నాలా ఉండొద్దు..

అమ్మానాన్నలకు నేనొక్కడినే సంతానం. పెళ్లయిన ఏడేళ్లకు, ఎంతోమంది దేవుళ్లకు మొక్కుకున్న తర్వాత పుట్టానట. అందుకే ఎంతో అపురూపంగా పెంచారు. నా ప్రతి పుట్టినరోజునూ ఒక వేడుకలా చేసేవారు. ఇది ఇలాగే చెయ్యి, అది అలాగే చెయ్యి అని ఎలాంటి ఆంక్షలూ పెట్టేవాళ్లు కాదు....

Published : 21 Dec 2019 01:12 IST

అమ్మానాన్నలకు నేనొక్కడినే సంతానం. పెళ్లయిన ఏడేళ్లకు, ఎంతోమంది దేవుళ్లకు మొక్కుకున్న తర్వాత పుట్టానట. అందుకే ఎంతో అపురూపంగా పెంచారు. నా ప్రతి పుట్టినరోజునూ ఒక వేడుకలా చేసేవారు. ఇది ఇలాగే చెయ్యి, అది అలాగే చెయ్యి అని ఎలాంటి ఆంక్షలూ పెట్టేవాళ్లు కాదు. చదువు విషయంలోనూ ఎప్పుడూ కఠినంగా వ్యవహరించలేదు. అతి కష్టం మీద పాస్‌ మార్కులు తెచ్చుకునేవాడిని. మా స్నేహితులను వాళ్ల తల్లిదండ్రులు ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకోమని ఎప్పుడూ తిడుతూనే ఉండేవాళ్లు. మావాళ్లు మాత్రం నాపై ఎప్పుడూ ఒత్తిడి పెట్టలేదు. చదువు పేరుతో పిల్లల్ని బాధపెట్టడం ఇద్దరికీ ఇష్టముండేది కాదు. ఒకవేళ ఫెయిల్‌ అయినా ఇంట్లోంచి పారిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేయొద్దని చెప్పేవాళ్లు. అంటే చదువు కంటే నేనే వాళ్లకు ఎక్కువన్నమాట. ఎప్పుడో ఏడాదికోసారి జ్వరం వచ్చినా అమ్మ రాత్రంతా నా పక్కనే కూర్చుని జాగారం చేసేది. కంటికి రెప్పలా చూసుకునేది.
డిగ్రీలోకి వచ్చాక నా ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అమ్మానాన్నల మంచితనం చేతకానితనంలా కనిపించేది. స్పోర్ట్స్‌ బైక్‌ కొనివ్వకపోతే అసలు కాలేజీకే వెళ్లనని మారాం చేశాను. రెండున్నర లక్షలు ఖర్చుపెట్టి మరీ బైక్‌ కొనిచ్చారు. అలాగని నాన్నేమీ పెద్ద ఉద్యోగస్తుడు కాదు. అప్పు చేసి మరీ బైక్‌ కొనిచ్చారు. నా సంతోషం కోసం వేలు, లక్షలు ఖర్చుపెట్టడానికి ఏమాత్రం వెనకాడేవాళ్లు కాదు. రోజూ వేసుకునే డ్రెస్‌ల విషయంలోనూ రాజీపడేవాడిని కాదు. అయిదారు వేల విలువైన డ్రెస్‌ కొనేవాడిని. ఒకసారి నా బైక్‌ తగిలి ఒకబ్బాయి కిందపడ్డాడు. ఇద్దరం బాగా గొడవపడుతున్నాం. ఈలోగా ఆ అబ్బాయివాళ్ల అన్న వచ్చి నా తల మీద కర్రతో బలంగా కొట్టాడు. రక్తం ధారగా కారుతుంటే స్పృహ తప్పి పడిపోయాను. కళ్లు తెరిచి చూసేసరికి హాస్పిటల్‌ బెడ్‌ మీద ఒక కంటికి బ్యాండేజ్‌తో ఉన్నాను. తలకి బలంగా దెబ్బలు తగలడంతో ఆప్టిక్‌ నరాలు చిట్లిపోయి.. ఒక కన్ను పనిచేయడంలేదన్నారు వైద్యులు. ఇక శాశ్వతంగా పనిచేయదన్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ కంటి హాస్పిటళ్లన్నింటిలోనూ చూపించినా అదే మాట చెప్పారు. నిజానికి నేను దురుసుగా ప్రవర్తించడం వల్లే ఈ గొడవంతా జరిగింది. చిన్నతనం నుంచీ నా మాటే నెగ్గాలనే మొండితనంతో పెరిగాను. ఆ మొండితనం వల్లే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తింది. ఇక నుంచి జీవితాంతం ఒంటికన్నుతో బతకాల్సిందేగా. అమ్మానాన్నలు ఎంతో అపురూపంగా పెంచితే వాళ్లకు నేను తిరిగిచ్చింది ఏమిటి? ఇవన్నీ ఆలోచిస్తుంటే నేనింతవరకూ ఎంత మూర్ఖంగా ఆలోచించానో... ఎన్ని విధాలుగా వాళ్లను బాధలు పెట్టానో అర్థమవుతోంది. నా గురించి అమ్మ బాగా బెంగపెట్టుకుని కంటిచూపు రావాలని కోటి దేవుళ్లకు మొక్కుతోంది. నాన్నేమో నా రిపోర్ట్‌లన్నీ తీసుకుని హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎవరు ఏ హాస్పిటల్‌ గురించి చెప్పినా అక్కడికి వెళ్లి రిపోర్టులు చూపిస్తున్నారు.
వాళ్లు నన్నెంతగా ప్రేమిస్తున్నారో ఆలోచిస్తుంటే కన్నీరు ఆగడం లేదు. వాళ్ల రుణం ఎలా తీర్చుకోవాలో అర్థంకావడం లేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... నాలాగే తమ స్వార్థం మాత్రమే చూసుకుంటూ అమ్మానాన్నల మంచి మనసును అర్థంచేసుకోలేని కొడుకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్లంతా తల్లిదండ్రుల నిస్వార్థమైన ప్రేమను గురించి ఒక్క క్షణమైనా ఆలోచిస్తారని...    

- నాని


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని