నా అవగాహన విలువకోటిన్నర!!

‘అమ్మా, నాన్నల పోరుతోనో.. ఉపాధ్యాయులు ఒత్తిడి పెడితేనో.. రోజూ పాఠాలు బట్టి పడితేనో...

Published : 28 Dec 2019 00:19 IST

ప్రేరణ

‘అమ్మా, నాన్నల పోరుతోనో.. ఉపాధ్యాయులు ఒత్తిడి పెడితేనో.. రోజూ పాఠాలు బట్టి పడితేనో.. ర్యాంకుల కోసం ఆరాటపడితేనో.. నాకు ఈ ప్లేస్‌మెంట్‌ దక్కలేదు!! (మైక్రోసాఫ్ట్‌ కంపెనీ నుంచి వార్షిక ప్యాకేజీ రూ.కోటిన్నర) కేవలం అవగాహనతోనే సాధించా..’ అంటున్నాడు.. చింతరెడ్డి సాయిచరిత్‌రెడ్ఢి ఇది కేవలం నా తొలి విజయం.. ఇప్పుడే నా ప్రయాణం మొదలయ్యింది.. అంటూ తన సక్సెస్‌ ఫార్ములాని ఈతరంతో పంచుకున్నాడిలా..

‘మాది నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ధర్మాపురం. నాన్న చింతరెడ్డి సైదిరెడ్ఢి చదివింది బీటెక్‌ అయినా.. వ్యవసాయంపై ఇష్టంతో రైతుగా స్థిరపడ్డారు. అమ్మ గృహిణి. ఇంటర్‌ తర్వాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 51వ ర్యాంకు సంపాదించటంతో ఐఐటీ బొంబాయిలో సీటు వచ్చింది. 8వ సెమిస్టర్‌ ముగుస్తుండగానే మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఆఫర్‌ లెటర్‌ ఇచ్చింది. ఐఐటీ బొంబాయి నుంచి ఎంపిక చేసిన ముగ్గురిలో నేను ఒకడిని. అదీ తెలుగువాడిని.

నిరంతరం విశ్లేషణ

చిన్నప్పటి నుంచీ పాఠ్యాంశాల్ని బట్టీ పట్టడం రాదు. అర్థం చేసుకోవడంపైనే దృష్టి పెట్టేవాడిని. దీంతో పాఠ్యాంశాలపై అవగాహన, ఆసక్తి పెరగడం మొదలయ్యింది. ఏవైనా సందేహాలుంటే అధ్యాపకులతో చర్చించేవాడిని. చదువు పెరుగుతున్న కొద్దీ నా ఆలోచనలన్నీ విశ్లేషణాత్మక ధోరణిలో సాగేవి. బహుశా ఆ దృక్పథమే మైక్రోసాఫ్ట్‌ని మెప్పించడంలో కీలకం అని నేను నమ్ముతున్నా. ఎనిమిదో తరగతి చదువుతుండగా నేషనల్‌ లెవెల్‌ టాలెంట్‌ టెస్టు రాసి ఉపకారవేతనానికి అర్హత సాధించాను. అదే సంవత్సరంలో ఫిట్జీ సామర్థ్య రివార్డు పరీక్ష రాసి టాపర్‌గా నిలిచాను. ఉచిత విద్యతో పాటు ఆ పాఠశాల యాజమాన్యం ఉపకార వేతనాలు అందించింది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో కిషోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన (కె.వి.పి.వై.) అర్హత సాధించా. ఐఐటీ బొంబాయిలో సీటు సంపాదించాక ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు ఫిట్జీ స్కూల్‌ యాజమాన్యం నా ప్రతిభను గుర్తించి రూ.5 లక్షలు ప్రోత్సాహక బహుమతి ఇచ్చింది.

అధ్యాపకుల ప్రోత్సాహం..

విద్యార్థిగా నా ప్రయాణంలో కీలకపాత్ర నాకు బోధించిన అధ్యాపకులదే. ఐఐటీ బొంబాయిలోనూ అధ్యాపకులూ నా ఆసక్తులకు ఎంతో తోడ్పాటు అందించారు. వారి సలహాలు,సూచనలు వెలకట్టలేనివి. ఐఐటీ బొంబాయిలో నాతో చదువుతున్న మరో పది మందిని మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేసింది. ఒక్కొక్కరికి రూ.80 వేల స్టైఫండ్‌. ఇంటర్న్‌షిప్‌ తర్వాత ముగ్గురిని మాత్రం వార్షిక వేతనంతో ఎంపిక చేసింది. వారిలో ఒకరు తమిళనాడుకి చెందిన అనిరుధ్‌. ఇంకొకరు ఆర్యన్‌. అతనిది బీహార్‌. తెలుగు రాష్ట్రాల నుంచి నేను.

- వద్దిరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, గుర్రంపోడు

ఇవే ఫాలో అయ్యా..

ల్లిదండ్రులు పిల్లల నుంచి ఎంతో ఆశిస్తారు. అదేం తప్పు కాదుగానీ.. పిల్లల ఇష్టాలకు అనుగుణంగా వారి ఆశయాలు మారాలి. అప్పుడే పిల్లలు వారికి ఇష్టమైన అంశంపై పూర్తిగా అవగాహనతో చదవటం ప్రారంభిస్తారు. విద్యార్థి దశలో విషయ అవగాహన చేసుకునేందుకు అధ్యాపకులు, నిపుణులతో చర్చించాలి. అప్పుడు మనకు కాన్సెప్ట్‌పై పూర్తి పట్టు వస్తుంది. మార్కుల మీద కాకుండా సబ్జెక్టుపై లోతైన అవగాహన కలిగి ఉండేందుకు ప్రయత్నించాలి. ఏదో చదివామంటే చదివినట్లు కాకుండా పూర్తిగా మనసును కేంద్రీకృతం చేసి అవగాహన పెంచుకోవాలి. ఏ రోజు చదవాల్సింది ఆ రోజే చదవాలి. సమయం వృథా చేయొద్ధు వెనుకంజ వేయొద్ధు ఎట్టి పరిస్థితుల్లోనూ చదవటం వాయిదా వేయొద్ధు అప్పుడే అధ్యాపకుల దృష్టి కూడా మనపై ఉండి కావాల్సినంత ప్రోత్సాహం దొరుకుతుంది. చాలా సందర్భాల్లో అధ్యాపకుల సహకారం ఎంతో అవసరం. వారి మన్నన తప్పకుండా కలిగి ఉండాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని