ఎందుకే ఇలా..గుండె లోపల!

‘ఎందుకే ఇలా.. వింత మంట రేపుతావు.. అందని కలా...’ ఇంట్లో కూర్చుని ఈ పాట వింటున్నా...

Published : 28 Dec 2019 00:15 IST

‘ఎందుకే ఇలా.. వింత మంట రేపుతావు.. అందని కలా...’ ఇంట్లో కూర్చుని ఈ పాట వింటున్నా.. మా అమ్మతో పాటు మా ఇంట్లోకి వచ్చావు. నిన్ను చూడగానే నా కళ్లు విప్పారాయి. అప్పుడే ఊరు నుంచి వచ్చిన అమ్మను.. ప్రయాణ సంగతులు అడగకుండా.. ‘అమ్మా.. ఎవరీ అమ్మాయి’ అని అడిగా. మా అమ్మ నాలో ఆత్రాన్ని గమనించి చిన్నగా నవ్వుకుంది. నిన్ను నాకు పరిచయం చేసింది. నువ్వు నా బంధువని.. వరుసకు మరదలని..! ఆ క్షణం నన్ను నేను తిట్టుకున్నాను.. నా సోల్‌మేట్‌ను ఇంత ఆలస్యంగా చూసినందుకు..! నేను ఫిక్స్‌ అయ్యా సరే.. ఆమె మనసులో ఏముంది.. నేను నచ్చుతానా..? ఆమె అసలు నాతో మాట్లాడుతుందా?.. ఇలా అనుమానాలన్నీ కట్టకట్టుకుని నన్ను చుట్టుముట్టాయి. కానీ మరుసటి రోజే మా మధ్య మాటలు మొదలయ్యాయి. ముందు మాట కలిపింది తనే. ‘ప్లీజ్‌.. ఈ రోజు కాలేజీకి డుమ్మా కొట్టేయవా.. నాకు బోర్‌గా ఉంటుంది.. నా కోసం ప్లీజ్‌’ అని బతిమాలింది. ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి అనుకున్నా.. ఆ రోజు చాలా మాట్లాడుకున్నాం.. ఎన్నో పంచుకున్నాం. పనిలో పనిగా ఫోన్‌నంబర్లు మార్చుకున్నాం.

తను వాళ్ల ఊరుకు వెళ్లిపోయింది. ఇక ఫోన్‌లోనే మాటలు. ఓ రోజు ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగి షాకిచ్చింది! ‘ఏయ్‌! జోక్‌ చేయకు. ఆర్‌ యూ సీరియస్‌?’ అన్నా! జోక్‌ కాదెహే.. చేసుకుంటావా.. చేసుకోవా? చెప్ఫు నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. నువ్వు నాకు నచ్చావ్‌ అని చెప్పింది. ఏంటి ఇవన్నీ నేను చెప్పాలనుకున్నా కదా.. ఇప్పుడు ఆమె చెబుతోంది. ఆనందంలో ఎగిరి గంతేశా? నేను కూడా ఓకే చెప్ఫా కానీ మేం మీకంటే అన్ని విధాల తక్కువ. మీ పేరెంట్స్‌ ఒప్పుకుంటారా? అని అడిగా. ‘ మొద్ధూ. నువ్వంటే నాకు ఇష్టమని.. నీకంటే ముందు మా అమ్మానాన్నలకే చెప్ఫా మీ అమ్మకు నువ్వే చెప్పుకోవాలి’ అంది. నేను నమ్మలేకపోయా.. నేనూ మా అమ్మకు విషయం చెప్ఫా అమ్మ మొహంలో ఆనందంతో పాటు భయమూ.. ఏంటని అడిగితే.. ‘ముందు ఆమె అమ్మానాన్నలను కనుక్కొందాం. మన కంటే వాళ్లు అన్ని విషయాల్లోనూ స్థితిమంతులు. ఇప్పుడే తొందరపడకురా.’ అంది. అవును అమ్మ చెప్పినదాంట్లోనూ అర్థముంది కదా.. అనుకున్నా.. ఓ రోజు వెళ్లి మాట్లాడాం. ‘మా కూతురి మాటే.. మా మాట.. మీ ఆస్తిపాస్తులతో మాకు పని లేదు. నీ ఉద్యోగంతో మాకు పనిలేదు. మీ ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు. అయినా ఏం ఫర్వాలేదు. కానీ ఓ చిన్న షరతు’ అన్నారు. ‘నువ్వు ఇల్లరికం రావాలని!.’ అనే సరికి మెదడు మొద్దుబారిపోయింది. ఆమె వైపు చూశా. ‘అవును అంది’. అమ్మ వైపు చూశా.. ‘ఒప్పుకోరా’ అంది.

నేను ఒప్పుకోవాలంటే.. మా అమ్మా నాతో పాటే ఉండాలన్నా. వాళ్లు కుదరదు అన్నారు. కావాలంటే నెలకోసారి అమ్మ దగ్గరికి వెళ్లిరా బాబు. పెద్ద దూరం ఏం కాదుగా.. ఓ వంద కిలోమీటర్ల ప్రయాణం మీ ఊరికీ.. మా ఊరికీ.. అంతేగా! అన్నారు. అంతేనా.. నిజంగా అంతేనా.. కేవలం వందకిలోమీటర్లేనా! మీ ఒక్కగాని ఒక్క కూతురు మీ కళ్ల ముందు ఉండాలని మీరు కోరుకుంటున్నారు తప్పులేదు. మరి నన్ను కంటికి రెప్పలా కాచుకొన్న మా అమ్మ తన వృద్ధాప్యంలో నా కళ్ల ముందు ఉండకూడదా? నాకు దూరంగా ఒంటరిగా.. బతకాలా? ... బాగా ఆలోచించా. ‘సారీ.. అండి.. నేను మా అమ్మకు దూరంగా బతకలేను. మా అమ్మ నాతో పాటే వస్తుంది. లేకుంటే మీ అమ్మాయినే నాతో పంపండి’ అన్నా.. ఆమె ఏడ్చింది. నువ్వు లేకుండా నేను ఉండలేను. మా అమ్మానాన్న లేకుంటే అంతకంటే ఉండలేను. నేనూ అదే చెప్ఫా. ‘నువ్వు లేకుండా నేను ఉండలేను. మా అమ్మ లేకున్నా.. అంతకన్నా ఉండలేను’.. అందుకే మా అమ్మను మనతో పాటు ఉండనివ్వు అన్నా.. ఆమె ఒప్పుకోలేదు. అంతే వాళ్ల నాన్న అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. నువ్వెంత.. నీ బతుకెంత.. కోరి వరం ఇస్తానంటే.. కాలదన్నుకుంటున్నావ్‌.. అన్నాడు. ‘ఒరేయ్‌.. నా మాట వినరా.. మంచి సంబంధం. ఒప్పుకోరా’ అంది అమ్మ. ఆమెను మరోసారి అడిగా.. ఆమె నిర్ణయంలో మార్పులేదు. వాళ్ల నాన్న బయటకు దారి చూపాడు.. వెళ్లిపోతావా.. గెంటమంటావా? అన్నాడు.

ఆస్తిపాస్తులు లేకున్నా.. ఆత్మగౌరవం ఉన్నవాణ్ని.. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయా. అమ్మను తీసుకుని బయట అడుగుపెట్టాను. తర్వాత ఓ వారం రోజులకు తనకు ఫోన్‌ చేశా తీయలేదు. ఓ రెండు రోజులు ఆగి మళ్లీ చేశా తీయలేదు. ఓ నెల రోజుల తర్వాత మా ఇంటికి తన పెళ్లిపత్రిక పోస్టులో వచ్చింది. ‘హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌’ అని వాట్సాప్‌ చేశా. అంతే... అదే ఆమెకు నా ఆఖరి సందేశం.

- దయాసాగర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని