కలుసుకోవాలని..కలిసి ఉండాలని..

రెండేళ్లు.. రెప్పలు కలిసి విడిపోయినంత వేగంగా గడిచిపోయాయి. నా కళ్లు మాత్రం వీడివెళ్లిన తన రూపాన్నే తలుచుకుంటున్నాయి.. ఎప్పటికైనా చూస్తాననే ఆశతో.. తనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు..

Published : 04 Jan 2020 01:01 IST

రెండేళ్లు.. రెప్పలు కలిసి విడిపోయినంత వేగంగా గడిచిపోయాయి. నా కళ్లు మాత్రం వీడివెళ్లిన తన రూపాన్నే తలుచుకుంటున్నాయి.. ఎప్పటికైనా చూస్తాననే ఆశతో.. తనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు..
ఈస్టర్‌ పండక్కి మా సొంతూరు వెళ్లాను. పక్క ఊళ్లోనే అత్తమ్మ వాళ్లు ఉంటారు వెళ్లి తీసుకురమ్మన్నాడు మా బాబాయ్‌. అత్తకో కూతురు ఉందన్న విషయం చెప్పలేదు. తను నా బండి ఎక్కుతుందని ఊహించలేదు. కానీ, జరిగిందదే. ఏం మాయ చేశావేలో జెస్సీ మాదిరి తనవన్నీ పొడిపొడి మాటలే. కానీ, నాకు మాత్రం పెదాలు పలికే మాటల కంటే.. కళ్లు చెబుతున్న ఊసులే ఎక్కువగా వినిపించాయి. మొదటి పరిచయం చిన్నదే అయినా.. నాలో పుట్టిన ప్రేమ ఫీలింగ్‌ మాత్రం అనిర్వచనీయం.. తర్వాత నెలరోజులకి మా బంధువుల పెళ్లిలో మళ్లీ కలిశాం. మొదటిసారి నేను చూసిన జెస్సీనే. కానీ, సంప్రదాయ సింగారంలో బంగారంలా మెరిసింది. చిన్నగా నవ్వాను. తనూ బదులిస్తున్నట్లు కళ్లతో నవ్వింది. పైగా మేముంది పెళ్లిలో.. చుట్టపట్టాల మధ్యలో. అటు ఇటు తిరుగుతూ.. ఇటా.. అటా.. అనుకుంటూ.. ఇద్దరం పెళ్లి పందిట్లో డోలు, సన్నాయిల్లా ఒకటే సందడి చేశాం. మళ్లీ చిన్న గ్యాప్‌. దానికి ఉపశమనంగా వాళ్లూరి ఓ ఫంక్షన్‌కి వెళ్లా. అక్కడికి దగ్గరే తన ఇల్లు కూడా. తనూ వచ్చింది. ముచ్చటగా మూడో సారి అనుకుందో ఏమో. మాట కలిపింది. ఫంక్షన్‌ తర్వాత వాళ్లింటికి తీసుకెళ్లింది. చుట్టాలే కదా.. నేనూ చనువుతో దూసుకెళ్లా. తను కలిపిచ్చిన కాఫీతో వచ్చిన కాన్ఫిడెన్స్‌ అనుకుంటా.. తాగుతూనే నా మనసులో మాట చెప్పేశా. తనూ సింపుల్‌గా నాక్కూడా నువ్వంటే ఇష్టం అంది. అలా కప్పు కాఫీ.. వన్‌సైడ్‌ లవర్‌ని కాస్త.. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌గా మార్చేసింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విడిపోకూడదని ప్రమాణం చేసుకున్నాం.
తర్వాతి నుంచి ఫోన్‌ కాల్స్‌. ఆ గొంతులోని మాధుర్యం నన్ను నిండా తేనెలవర్షంలో ముంచేసేది. తనని చూడకుండా ఉండటం ఇక నా వల్ల అయ్యేది కాదు. తనదీ అదే ఫిలింగ్‌. కానీ, బయటపడేది కాదు. నేనైతే ఉండలేక మూడు గంటల ప్రయాణాన్ని మూడు నిమిషాల్లా అనుకుని.. ఎప్పుడంటే అప్పుడు వాలిపోయేవాడిని.. తన కాలేజీ గేటే నా డెలివరీ అడ్రస్‌. మాట్లాడేది కేవలం అయిదు నిమిషాలే. తన రూపాన్ని, కొన్ని మాటల్ని గుండెనిండా నింపుకొని తిరుగు ప్రయాణం. బస్సు కిటికీనే నా కలల స్క్రీన్‌ అయ్యేది. బస్సు వేగం కంటే.. నా ఊహల వేగమే ఎక్కువ. అందుకే ఎప్పుడూ ప్రయాణం అలసటగా అనిపించేదికాదు. వస్తూ వెళ్తూ మా ప్రేమ పుస్తకంలో ఎన్నో మధురానుభూతుల్ని రాసుకున్నాం. తను కాస్త ధైర్యం చేసి వాళ్లింటికి తీసుకెళ్లడం చేసేది. తన పుట్టిన రోజున వాళ్లింట్లోనే తనతో ఎక్కువ సమయం గడపడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒక రోజు అలాగే కాలేజీ అయిపోయాక ఇంటికి వెళ్లాం. నేనంటే నీకు నిజంగా ఇష్టమా అనే సరికి ‘నువ్వు ఇంతగా అడగాల్సిన పనిలేదురా మొద్దు. నేనెప్పుడో నీదాన్ని అయిపోయా. నీ వేలు పట్టుకుని, నీ అడుగులో అడుగేసే క్షణం కోసం వేచి చూస్తున్నా’ అనేసరికి నాకు గాల్లో ఎగిరి చందమామని అందుకున్నంత ఆనందమేసింది. మా ఇద్దరి చనువు వాళ్లకి బాగా కావాల్సిన వ్యక్తికి నచ్చేది కాదు. ఓ సందర్భంలో నేను ఆ వ్యక్తితో కొంచెం ఘాటుగా ప్రవర్తించాల్సి వచ్చింది. మా ప్రేమ కోసం..
వీలైనంత తొందరగా తనతో ఏడడుగులు వేయాలనే లక్ష్యంతో ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చాను. పని ఒత్తిడిలో పడి ఒక్కోసారి మాట్లాడటం కుదిరేది కాదు. అయినా తన ప్రేమలో ఎలాంటి మార్పు లేదు. మేమిద్దరం ఫోన్‌ల్లో మాట్లాడుకోవడం.. మా చనువు చూసి వాళ్ల అమ్మకి సందేహం వచ్చింది. మాట్లాడొద్దని హెచ్చరించింది. తను చేసుకుంటే నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది. నేను నేరుగా వెళ్లి వాళ్లమ్మతో మాట్లాడా.. మేం జీవితాంతం ఆనందంగా ఉండగలమనే భరోసా వాళ్లమ్మ వాళ్లకి కల్పించా. దాంతో ఆమె అంగీకరించారు. ఇక అంత సాఫీగా సాగిపోతుందనుకున్నా. కానీ, నేనెప్పుడో మర్చిపోయిన వ్యక్తి నన్ను గుర్తుంచుకుని నా ప్రేమకి అడ్డు గోడయ్యాడు. నాపై లేనిపోనివి చెప్పి మమ్మల్ని విడగొట్టే ప్రయత్నం చేశాడు. అప్పటి నుంచి ఆంక్షలు పెట్టడం మొదలెట్టారు. నా నుంచి దూరం చేయాలని తనని వేరే ఊరు పంపేశారు. ఫోన్‌ లాగేసుకున్నారు. తనతో మాట్లాడకుండా కొన్ని గంటలైన ఉండలేని నేను.. రోజుల తరబడి నరకం చూశా. చావుకి దగ్గరైనా.. తన మీదున్న ప్రేమ చావక మళ్లీ బతికా. నేను తనని కలవడానికి ఉన్న మార్గాలన్నీ మూసేసారు. ఈ రోజుకి ఏడాది అవుతోంది నా జెస్సీ గొంతువిని.
కారణాలేమైనా చివరిశ్వాస వరకు తోడుంటుందనుకున్న నా ప్రేయసి ఇప్పుడు కంటికి కనబడనంత దూరంగా వెళ్లిపోయింది. మేము చివరగా మాట్లాడుకున్న మాటల్ని నా చివరి శ్వాస వరకూ మర్చిపోలేను. తను నా కోసం అంతలా తపించింది. ప్రేమిస్తే ఇంతగా శిక్షించబడాలా? ఇప్పుడు తనో జ్ఞాపకంలా బతికేస్తున్నా. తను ఎప్పటికైనా తిరిగివచ్చి నన్ను అల్లేసుకుంటుందని ఆశ. అది చావడం లేదు. తన కానుకల్లోనే తన స్పర్శనీ, తన ఊహల్లోనే నా ఆనందాన్ని వెతుక్కుంటున్నా. ఈ కొత్త ఏడాదైనా తను ఉన్న చోటుకి దారి చూపుతుందేమో..


నా ప్రేమకి తనో గమ్యం..తనని చేరేంత వరకూ ప్రయాణిస్తూనే ఉంటా!
- నాని


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని