మన ప్రేమని..కారణాలకు బలీయొద్దు

ఒక అమ్మాయి ఇష్టాన్ని కన్నవాళ్లు కాదంటే ఎలాగైనా ఒప్పించొచ్ఛు అదే కావాలనుకున్నవాడే కాదంటుంటే..? ...

Updated : 14 Dec 2019 07:04 IST

ఒక అమ్మాయి ఇష్టాన్ని కన్నవాళ్లు కాదంటే ఎలాగైనా ఒప్పించొచ్ఛు అదే కావాలనుకున్నవాడే కాదంటుంటే..? ఆ బాధను చెప్పేందుకు మాటలు చాలవు. ఇప్పుడు నాది అదే పరిస్థితి...

దువైపోయి ఉద్యోగంలో చేరా. నా కాళ్లపై నేను నిలబడుతున్నాననే ఆనందంలో ఉన్న రోజులవి. లోకాన్ని నేను చూసే తీరు మారింది. అదే సమయంలో తనని చూశా. చూడగానే దగ్గరి మనిషిలా అనిపించాడు. అప్పటి వరకూ ప్రేమ అనే పదానికి అర్థమే తెలియని నాకు మొదటి చూపులోనే నచ్చేశాడు. రోజూ తనని చూడాలని, తనతో మాట్లాడాలని అనిపించేది. ఓ రోజు ధైర్యం చేసి మాట్లాడుదామనుకున్నా.. దగ్గరికి వెళ్లా. నా గుండె వేగం రెట్టింపయ్యింది. నోట మాట రాలేదు. ఏదో తెలియని భయం. ‘హాయ్‌!!’ అని వచ్చేశా.. ఆ క్షణంలో ఏం మాట్లాడాలో తోచలేదు. కానీ, ఆనందం ఏంటంటే.. తన కంట్లో పడ్డాను. అది మొదలు.. ఇంకాస్త దగ్గరగా గమనించడం మొదలుపెట్టా. తన అభిప్రాయాలు, ప్రవర్తన, భవిష్యత్తుపై తను తీసుకునే నిర్ణయాలు.. అన్నీ నాకు దగ్గరగా ఉన్నాయి. ఓ రోజు తనే నన్ను పలకరించాడు. ఆ మాటలు.. తను తీసుకునే చనువు.. నాలో భయాన్ని పోగొట్టాయి. తన పలకరింపుతో రోజంతా ఎంతో హుషారు. తనతో వేసే అడుగులకు అలసటే తెలిసేది కాదు. చినుకుల్లా మొదలైన మాటలు.. జోరువానలా.. ఓ ప్రవాహంలా సాగాయి. తనతో ఉన్నప్పుడు నాన్న సంరక్షణలో ఉన్నంత భద్రంగా అనిపించింది. అంతా సాఫీగా సాగుతున్న జీవితంలోకి ఓ కొత్త పేజీ తెరిచే టైమ్‌ వచ్చింది. ఇంట్లో పెళ్లి ప్రస్తావన. చేసుకుంటావా? అంటూ అడుగుతుంటే.. ముఖంలో సిగ్గు చూపిస్తూ. మనసులో భయాన్ని దాచుకున్నా. అదే విషయం తనతో మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకూ నా జీవితాన్ని ఎవరితోనూ ఊహించుకోలేదు. ఒక్క నిన్ను తప్ఫ ఇక మనం ఏడు అడుగులు నడిచే టైమ్‌ వచ్చేసింది’ అని చెప్పేశా. కానీ తన నుంచి స్పందన లేదు. మా మధ్య కొన్ని నిమిషాల పాటు నేను ఊహించని నిశ్శబ్దం. తర్వాత నేను ఎప్పుడూ వినని మాటలు.. నేల చూపులు. వాటి వెనకే బాధ్యతలు, బరువులూ అంటూ.. అప్పుడే పెళ్లి ప్రస్తావన వద్దని వెళ్లిపోయాడు.

నన్ను వేచిచూడమనే సమాధానమూ లేదు. ఇంట్లో పెళ్లి మాటలు ఎక్కువయ్యాయి. ఏ క్షణాన ఎవర్ని తెచ్చి కట్టబెడతారో అని అనుక్షణం భయం. ఇక లాభం లేదనుకొని ఇంట్లో చెప్పేశా. ఇంట్లో చాలా రోజులు నాతో ఎవరూ సరిగా మాట్లాడలేదు. వారికీ నాకు మధ్య దూరం పెరిగింది. కన్నవారు కదా.. కొన్ని రోజులకు నా వైపు నుంచి ఆలోచించారేమో.. కోపాన్ని దిగమింగుకుని అబ్బాయిని వచ్చి మాట్లాడమన్నారు. నాకైతే నన్ను అర్థం చేసుకున్న కుటుంబం.. కోరుకున్న ప్రియుడు దగ్గరవుతున్నాడనే ఆనందం మాటల్లో చెప్పలేను. తనను వచ్చి మాట్లాడమంటే.. మౌనం వహించాడు. ఆ వెనకడుగు ఉద్దేశం ఏంటో చెప్పడం లేదు. నాకంటే ముందే వాళ్ల ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పి, ఒప్పించిన అతను ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు. పెళ్లి విషయం వస్తే ఎందుకు దాటవేస్తున్నాడో తెలియడం లేదు. అడిగితే.. ‘మనిద్దరికీ కుదరదేమో! నేను నీకు తగనేమో!’ అని పిచ్చి ప్రశ్నలు. నాతో పంచుకోలేని సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే నాతో చెప్పడానికి తనెందుకు సంకోచిస్తున్నాడు. అయోమయం అంటే ఇదేనేమో!! దిక్కు తోచడం లేదు.

‘కృష్ణా... లాభనష్టాలు గురించే ఆలోచించే మనిషి కాదు నువ్వు. నిజం చెప్ఫు నువ్వు చెప్పే కారణం ఏదైనా నేను అర్థం చేసుకోగలను. మనసుని చంపుకోలేక మనిషిని చావలేక నరకయాతన అనుభవిస్తున్నా. నువ్వు లేని లైఫ్‌ని ఊహించలేకపోతున్నా. క్షణం యుగంలా గడుస్తోంది. ఒంటరిగా నేను వేసే అడుగుల్లో ఏదో తెలియని భయం. నీతో కలిసే నా జీవిత గమనం సాగాలనుకుంటున్నా. ఒక్కటి మాత్రం స్పష్టంగా చెబుతున్నా...

మన ప్రేమ కారణాలకు బలయ్యేంత అల్పమైంది కాదు. గుర్తుంచుకో!!

- అమ్ము


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని