తాళసే..తాళ్‌మిలా!

ఏడుగురు యువతరంగాలు.. అంతా పాతికేళ్లలోపు వాళ్లే. రాష్ట్రాలు వేరు.. నేపథ్యాలు భిన్నం.. ఆసక్తి వాళ్లందరినీ ఒక్కటి చేసింది... .

Published : 14 Dec 2019 00:36 IST

క్యాంపస్‌

ఏడుగురు యువతరంగాలు.. అంతా పాతికేళ్లలోపు వాళ్లే. రాష్ట్రాలు వేరు.. నేపథ్యాలు భిన్నం.. ఆసక్తి వాళ్లందరినీ ఒక్కటి చేసింది... గురువు గురుతర బాధ్యత అప్పజెప్పారు. వినూత్న ప్రాజెక్టు పట్టాలకెక్కింది. దాంట్లో భాగంగా సరదాలు కట్టిపెట్టి తాళపత్ర గ్రంథాలపై దృష్టి పెట్టారు. ఘనమైన వారసత్వ సంపదను భావితరాలకు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.

బీటెక్‌, కంప్యూటర్‌సైన్స్‌ విద్యార్థులంటే అమెరికా ఆశలుంటాయ్‌. లక్షల వేతనాల కలలుంటాయ్‌. సినిమాలు, సరదాలు, స్నేహితులతో ప్రతి క్షణాన్నీ ఎంజాయ్‌ చేయాలనే ఉత్సాహముంటుంది. కానీ హైదరాబాద్‌లోని ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్న ఈ కాలేజీ విద్యార్థులు అందరికంటే భిన్నం. నేపథ్యాలు విభిన్నమే. గుజరాతీ అభినవ్‌ వైశ్య కంప్యూటర్‌సైన్స్‌ విద్యార్థి. బీటెక్‌ థర్డియర్‌ కుర్రాడు అరోన్‌ అగస్టీన్‌ది కేరళ. మెదక్‌ అమ్మాయి సౌమ్య అయితా ఎం.ఎస్‌. చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌ అబ్బాయి అభిషేక్‌ త్రివేది చదువు కంప్యూటర్‌ సైన్స్‌. కృష్ణా జిల్లా అమ్మాయి నిహారిక వడ్లమూడిది ఈసీఈ మూడో ఏడాది. కడప సురేంద్రకుమార్‌ థర్డియర్‌ సీఎస్‌ఈ. పశ్చిమ బెంగాల్‌ కుర్రాడు అభిషేక్‌ పృష్టి ఈసీఈ నాలుగో సంవత్సరం. ఎక్కడెక్కడి వాళ్లో చదువులమ్మ ఒడికి చేరారు. వాళ్లందరికీ చరిత్ర అంటే మమకారం. ఆ ఆసక్తిని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సర్వదేవభట్ల రవికిరణ్‌ గుర్తించారు. తన కలల ప్రాజెక్టు తాళపత్ర గ్రంథాల రాతప్రతులను డిజిటలీకరణ చేసే సాఫ్ట్‌వేర్‌ తయారీలో భాగస్వాములను చేశారు. ఆ సత్సంకల్పంతోనే ‘హిందోళ’ మొదలైంది.

గురువు బాటలో..

రవికిరణ్‌ బీటెక్‌ తర్వాత అమెరికా వెళ్లి మాస్టర్స్‌ చేసి అక్కడే ఐదేళ్లు ఉద్యోగం చేశారు. తర్వాత పీహెచ్‌డీ చేయడానికి బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కి వచ్చారు. ఆ సమయంలోనే ఓ ప్రొఫెసర్‌ ‘తాళపత్ర గ్రంథాల్లోని విలువైన సమాచారాన్ని డిజిటలైజ్‌ చేయటానికి సాఫ్ట్‌వేర్‌ తయారు చేయొచ్చు కదా’ అని రవికిరణ్‌కి సలహా ఇచ్చారు. 2018లో ఐఐఐటీలో అధ్యాపకుడిగా చేరగానే రవికిరణ్‌ దీనిపై కసరత్తు ప్రారంభించారు. యోగా, వైద్యశాస్త్రం, న్యాయశాస్త్రం, నాట్యం, పాక శాస్త్రం, తర్కం.. వీటిపై మన పూర్వీకులు లక్షలసంఖ్యలో తాళపత్ర గ్రంథాలు రాశారు. అందులో కొన్నింటిని అట్టపెట్టల్లో భద్రపరిచారు. చాలావరకు కనిపించకుండా పోయాయి. ఇంకొన్ని దేశం దాటి అమెరికా, యూరప్‌ చేరాయి. ఆ దేశస్థులు వాటిపై పేటెంట్‌ కూడా తీసుకున్నారు. దేశంలో దొరికిన వాటిని నేషనల్‌ మ్యాన్యుస్క్రిప్ట్‌ మిషన్‌ (కృతి సంపద) పేరుతో ప్రభుత్వం సేకరించి భద్రపరుస్తోంది కానీ వాటికి పబ్లిక్‌ యాక్సెస్‌ లేదు. తిరుపతి ఓరియంటెల్‌ లైబ్రరీలాంటి కొన్ని గ్రంథాలయాల్లో తాళపత్రాలను సేకరించి అందులోని జ్ఞాన సారాన్నంతా చదివి, డిజిటలైజేషన్‌ చేసి అక్షరం పొల్లుపోకుండా అందరికీ అందుబాటులోకి తేవడమే ఈ ‘హిందోళ’ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకున్నారు రవికిరణ్‌. దీనికోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ తయారు చేయాలనుకున్నారాయన. అయితే ఇదంతా చేయడం ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు. ప్రాజెక్ట్‌ వర్క్‌లో భాగంగా ప్రతిభ, ఆసక్తి ఉన్న ఈ ఏడుగురు యువతరంగాలను భాగస్వాములను చేశారు.

సరదాలు వదిలి

ఖాళీ దొరికితే ధ్యాసంతా ప్రాజెక్టుపైనే పెడుతున్నారు. తాళపత్ర గ్రంథాలు చాలావరకు పాడైపోయి ఉంటాయి.అక్షరాలు చదవడానికి వీలుగా ఉండవు. రాత వరుసలు అడ్డదిడ్డంగా, అక్షరాల మధ్యలో రంధ్రాలుంటాయి. సమాచారం కనిపించదు. కొన్నిచోట్ల బొమ్మలుంటాయి. ప్రింటెడ్‌ డాక్యుమెంట్స్‌తో పోలిస్తే వీటిని చదవటం కష్టం. ఇన్ని అడ్డంకులున్నా ఏ ఒక్క అక్షరాన్నీ వదలకుండా డిజిటలైజ్‌ చేసేలా సాఫ్ట్‌వేర్‌ తయారు చేస్తున్నారు. ఫొటోల రూపంలో ఉండే అక్షరాలను గుర్తించడానికి ఆప్టికల్‌ క్యారెక్టర్‌ రికగ్నైజేషన్‌ టూల్స్‌ తయారు చేశారు. కోడింగ్‌ రాశారు. దీంతోపాటు కృత్రిమ మేధ, క్యారెక్టర్‌ లైన్‌ సెగ్మెంట్‌ మిషన్‌ లెర్నింగ్‌ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇలా గురువు నిర్వహణలో పనిని విభజించుకొని ముందుకెళ్తున్నారు.

అదే మా కల

నా కంటే ముందు తాళపత్ర గ్రంథాలకోసం చాలామంది పనిచేశారు. సాఫ్ట్‌వేర్‌ ద్వారా వీటిని భద్రపరచొచ్చనీ, జనంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందనీ చెప్పినవాళ్లే ఎక్కువకానీ ఆ దిశగా జరిగిన ప్రయత్నం తక్కువ. మా పరిశోధన పూర్తై, సంకల్పం నెరవేరి, సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి వస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. జనానికి ఉపయోగపడే విలువైన సమాచారాన్ని ఒక్క క్లిక్‌తో ఇంటర్నెట్‌లో చూసుకోవచ్ఛు ఈ సాంకేతిక పరిజ్ఞానంతో రాళ్లమీద ఉండే శాసనాలనూ చదవొచ్ఛు ఈ దిశగా మేం చేయవలసింది చాలా ఉంది. తాళపత్ర గ్రంథాలు చదవగలిగేవాళ్లు, దీనిపై కృషి చేస్తున్నవాళ్లు మాకు సహకరించి మాతో చేతులు కలిపితే మాకెంతో సంతోషం. మేం నేర్చుకున్న విద్య దేశానికి ఉపయోగపడాలన్నదే మా అభిమతం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని