రహస్యాలకు రెక్కలు

మేం హైదరాబాద్‌లో ఉంటాం. దూరాన్ని దగ్గర చేసే విమానాలంటే చిన్నప్పటి నుంచీ ఇష్టం. కాగితంతో ఎయిర్‌క్రాఫ్ట్‌ చేసుకుని...

Published : 07 Dec 2019 00:41 IST

కొత్త కలం

విమానం తెలుపు రంగులోనే ఎందుకుంటుంది?

పక్షులు తగిలితే విమానం పేలిపోతుందా?

ఆకాశంలో కమ్ముకునే పొగ, మెరుపులు వల్ల ఇబ్బంది ఉంటుందా?

రిటైర్డ్‌ అయిన విమానాలు ఎక్కడ ఉంచుతారు?

ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానంగా ‘101 ఫ్లయింగ్‌ సీక్రెట్స్‌’ అనే పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. ఇరవై మూడేళ్ల ‘రాకేష్‌ ధన్నారపు’ ఈ పుస్తక రచయిత. ప్రయాణికులకోసం ప్రభుత్వాలు, విమానయాన సంస్థలు చేయాల్సిన ఈ పనిని ఇతనెందుకు చేయాల్సి వచ్చింది? 101 ఫ్లయింగ్‌ సీక్రెట్స్‌ వెనకాల కథేంటో రచయిత రాకేష్‌ ధన్నారపు ‘ఈతరం’తో చెప్పుకొచ్చాడిలా..

మేం హైదరాబాద్‌లో ఉంటాం. దూరాన్ని దగ్గర చేసే విమానాలంటే చిన్నప్పటి నుంచీ ఇష్టం. కాగితంతో ఎయిర్‌క్రాఫ్ట్‌ చేసుకుని గాల్లోకి ఎగరేసి దానితో పాటు నేనూ తేలిపోయేవాణ్ణి. నిజంగా విమానంలో ఎగిరింది మాత్రం ఆరో తరగతిలో. పెద్దయ్యాక ఏవియేషన్‌ కోర్సు చేయాలనుందంటే అమ్మానాన్న సరే అన్నారు. ఇంటరయ్యాక చెన్నైలో ‘ఎయిరోస్పేస్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌’ చదివాను. బీటెక్‌ నాలుగేళ్లలో ఆరుచోట్ల ఇంటర్న్‌షిప్‌లు చేశా. ఇంజినీరింగ్‌ అయ్యాక..‘ఆసియా పసిఫిక్‌ ఫ్లైట్‌ ట్రైనింగ్‌ స్కూల్‌’లో క్యాడెట్‌ పైలెట్‌గా సిములేటర్‌లో 900 గంటలపాటు గ్రౌండ్‌ ట్రైనింగ్‌ చేశా. కమర్షియల్‌ పైలెట్‌ అయ్యేందుకు మెడికల్‌ పరీక్షల కోసం హైదరాబాద్‌లో ఓ ప్రముఖ వైద్యుడి దగ్గరకి వెళ్లా. ఓ చిన్న ఆపరేషన్‌ చేస్తే సరిపోతుందన్నారు.. చేశారు. నిజానికి నాకు సర్జరీ అవసరం లేదు. అయినా చేశారు. దీంతో నేను అనర్హుడినయ్యా. వైద్యుడు చేసిన తప్పిదం వల్ల ఫిజికల్‌గా ఏవియేషన్‌లో ముందుకు వెళ్లలేకపోయా. కళ్ల ముందే నా కల నాశనమైందని ఏడ్చేశా. ఇక జీవితం అయిపోయిందనుకున్నా.

అదే నా కల

కెరీర్‌ నాశనమైందని డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ‘నువ్వు ఒకటనుకున్నావ్‌. విధి మరొకటి అనుకుంది. దీనికే బాధపడితే ఎలా? అంటూ అమ్మానాన్నలు సముదాయించారు. ‘ఏమీకాదు.. నువ్వింకా చిన్నపిల్లోడివే నీకు మంచి భవిష్యత్తుందన్నారు’ నాన్న. ఆస్ట్రేలియాలోని ‘ఎయిర్‌ వర్తీనెస్‌’ కోర్సులో స్పెషలైజేషన్‌ చేయించారు. అక్కడ ఒంటరితనం వల్ల మళ్లీ ఒత్తిడి. కుటుంబం అండ, ఆధ్యాత్మికతతో పాటు విమానమే స్ఫూర్తిగా నిలిచింది. ఎలాగంటే.. ఎయిర్‌క్రాఫ్ట్‌ గురుత్వాకర్షణ శక్తి, గాలికి విరుద్ధంగా ఎగిరి తనకు తాను నిలదొక్కుకుంటుంది. పైకి ఎగురుతుంది. జీవితంలో కూడా మనం టేకాఫ్‌ కావాలంటే సవాళ్లను ఎదుర్కోవాలనుకున్నా. దేశంలోని ఏవియేషన్‌ రంగానికి నాదైన ప్రత్యేకత చూపాలన్నదే నా కల.

పుస్తకం వెనక కథ

మనిషికి, విమానానికి మధ్య దూరాన్ని తగ్గించాలనుకునేవాణ్ణి. విమానరంగ సంస్థలు, ప్రభుత్వం ఈ పనిచేయాలి. బ్రిటన్‌లో విమానయానంలో భయాలొద్దని ‘ఫ్లయింగ్‌ విత్‌ కాన్ఫిడెన్స్‌’ శిక్షణాతరగతులు నిర్వహిస్తారు. చైనాలో నాణేలను గాల్లోకి ఎగరేయడాన్ని అదృష్టంగా భావిస్తారు. ఒకామె అలా విమానం ఎక్కుతుండగా నాణేన్ని గాల్లోకి ఎగరేసింది. అది పొరపాటున ఇంజిన్‌లో పడింది. ఐదు గంటలపాటు శ్రమించి ఇరవై మంది ఇంజినీర్లు ఆ నాణేన్ని వెతికి తీశారు. ప్రయాణం ఆలస్యమైంది. విమానాల దగ్గర నాణేలను ఎగరేయకూడదనే చిన్న విషయం కూడా ప్రయాణికులకు తెలీదు. అంతెందుకు.. ఫ్రిజ్‌, స్మార్ట్‌ఫోన్‌.. లాంటివాటికి ఓ మాన్యువల్‌ ఉంటుంది. అయితే విమాన ప్రయాణికులకు అలాంటి మాన్యువల్‌ లేదు. ఇందుకోసమే.. ఎయిర్‌క్రాఫ్ట్‌ లిటరేచర్‌ గురించి ఓ పుస్తకం రాద్దామనుకున్నా. ఆస్ట్రేలియాలో చదువుతూనే పార్ట్‌టైంగా ‘ఉబర్‌ ఈట్స్‌’ సంస్థలో పనిచేశా. ఆ డబ్బే పుస్తకానికి ఖర్చు చేశా. విమానాలకు సంబంధించిన సాంకేతిక విషయాల్ని సులువుగా రాసి.. మా నాన్నకు రోజూ మెయిల్‌ చేసేవాణ్ణి. ఇలా మూడు నెలల పాటు పుస్తకం కోసం పనిచేశా. ఆస్ట్రేలియాలో నేను చదువుకున్న యూనివర్శిటీ వాళ్లు ఈ పుస్తకాన్ని లైబ్రరీ కోసం ఆర్డర్‌ ఇవ్వటం గొప్ప అనుభూతి. విమానం గురించి మీకుండే సందేహాలన్నీ ఈ పుస్తకం తీరుస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని