మట్టికో క్లినిక్‌

ఒంట్లో బాగోకుంటే వెంటనే అందుబాటులో ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్‌కైనా చూపిస్తాం.. ప్రాథమిక చికిత్స చేయించుకుంటాం. మందులు వాడతాం.. మరి, బంగారం పండాల్సిన భూమిలో సారం తగ్గితే ఎవరికి చూపించాలి? రైతు నిస్సారంగా తోచిందేదో సాగుచేస్తూ కాలం గడపాల్సిందేనా?

Updated : 16 Nov 2019 06:39 IST

అంకుర్పారణ

ఒంట్లో బాగోకుంటే వెంటనే అందుబాటులో ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్‌కైనా చూపిస్తాం.. ప్రాథమిక చికిత్స చేయించుకుంటాం. మందులు వాడతాం.. మరి, బంగారం పండాల్సిన భూమిలో సారం తగ్గితే ఎవరికి చూపించాలి? రైతు నిస్సారంగా తోచిందేదో సాగుచేస్తూ కాలం గడపాల్సిందేనా? నష్టాల్ని చవిచూడాల్సిందేనా? ‘ఏం అక్కర్లేదు. మా క్లినిక్‌ రండి. మీ భూమి బాధ్యత మాది, సాగుకి అందాల్సిన చికిత్స మేం చేస్తాం..’  అంటూ భరోసా ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడో యువకుడు.. వ్యవసాయానికి చికిత్స అవసరం అంటూ అంకుర సంస్థని స్థాపించి క్లినిక్‌ తెరిచాడు. తనకొచ్చిన ఆలోచనకి కేంద్ర ప్రభుత్వం చేయూతనిచ్చేందుకు సిద్ధం అయ్యింది కూడా.

శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారం వాసి రగుతు మోహన్‌కుమార్‌. చదివింది ఎంఎస్సీ బయోటెక్‌. వ్యవసాయంపై తనకున్న మక్కువతో అన్నదాతలకు చేదోడుగా ఉంటూ ఉన్నత సేవలందించే లక్ష్యంగా ముందుకు సాగాడు. వ్యవసాయ భూమి నిస్సారం కాకూడదు. రసాయనిక ఎరువుల కారణంగా భూస్వభావం మారిపోయి.. భావితరాలకు వ్యవసాయ ఫలాలు ప్రమాదకరంగా మారొద్దు అనుకునే వాడు. ఈ పరిస్థితుల నుంచి తప్పించి వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు తప్పనిసరిగా సేంద్రియ ఎరువుల వైపు అన్నదాతలను నడిపించాలని తపన పడ్డాడు. పదమూడేళ్ల పాటు వ్యవసాయ రంగంపై పరిశోధనలు చేసి వ్యసాయానికో క్లినిక్‌ అవసరం అనుకున్నాడు. తన సొంత గ్రామం ప్రియాగ్రహారంలో సువర్ణ క్రాప్‌ క్లినిక్‌ను స్థాపించాడు. తన స్వంత పరిశోధనా కేంద్రంలో సేంద్రియ ఎరువులు, క్రిమి సంహారక మందులు తయారు చేస్తూ సాగు బాగోగులు చూసుకునేందుకు నడుం బిగించాడు.
ఆంధ్రా నుంచి ఒక్కడే...
మోహన్‌కుమార్‌ కృషికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అందించేందుకు సిద్ధమైంది. భారత వ్యవసాయ శాఖ అధీనంలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థకు అనుబంధంగా ఉన్న రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (ఆర్‌కేవీవై) నుంచి అంకుర సంస్థగా మోహన్‌కుమార్‌కు అనుమతి లభించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు వెయ్యిమంది అంకుర సంస్థల ఏర్పాటుకు ద]రఖాస్తు చేయగా, జాతీయ స్థాయిలో 17 మంది యువ పారిశ్రామిక వేత్తలకు అవకాశం కల్పించారు. అందులో మన రాష్ట్రం నుంచి మోహన్‌కుమార్‌ ఒక్కడే తొలిదశలో అనుమతులు పొందాడు. రెండేళ్లుగా చేస్తున్న పరిశ్రమను ఎట్టకేలకు రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన గుర్తించింది. ‘ఆర్‌కేవీవై’ రూపొందించే సేంద్రియ ఎరువుల మూలకణాన్ని మోహన్‌కుమార్‌ పొంది తద్వారా తన స్వంత పరిశోధనా కేంద్రంలో సేంద్రియ ఎరువులు, క్రిమిసంహారక మందులు వంటివి తయారు చేయగలుగుతాడు. స్టార్టప్‌ కింద ఎంపికైన మోహన్‌కుమార్‌ అంకుర సంస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి గరిష్ఠంగా రూ.25లక్షల నిధులు సమకూరతాయి. అలాగే వ్యవసాయ రంగ నిపుణుల నుంచి సూచనలు, సలహాలతో పాటు పరిశోధనలో భాగస్వామ్యం పొందే అవకాశం దక్కుతుంది.

- డిడి ప్రభుశర్మ, న్యూస్‌టుడే, నరసన్నపేట

సాగు బాగోగులు మా బాధ్యత..
- రగుతు మోహన్‌కుమార్‌, సువర్ణ క్రాప్‌ క్లినిక్‌

అంకుర సంస్థతో రైతులకు అనేక విధాలుగా సేవలందించొచ్చు. రసాయన ఎరువుల వినియోగం, పురుగుమందుల వాడకంతో భూమి సారం క్షీణిస్తోంది. రైతుల దృష్టిని సేంద్రియ ఎరువుల వైపు మళ్లించాలి. అప్పుడే భూమిలో తిరిగి బంగారం పండించడానికి వీలవుతుంది. ఈ దిశగా రైతుల్లో చైతన్యం తీసుకురావాలి. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకర సమాజాన్ని అందించడం ఎంత ముఖ్యమో... సారవంతమైన భూమి, దాంట్లోని సాగునీ అందించడం అంతే అవసరం.. నా లక్ష్యం అదే. అందుకే ఈ స్టార్టప్‌. రైతులను కూడగట్టి, వ్యవసాయం ఆరంభం నుంచి పంట దిగుబడి వచ్చే వరకూ దగ్గరుండి  చేదోడుగా నిలవాలి. సాగు సమయంలో భూమికి అందాల్సిన చికిత్సని అందించాలి. అందుకు నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించి క్లినిక్‌ సేవల్ని అందుబాటులోకి తేవాలి. అంతేకాదు.. నా స్టార్టప్‌కు ఉన్న మరో లక్ష్యం బయో ఉత్పత్తులు. భూసారం దెబ్బ తినకుండా సేంద్రియ ఎరువుల్ని తయారుచేసి అందించాలి. త్వరలో పూర్తి స్థాయిలో ల్యాబ్‌ ఏర్పాటు చేసి వ్యవసాయ రంగంలో మార్పులకు శ్రీకారం చుడతాం.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని