ఉషా పరిచయం

‘‘పెద్దమ్మా..!’’ కొత్త గొంతు.. పక్కింట్లో నుంచి. చెవిని చేరిన గొంతు గుండెను మీటింది. కాళ్లు ఆగవుకదా..! వెంటనే పరుగులు తీశాయి. ‘‘ఆంటీ..’’ అంటూ లోపలికెళ్లా. ‘రా! నాన్నా.. నేనే పిలుద్దామనుకుంటున్నా. పొద్దుట్నుంచి ఒకటే సతాయింపు.. పొద్దు పోతలేదని....

Published : 16 Nov 2019 00:48 IST

‘‘పెద్దమ్మా..!’’ కొత్త గొంతు.. పక్కింట్లో నుంచి. చెవిని చేరిన గొంతు గుండెను మీటింది. కాళ్లు ఆగవుకదా..! వెంటనే పరుగులు తీశాయి. ‘‘ఆంటీ..’’ అంటూ లోపలికెళ్లా. ‘రా! నాన్నా.. నేనే పిలుద్దామనుకుంటున్నా. పొద్దుట్నుంచి ఒకటే సతాయింపు.. పొద్దు పోతలేదని. ఉషా.. ఉషా.. ఇంతలో పాలరాతి బొమ్మ ప్రాణం పోసుకొని ప్రత్యక్షమైంది. మెరుపు మేనక రూపం ధరించి వచ్చిందా అన్నట్టుగా!! విశాల నేత్రాలు. తీరైన కనుబొమలు. వస్తూ వస్తూ.. నన్ను చూస్తూ చూస్తూ.. రెప్పవాల్చి.. క్రీగంట నా కొంటె చూపును కనుగొంటూ.. లోలోపల ఏదో గొణుక్కుంటూ.. వచ్చి నిల్చుంది. అడవిలోకి ఆమని వచ్చినట్టు. కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకినట్టు.. నా మనసును ప్రేమ తట్టింది. ‘ఇదే ఉష. మా చెల్లెలి కూతురు. సెలవులకని వచ్చింది. బోర్‌ కొడుతోందని ఒకటే నస. నీ దగ్గర బుక్స్‌ ఉంటే ఏమైనా ఇయ్యయ్యా.. చదువుకుంటది.’ ‘మళ్లీ చదువేనా! ఏంది పెద్దమ్మా..’ నీరసంగా అన్నా.. నా చెవులకు సరసంగా వినిపించింది. ‘ఏదో ఒకటి చెయ్‌.. నాకు పనుంది.’ అంటూ ఆంటీ లోపలికి వెళ్లిపోయింది.
‘మాది పక్కిల్లే.. మా ఇంటికి రా.. క్యారెమ్‌, చెస్‌ బోర్డ్స్‌ ఉన్నయ్‌. నీకు ఇంట్రెస్ట్‌ ఉంటే ఆడుకో’. ‘ఎవరితో..’ అంది చిలిపిగా.. ‘ఇంకెవరితో.. ’ అని మా ఇంటికి దారి తీశా. ‘అమ్మా! క్యారెమ్‌ కాయిన్స్‌ ఎక్కడున్నయే!’ గూళ్లు వెతుకుతున్నా. వంటింట్లో నుంచి వచ్చిన అమ్మ ‘వెధవా! పిలుస్తుంటే ఆ ఉరుకుడేందిరా..!’ చెవి మెలిపెట్టింది. వస్తున్న నవ్వును ఆపుకొంటూ ఉష కర్టెన్‌ చాటుకు ముఖం తిప్పుకొంది. భానుబింబం మొయిలు మాటుకు వెళ్లిందా అనిపించింది. ఇంతలో తనని చూసి.. ‘నువ్వా ఉషా. బాగున్నావా? ఎప్పుడొచ్చావ్‌’ అనేసి క్యారెమ్‌ కాయిన్స్‌ ఇచ్చి ‘ఆంటీ వాళ్లింట్లో ఆడుకోండి పోండి..’ అంది. బోర్డుతో నేను.. వెనకాలే తను. లెక్కపెడితే.. ఏడు కాదు.. ఏడూఏడు పద్నాలుగు అడుగుల్లో పక్కింటికి చేరాం. ఆట మొదలైంది. ఇప్పుడు నువ్వు.. నేను.. అదివ్వు.. పొడి మాటలే తప్ప.. మరో మాట లేదు. అన్ని గేముల్లోనూ గెలుపు నాదే. ఇంతలో అమ్మ కేక. నేను కెవ్వనకుండా ఉండాలంటే వెంటనే వెళ్లిపోవాలి. సాయంత్రం కలుద్దామని ఇంటికొచ్చేశా.  కాసేపటికి ‘అక్కా..’ అని అమ్మను పిలుస్తూ ఉష వాళ్ల పెద్దమ్మ ఇంటికి వచ్చింది. చీరల నుంచి చీటీ పాటల వరకూ సాగిపోయాయి ముచ్చట్లు.. పోతూ పోతూ.. ‘రాము.. ఒక్కసారైనా ఓడిపోరాదయ్యా.. అది ఒకటే ఏడుపు’ అంది. నాకు నవ్వొచ్చింది. నేను కొట్టిన కాయిన్‌ భలేగా పడిందనిపించింది. సాయంత్రం ఐదు. మళ్లీ ఆట మొదలు. నేను ఓడిపోతూనే ఉన్నా. ఆమె గెలుస్తూనే ఉంది. ‘కావాలనే ఆడట్లేదు కదా!’ అంది. ‘లేదు నువ్వు బాగా ఆడుతున్నావ్‌!’ అన్నాన్నేను. ‘‘కొయ్‌ కొయ్‌.. నాకన్నీ తెలుసు.. మా పెద్దమ్మ సిఫార్సు చేసినట్టుంది.. తమరు ఓడిపోతున్నట్టున్నారు..’’ మధ్యాహ్నం పొడి పొడి మాటల పిల్ల ఇలా వడివడిగా వాగేస్తుంటే.. నా మనసు పల్టీకొట్టినట్టయింది.
మర్నాడు ఉదయం.. రేడియోలో నచ్చిందీ మల్లెచెండూ.. పాట. అంతలోనే వచ్చిందీ గాళ్‌ఫ్రెండూ.. ‘రామూ! చర్చికి వెళ్దామా?’ అంది. సరేనన్నా. టెన్‌ మినట్స్‌లో వచ్చేస్తానంటూ వెళ్లింది. మేం మెదక్‌లో ఉండేవాళ్లం. ఆసియా ఖండంలోనే రెండో పెద్ద చర్చి అక్కడుంది. అందుకే మా ఇంటికి ఏ బీరకాయ పీచు చుట్టమొచ్చినా.. వారికి నేను చర్చి చూపించాల్సిందే. వాళ్లతో అయితే భారంగా నడిచేవాణ్ని. ఇన్నాళ్లకు ఓ చక్కని చుక్కతో వెళ్తున్నానని మనసు గాల్లో తేలిపోసాగింది. రేడియోలో మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా.. పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా.. పాట జోరుమీదుంది. ఇంతలో తెల్లటి గాగ్రా చోళీలో ప్రత్యక్షమైంది ఉష. ‘ఈ కలువ కన్నెను చూసేందుకు మబ్బు చాటునున్న చంద్రుడు బయటకొచ్చి విచ్చుకున్నాడ’నిపించింది. ఇద్దరం బయల్దేరాం. ఊరి విశేషాలు చెబుతూ నేను. ఊఁ కొడుతూ తనూ. చాలా దూరం నడిచేశాం. ఆఁ.. ఊఁ తప్ప ఏమనదే! బల్బు వెలిగింది. అవును ఉషా.. ఈ డ్రెస్‌ చాలా బాగుంది.. అనేశా! ‘అంటే నేను బాలేనా..’ అంది చిరుకోపం ప్రదర్శిస్తూ.. నువ్వేసుకున్నందుకే ఆ డ్రెస్‌ బాగుంది.. అనడంతో కిలకిల నవ్వింది. చెట్ల నీడలో అలా నడుస్తూ.. తోచిన కబుర్లు చెప్పుకొంటూ.. చర్చికి చేరుకున్నాం. సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాం. ఇంకో మూడురోజులు అయ్యేసరికి.. ‘ఓ.. ఓయి.. ఓసి..’ ఇలా సంబోధన ప్రథమా విభక్తిలో పిలుచుకునేంత దగ్గరయ్యాం. కనుసైగలతో భావాలు అర్థం చేసుకునేంత చనువు ఏర్పడింది. పిట్టగోడ మీద కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకునే తీరిక వచ్చింది. ఓ మధ్యాహ్నం వేళ.. డాబా నీడలో అలాగే మాట్లాడుకుంటున్నాం.. ఇంతలో దబుక్కున గోడ దూకి ఇంట్లోకి తుర్రుమంది ఉష. అంతలో ఓ వ్యక్తి ఆంటీ వాళ్లింట్లోకి వెళ్లాడు. ‘వదినా బాగున్నారా! ’ అని వినిపించింది. ఆ వచ్చింది ఉష వాళ్ల నాన్నని అర్థమైంది. నేనూ ఇంట్లోకి వెళ్లిపోయాను. సాయంత్రం ఆరవుతోంది.. సూరీడు పడమట దిక్కున వాలిపోతున్నాడు. భారంగా బయటకొచ్చిన ఉష వాలిపోయిన కళ్లతో నావంక చూసింది. ‘వెళ్తున్నానోయ్‌’ అన్నట్టుగా సైగ చేసింది. అప్పటిదాకా నా మదిలో గూడు కట్టుకున్న ఆమె చిరునవ్వు, చిలిపి చూపులు, కొంటె మాటలు అన్నీ మాయమయ్యాయి. ఉష కడసారి చూపు మాత్రం రేఖా మాత్రంగా ఎదలో నిలిచిపోయింది. వారం రోజుల స్నేహం వాళ్ల నాన్న రాకతో వాడిపోయింది.
ఏడాది తిరిగే సరికి మా కుటుంబం హైదరాబాద్‌కు వచ్చేసింది. ఐదేళ్లు దాటేటప్పటికి ఉష పెళ్లయ్యిందని ఎవరి ద్వారానో తెలిసింది. మళ్లీ పన్నెండేళ్ల తర్వాత అనుకోకుండా అవేకళ్లు ఎదురుపడ్డాయి. ఎలా ఉన్నావని మౌనంగా ప్రశ్నించాయి. చొరవ తీసుకుని అడిగే స్థితిలో తను లేదు. చనువుగా బదులిచ్చే పరిస్థితిలో నేను లేను. ఉష మాత్రం సంతోషంగా ఉందనిపించింది. ఉషా పరిచయం.. తీపి జ్ఞాపకంగా మదిలో నిలిచిపోయింది.

- శ్రీరామ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని