కాలు దెబ్బతిన్నా ఖండాంతరాలకు..

విధి చిన్న చూపు చూసినా.. అతను తలెత్తి పైకి చూశాడు.. కాళ్లు తడబడితే.. సంకల్పంతో ముందుకు నడిచాడు.. ఎంత దూరమో తెలుసా? కిలిమంజారో దాటుకుని

Published : 11 Jan 2020 00:15 IST

 

విధి చిన్న చూపు చూసినా.. అతను తలెత్తి పైకి చూశాడు.. కాళ్లు తడబడితే.. సంకల్పంతో ముందుకు నడిచాడు.. ఎంత దూరమో తెలుసా? కిలిమంజారో దాటుకుని ఎవరెస్టు శిఖరం వరకూ.. మొత్తం ఏడు శిఖరాల్ని అధిరోహించాడు! అతనెవరంటే.. సురేష్‌బాబు

సురేష్‌ది కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల. సిల్వర్‌ జూబ్లీ కళాశాలలో (కర్నూలు) బీజెడ్‌సీ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. చిన్నతనంలో ఆడుకుంటూ ఉండగా చెట్టు నుంచి కింద పడడంతో కాలు దెబ్బతింది. క్రీడలంటే ఆసక్తి ఉన్నా ఆడలేని స్థితి. అది తనకి నచ్చేది కాదు. అనుకోకుండా ఇంటర్మీడియట్‌లో ఉండగా పర్వతాలు అధిరోహిఫంచడానికి అవకాశం వచ్చింది. అది మొదలు.. ఆత్మీయుల ప్రోత్సాహం తనలోని సాహసికునికి ప్రాణం పోశాయి. తన ప్రతిభకు ప్రత్యేక శిక్షణ తోడయ్యింది. ప్రతికూల వాతావరణంలోనూ ముందుకు సాగాడు. కోచ్‌ల సలహాలు, సూచనలతో రెండు నెలల్లో ఎవరెస్టు ఎక్కాడు. తర్వాత కిలిమంజారో, ఎల్‌బ్రోస్‌, మానస్లూ, అకాంకాగువా, కోసిజ్కో, లోత్సే.. పర్వతాల్ని అధిరోహించాడు. పర్వతారోహకుడిగానే కాదు.. తనలోని ప్రకృతి ప్రేమికుడిని సంతృప్తి పరిచేలా రెండు జిల్లాల కలెక్టర్ల సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి, కర్నూలు- అనంతపురం జిల్లాలలో వారం రోజుల్లో 25 వేల మొక్కలు నాటాడు. చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాడు.

చరిత్రలో నాకో పేజీ ఉండాలి..

- సురేష్‌బాబు

ఎవరెస్టు ఎక్కిన అనుభవంతో శిక్షణ లేకుండా మిగిలిన ఆరు శిఖరాలను అధిరోహించా. ఎవరెస్టు అంచులపై గాలి పీలుస్తూ జీవం పోసిన దేవుడికి, జీవితం ఇచ్చిన అమ్మానాన్నలకు కృతజ్ఞతలు చెప్పుకున్నా. 21 ఏళ్లకే ఏడు పర్వతాలను అధిరోహించిన ఘనత నాకు దక్కింది. నా లక్ష్య సాధన వెనక ఎంతో మంది ప్రోత్సాహం ఉంది. ప్రపంచ చరిత్రలో నేను నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతా.

- కె.అనంతపద్మనాభరావు, గోనెగండ్ల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని