కొడుకుగా భావించి.. అల్లుడిగా ఆశీర్వదించి

కాలేజీ.. పెళ్లి వేడుక.. బంధువుల ఇల్లు.. పండగ సందర్భం.. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య వలపు చిగురించే వేదికలు.

Updated : 30 Nov 2019 11:18 IST

కాలేజీ.. పెళ్లి వేడుక.. బంధువుల ఇల్లు.. పండగ సందర్భం.. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య వలపు చిగురించే వేదికలు. నాది వీటన్నింటికీ భిన్నం. తనపై నా ప్రేమ ఆసుపత్రిలో మొగ్గ తొడిగింది.

నాలుగేళ్ల కిందట. అక్కకు ఆరోగ్యం బాగోక హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చారు మావాళ్లు. అప్పుడు నేను సిటీలోనే చిన్న ఉద్యోగం చేస్తున్నా. విషయం తెలియగానే పరుగెత్తుకెళ్లా. ఆరోజు సాయంత్రం ఆసుపత్రి రిసెప్షన్‌లో కూర్చొని ఉన్నప్పుడు వాళ్ల నాన్నతో వచ్చింది తను. సముద్రపు అల ఒక్కసారిగా ఎగసిపడి తీరాన్ని తాకినట్టు నా మనసులో అలజడి రేగింది. అందంగా, అమాయకంగా, అణకువగా ఉన్న తనెందుకో నాకు మొదటిచూపులోనే తెగ నచ్చేసింది. ఆ క్షణం నుంచి తనెక్కడున్నా నా కళ్లు వెతికేవి. మర్నాడు అక్కని సాధారణ గదికి మార్చారు. అమ్మానాన్నలు ఇంటికెళ్లిపోవడంతో నేనొక్కడినే ఉన్నా. ఆ సమయంలోనే అదృష్టం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నా మనసుని కనికట్టు చేసిన అమ్మాయి వాళ్లమ్మకి చిన్న సర్జరీ తర్వాత అక్క పక్క బెడ్‌కి తీసుకొచ్చారు. ఆమెని చూడగానే అవధుల్లేని ఆనందం. మాట కలపాలని ఉన్నా లోలోపల ఏదో భయం. పక్కపక్కనే ఉండటంతో అక్క, వాళ్లమ్మా మాట్లాడుకునేవారు. ‘ఆంటీ’ అంటూ నేనూ మెల్లగా మాట కలిపా.

వాళ్లాయనకు ఫోన్‌ చేస్తానని ఆంటీ ఓసారి నా ఫోన్‌ తీసుకున్నారు. మూడోరోజు అందరం డిశ్చార్జై వెళ్లిపోయాం. మూడ్రోజుల్లో తనతో ఒక్క మాట మాట్లాడకున్నా తను వెళ్తుంటే మనసులో చెప్పలేనంత దిగులు. ఇంట్లో, ఆఫీసులో ఎక్కడున్నా తనే గుర్తొచ్చేది. ఎలాగైనా మాట్లాడాలనిపించేది. ఉండబట్టలేక ఓరోజు కాంటాక్ట్స్‌ లిస్ట్‌ వెతికి ఆరోజు ఆంటీ చేసిన నెంబర్‌ పట్టుకున్నా. ఫోన్‌ చేసి ‘అంకుల్‌ నా పేరు సురేశ్‌.. ఆసుపత్రిలో ఆంటీకి నేను పరిచయం. తనిప్పుడు ఎలా ఉన్నారు?’ అనడిగా. ఆప్యాయంగా మాట్లాడారామె. రెండు, మూడురోజులకోసారి ఆంటీని పలకరిస్తూనే ఉండేవాణ్ని. వాళ్ల అమ్మాయి గురించి ఆరా తీసేవాణ్ని. ఎన్నాళ్లిలా? ఓసారి ధైర్యం చేసి ‘ఆంటీ.. మీ అమ్మాయంటే నాకు చాలా ఇష్టం. మీరు ఒప్పుకొంటే తనని పెళ్లి చేసుకుంటా’ అన్నా. వేరొకరైతే నానా యాగీ చేసేవారేమో. ఆంటీ సావధానంగా విన్నారు. నా ఇష్టంలో నిజాయతీ గ్రహించి సానుకూలంగా స్పందించారు. కొద్దిరోజులయ్యాక ‘తనకు, అంకుల్‌కి ఓకే అయితే నాకే అభ్యంతరం లేదు’ అన్నారు. తర్వాత తనకి ఫోన్‌ చేసి ప్రపోజ్‌ చేశా. ‘అమ్మానాన్నకు ఇష్టమైతే నాకూ ఇష్టమే’ అంది సిగ్గుల మొగ్గవుతూ. ఓరోజు వాళ్లింటికెళ్లి అంకుల్‌తో మాట్లాడాను. నా ఉద్యోగం, కుటుంబం వివరాలు అడిగారాయన. ‘ప్రస్తుతం చేస్తోంది చిన్న ఉద్యోగమే.. కొద్దిరోజుల్లో పెద్ద కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్తున్నా’నన్నా. కొద్దిరోజులు టెన్షన్‌లో పెట్టి చివరికి ఆయనా ‘ఓకే’ చెప్పారు. అమ్మానాన్నలూ ‘నీ సంతోషమే కదరా మాకు కావాల్సింది’ అన్నారు. రెండు కుటుంబాల మధ్య రాకపోకలు పెరిగాయి. తను ఒక్కతే కూతురు కావడంతో నన్ను కొడుకులా చూసుకునేవారు.

నాకు మంచి సంస్థలో ఉద్యోగం వచ్చింది. తన చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆల్‌ హ్యాపీస్‌ అనుకుంటుండగా ఓ చిక్కొచ్చి పడింది. మా కులాలు వేరు. మా పెద్దవాళ్లు పెద్దమనసుతో ఒప్పుకున్నా బంధువులు పేచీ పెట్టారు. ‘కులాంతర వివాహం ఎలా చేసుకుంటావ్‌?’ అంటూ అభ్యంతరం చెప్పారు. వాళ్ల తీరు నాకు నచ్చలేదు. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. నాకు మంచి ఉద్యోగముంది. తనని పెళ్లాడితే పోషించే స్తోమత ఉంది. అన్నింటికీ మించి పెద్దవాళ్ల అండదండలున్నాయి. ఇంతకంటే ఏం కావాలి? కులం కుళ్లుతో వేలాడేవాళ్లను ఖాతరు చేయొద్దనుకున్నా. కానీ.. కొన్నాళ్లకి వాళ్లూ మారడం మొదలుపెట్టారు. మీ పెళ్లికి వస్తాం అని మాటిచ్చారు. సమాజంలో మనకంటూ ఓ గుర్తింపు ఉంటే చేసే ఏ మంచి పనికైనా మద్దతు ఉంటుందని అర్థమైంది. త్వరలో మేం పెళ్లిపీటలెక్కబోతున్నాం. ఇప్పుడు నాకు ఒక్కటే లక్ష్యం. తన కూతుర్ని అపురూపంగా చూసుకునే మా మామయ్యని మర్చిపోయేలా నా శ్రీమతికి నేను మమకారం పంచాలనే.

- సురేశ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని