సునామీలా వస్తోంది తను..

నేను ‘జీరో’గా ఉన్నప్పుడు తను నా జీవితంలోకి వచ్చింది. ఓ స్థాయికి చేరుకున్నాక నన్నొదిలి వెళ్లింది. అది త్యాగమో, స్వార్థమో, పిచ్చితనమో

Published : 23 Nov 2019 00:46 IST

నేను ‘జీరో’గా ఉన్నప్పుడు తను నా జీవితంలోకి వచ్చింది. ఓ స్థాయికి చేరుకున్నాక నన్నొదిలి వెళ్లింది. అది త్యాగమో, స్వార్థమో, పిచ్చితనమో నాకర్థం కాలేదు. కానీ తను నా పక్కన ఉన్నప్పుడు మిగిల్చిన జ్ఞాపకాలు రోజూ గుర్తొచ్చి నన్ను నిద్రకు దూరం చేస్తే.. తను మళ్లీ వస్తుందనే సంతోషంతో కాలు నిలవడం లేదు.

డిగ్రీ పూర్తై అప్పటికి రెండేళ్లు. ఏదో ఒకటి సాధించాలన్న కసి ఉన్నా దురదృష్టం వెంటాడేది. కొద్దిమార్కుల తేడాతో ఉద్యోగం అందకపోయేది. అదిగో అప్పుడొచ్చింది నా జీవితంలోకి ఏంజెల్‌లా. ఓ మధ్యాహ్నం వేళ పరీక్ష రాయడానికి వెళ్తున్నా. గేటు దగ్గరికి రాగానే ఒకమ్మాయి నన్ను దాటుకుంటూ వేగంగా ముందుకెళ్లింది. ఆమె మేని నుంచి వచ్చిన మలయ మారుతం చల్లగా నా మొహాన్ని తాకింది. కొద్దిక్షణాలపాటు ఆమెనే చూస్తుండిపోయా. రెండోరోజూ కనపడింది. మాట కలపకుండా నన్ను నేను ఆపుకోలేకపోయా. కాసేపయ్యాకే అర్థమైంది తను గలగలా పారే మాటల ప్రవాహమని. కాలేజీ ముచ్చట్ల నుంచి ప్రపంచ రాజకీయాల దాకా అన్నీ అలవోకగా మాట్లాడేసింది.

ఫలితాలొచ్చాయి. ఫోన్‌ చేస్తే ‘నేనూ సెలెక్ట్‌ కాలేద’ంది. వస్తుందనుకున్న ప్రభుత్వ ఉద్యోగం రాకపోయేసరికి పూర్తిగా డీలా పడిపోయా. ‘ఎందుకలా బాధ పడతావ్‌? ఇది రాకపోతేనేం.. నువ్వు కథలు, కవితలు బాగా రాస్తావుగా! అందులోనే కెరీర్‌ వెతుక్కో’ అంది. అప్పుడే కాదు.. బాధల్లో ఉన్న ప్రతిసారీ నా పక్కనుండేది. మనసారా ఓదార్చేది. రోజంతా పుస్తకాలతో కుస్తీ పడుతూ ఒత్తిడిలో ఉన్నప్పుడు మండుటెండలో పన్నీటి జల్లులా నాపై తీయని మాటలు చల్లేది.

మరో ఇంటర్వ్యూకెళ్లాం. వడపోతలో ఇద్దరమే మిగిలాం. ‘మీలో ఒక్కరికే అవకాశముంది. జాబ్‌ ఎవరికి కావాలో మీరే తేల్చుకోండి’ అన్నారు. క్షణం ఆలస్యం చేయకుండా నన్నే చేరమంది. వారిస్తుంటే ‘నీ కష్టం నాకు తెలుసురా. అయినా నీకున్న టాలెంట్‌కి నువ్వే ఈ ఉద్యోగానికి అర్హుడివి’ అంటూ బలవంతపెట్టింది. ‘థాంక్స్‌’ అని చెప్పి తన రుణం తీర్చుకోవాలనిపించలేదు. నాపై ఇష్టంతోనే అలా చేసిందనే గర్వం కలిగింది నాలో.

జాబ్‌లో చేరాక నా దినచర్య మారిపోయింది. మేం కలుసుకోవడం తగ్గినా ఫోన్లలో పలకరించుకునేవాళ్లం. తన మాట నా మదిని చేరితేగానీ నా కళ్లకి నిద్ర రాకపోయేది. ప్రతి రాత్రీ తన గురించి నా గుండెలో ఓ ప్రేమలేఖ రాసుకునేవాణ్ని. ఆ లేఖల బరువుని నా గుండె తట్టుకోలేక ఓరోజు మనసులో మాట చెప్పేసా. ‘జోక్‌ చేయకురా’ అంటూ నవ్వింది. ‘నేను నిన్ను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు’ అంది. జీవితాంతం ఫ్రెండ్స్‌గా ఉందామంది. మనసులో ప్రేమ పెట్టుకొని స్నేహమనే ముసుగు వేసుకోలేనుగా! అయినా ఫ్రెండ్స్‌ లవర్స్‌ కాకూడదనే రూల్‌ ఎక్కడైనా ఉందా? నటించడం నావల్ల కాలేదు. నా ప్రేమని ఒప్పుకొమ్మని వాదించా. కుదరదంది. ‘నీకేం తక్కువ? మంచి అమ్మాయి దొరుకుతుంది. చూసి పెళ్లి చేసుకో’ అని సలహా. ‘ఆ అమ్మాయి నువ్వే ఎందుకు కాకూడద’ంటే నవ్వే సమాధానం. రోజూ వాదన కొనసాగేది. నా మాటలు చిరాకొచ్చాయేమో ఓరోజు మధ్యలోనే ఫోన్‌ కట్‌ చేసింది. తర్వాత చేస్తే లిఫ్ట్‌ చేయలేదు. ఆపై ఎన్నిసార్లు ప్రయత్నించినా అసలు ఫోనే కలవలేదు. తను నా జీవితంలో నుంచి తప్పుకుందని అర్థమయ్యేసరికి కన్నీరే తోడైంది. తన జ్ఞాపకాలు మనసుని మెలిపెడుతుంటే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.

నెలలు గడుస్తున్నాయి. తను నా నుంచి వెళ్లిపోయాక నాకు జీవితమే భారంగా అనిపించేది. అదిగో ఆ బాధలో ఉన్నప్పుడు వచ్చిందో ఫోన్‌కాల్‌. శిశిరంలో మోడు వారిన నా మనసుకి వసంతంతో మళ్లీ చిగుళ్లు తొడిగాయి. ‘రేయ్‌ నాకు కాల్‌ లెటర్‌ వచ్చింది. మీ సంస్థలోనే జాయిన్‌ అవుతున్నా. మళ్లీ ప్రేమా, గీమా అని చంపకు’ అంటూ. ఇది కలా? నిజమా? తన ఫోన్‌తో నా కాళ్లు నేలపై నిలవలేదు. ఇప్పుడు తననెలా రిసీవ్‌ చేసుకోవాలి? ఏం మాట్లాడాలి? మనసంతా గందరగోళం. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న సంద్రంలాంటి నా జీవితంలోకి తీయని సునామీలా వస్తోంది తను. నా మొర ఆలకిస్తుందా? నన్నర్థం చేసుకుంటుందా? అదంతా తర్వాత. ముందు తనని నిండారా నా కళ్లలో నింపుకోవాలి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం!

- సతీశ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని