యూఎస్‌ వెళ్తోంది’ అంది. అంతా విని తన గురించి ఆలోచించడం మానేస్తాడనుకుంటే ‘చిన్నూని కాఫీకి పిలవొచ్చుగా’ అన్నాడు. మా స్నేహంలో వాడు మాకోసం ఏదైనా చేయడమేగానీ.. అడిగింది లేదు. కాదనలేకపోయాం.

ఓ కాఫీషాప్‌లో నలుగురం కలిశాం. ‘చూడు విక్రమ్‌ నేను వచ్చేనెలలో యూఎస్‌ వెళ్లిపోతున్నా. మళ్లీ కలవకపోవచ్ఛు అసలా పెళ్లిలో ప్రపోజల్‌ ఏంటి? మొదటి చూపులోనే ప్రేమా? నేనలాంటివి నమ్మను. మనం ఫ్రెండ్స్‌లా ఉందాం అని కూడా చెప్పను. నీకు యాక్సిడెంట్‌ అయ్యిందంటే పలకరించి వెళ్దాం అని వచ్చా టేక్‌కేర్‌..’ అని లేచి వెళ్లిపోయింది. వాడేం మాట్లాడలేదు. తను వెళ్లేంత వరకూ చూస్తూనే ఉన్నాడు. ఏంట్రా మాట్లాడవు అంటే... ‘చూడు మామ.. నా లక్ష్యం నాకు ఎలా ఇన్ఫర్మేషన్‌ ఇచ్చి వెళ్తోందో. ఇన్నేళ్లూ యూఎస్‌ వెళ్లే చదవాలా? అని అమ్మవాళ్లతో వాదించా. ఇప్పుడు నేను అక్కడే చదువుకోవడానికి ఓ కారణం దొరికింది. ఆ కారణం మొండిదైతే. నా ప్రేమ సంకల్పం గొప్పది. చూద్దాం నేను సప్త సముద్రాలు దాటి ప్రేమలో ఓడతానో.. జీవితాన్ని గెలుస్తానో’ అన్నాడు. వాడి మాటల్లో ట్రూత్‌, డేర్‌ రెండూ కనిపించాయి. తర్వాత వీసా సంపాదించి యూఎస్‌ వెళ్లాడు. మా మధ్య పెరిగింది దూరమే. మేం కొలువు చేస్తూ.. వాడేమో మాస్టర్స్‌ చేస్తూ కాస్త బిజీ అయ్యాం. చూద్దాం వాళ్లిద్దరూ ప్రేమికులవుతారా.. ఫ్రెండ్స్‌లా ఉంటారా?’ వచ్చే సంక్రాంతికి ఇండియా వస్తున్నాడు. వెల్‌ కమ్‌ మేరా దోస్త్‌..

-నిఖిల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని