నెట్‌ఫ్లిక్స్‌కు ప్రియతమ గీతలు

ఫ్రెండు బొమ్మలేస్తుంటే కళ్లప్పగించి చూసేవాడు..అద్భుతం అనుకునేవాడు.. తీసుకెళ్లి ఇంట్లో చూపించేవాడు..‘నువ్వూ గీయరా’ అని వాళ్ల అమ్మ అనే వరకు తనకీ తెలీదు.. తనలో ఓ గీతకారుడు ఉన్నాడని!

Published : 21 Dec 2019 01:12 IST

ఆర్ట్‌ఎటాక్‌

ఫ్రెండు బొమ్మలేస్తుంటే కళ్లప్పగించి చూసేవాడు..అద్భుతం అనుకునేవాడు.. తీసుకెళ్లి ఇంట్లో చూపించేవాడు..‘నువ్వూ గీయరా’ అని వాళ్ల అమ్మ అనే వరకు తనకీ తెలీదు.. తనలో ఓ గీతకారుడు ఉన్నాడని!
అది మొదలు.. ఆ గీతలే తన ప్రపంచం అయ్యాయి.. కెరీర్‌కి దారి చూపాయి..
ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో పని చేసే స్థాయికి తీసుకెళ్లాయి..
మొత్తం 16 దేశాల నుంచి ఆర్టిస్ట్‌లని ఎంపిక చేస్తే.. మన దేశం నుంచి ఎంపికైంది అతనొక్కడే..
పేరు శ్రీ ప్రియతమ్‌. సోషల్‌ మీడియా వేదికగా సాగిన తన జర్నీని ‘ఈతరం’తో పంచుకున్నాడిలా..
పుట్టి పెరిగింది.. చదువు.. అంతా హైదరాబాద్‌లోనే. నాన్న ట్యాక్స్‌ కన్సల్టెంట్‌. అమ్మ గృహిణి. చిన్నప్పుడు పుస్తకాలు తెరిస్తే చాలు. అంకెలు అటు ఇటు నాట్యం చేసేవి. అక్షరాల్ని చూస్తే అయోమయమే. కానీ, నా ఫ్రెండు వేసే బొమ్మలు మాత్రం భలే నచ్చేవి. వాడేసిన బొమ్మలు ఇంటికి తీసుకెళ్లేవాడిని. అమ్మకి చూపిస్తే.. ‘నువ్వు కూడా వేయొచ్చుగా...’ అంది. అప్పటివరకూ నాకు గీయాలనే ఆలోచనే లేదు. ఐదారేళ్ల ప్రాయంలో నాకు గీతలతో తొలిసారి పరిచయం అయ్యింది. అది మొదలు ఆపింది లేదు. నాకు ఆర్ట్‌ని పరిచయం చేసిన నా ఫ్రెండు మాత్రం ఎప్పుడో వదిలేశాడు. నేను వాటినే కెరీర్‌గా మలుచుకుని ఫ్రీలాన్సర్‌గా ఎదుగుతున్నా.


ఫేస్‌బుక్‌.. నాకో ఆర్ట్‌బుక్‌

ఎప్పుడూ నా ఆలోచనలన్నీ కార్టూన్‌ నెట్‌వర్క్‌, వార్నర్‌ బద్రర్స్‌ నుంచి పుట్టే క్యారెక్టర్ల చుట్టూనే తిరిగేవి. అంతర్జాతీయ స్థాయిలో నేను ఎదగాలంటే.. నాకున్న నెట్‌వర్క్‌ ఏంటి? నేను ఎవరికి తెలుసు? నాకున్న పరిధుల్ని ఎలా చెరిపేయాలి?.. ఇలా నాలోని అన్వేషణకు సోషల్‌ మీడియా వేదికయ్యింది. ఆర్కుట్‌తో మొదలు పెడితే.. ఫేస్‌బుక్‌ నా ముఖాన్ని కళాత్మక లోకానికి తీసుకెళ్లింది. రోజూ విధిగా కొన్ని బొమ్మలు గీసి ఎఫ్‌బీలో అప్‌లోడ్‌ చేసేవాడిని. వాటికి స్పందన బాగుండేది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్టిస్టుల్ని ఫాలో అయ్యేవాడిని. వారు గీసే స్కెచ్‌లను అనుకరిస్తూ నాదైన ప్రత్యేకతని జోడించేవాడిని. దీంతో నాకు గ్లోబల్‌గా ఓ ఆర్ట్‌ కమ్యూనిటీనే దొరికింది. నెట్టింట్లో అందుబాటులో ఉన్న మరెన్నో ఆర్ట్‌ సోర్సుల్ని ఫాలో అయ్యేవాడిని. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఫేస్‌బుక్‌ నాకో ఆర్ట్‌ బుక్‌. అదే నా క్లైంట్‌సోర్స్‌.


మెయిల్‌ వచ్చింది..

వీడియో స్ట్రీమింగ్‌ అంటే ప్రపంచవ్యాప్తంగా ముందు గుర్తొచ్చేది నెట్‌ఫ్లిక్స్‌. అంత పేరున్న సంస్థ నేను వేసే బొమ్మలు చూసి నన్ను కాంటాక్ట్‌ అయ్యింది. అందుకు కారణం ఇన్‌స్టాగ్రామ్‌. ఇప్పుడు నేను చురుకుగా ఉంటున్న సోషల్‌ మీడియా మాధ్యమం ద్వారానే నా గీతలు నెట్‌ఫ్లిక్స్‌ వరకూ చేరాయి. ‘స్ట్రేంజర్‌ థింగ్స్‌’ వెబ్‌ సిరీస్‌  సీజన్‌ 3 ప్రమోషన్‌లో భాగంగా ఆర్ట్‌ వర్క్‌ కావాలని ఓ రోజు నెట్‌ఫ్లిక్స్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. నేను నమ్మలేకపోయా. వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2లోని 16 ఎపిసోడ్‌లకు ప్రపంచ వ్యాప్తంగా 16 దేశాల నుంచి ఒక్కొక్కర్ని ఎంపిక చేశారు. వారిలో మన దేశం నుంచి నేను ఎంపికయ్యా. సిరీస్‌లో నాకు ఇచ్చిన ఎపిసోడ్‌ ‘డిగ్‌ డగ్‌’ ఆధారంగా నేను గీసిన బొమ్మ వారినెంతో ఆకట్టుకుంది. గంటన్నర పాటు సాగే ఎపిసోడ్‌లోని ఆసక్తికరమైన అంశాన్ని చూపిస్తూ బొమ్మ గీయడాన్ని నేనో ఛాలెంజ్‌లా స్వీకరించా. స్వతహాగా నేనూ స్ట్రేంజర్‌ థింగ్స్‌ వెబ్‌ సిరీస్‌కి అభిమానినే. దాంతో నా పని కాస్తా సులువైంది.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని