నేను... యవ్వనాన్ని!

‘యవ్వనం.. పోతే తిరిగి రాదు’.. ఇలా నా గురించి నన్ను దాటుకుని వెళ్లిన వారందరూ చెబుతుంటారు. వినీ.. వినీ.. బోర్‌ కొట్టి నేనే వచ్ఛా నా వయసు

Published : 11 Jan 2020 00:19 IST

‘యవ్వనం.. పోతే తిరిగి రాదు’.. ఇలా నా గురించి నన్ను దాటుకుని వెళ్లిన వారందరూ చెబుతుంటారు. వినీ.. వినీ.. బోర్‌ కొట్టి నేనే వచ్ఛా నా వయసులో ఉన్న మీతో మాట్లాడేందుకు ఇదే నాకు సరైన రోజు అనిపించింది. నాదైన శక్తి, యుక్తి గురించి మనసు విప్పి చెప్పుకునేందుకు ఇదే సరైన సమయం..

నాదో కొత్త బంగారు లోకం... దుబారా చేస్తే బాధపడేది మీరే. పొదుపుగా వాడకపోయినా ఫర్వాలేదుగానీ.. కచ్చితంగా ప్రయోజనకరం ఉండాలి. ఎందుకంటే.. ఆలోచించగలిగేంత పరిణతి, ఆలోచించింది అమలు చేసేంత శక్తి రెండూ నా సొంతం. నా సామర్థ్యాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ఏదైనా సాధించొచ్ఛు దేన్నైనా గెలవచ్ఛు దానికి మీరు చేయాల్సిందల్లా కష్టపడి చదవడం... పని చేయడం.. ఫలితం ఆశించాల్సిన పని లేదు. ఎందుకంటే... చెప్పానుగా.. నాదో కొత్త బంగారు లోకం. మనస్ఫూర్తిగా ఎగరగలనని నమ్మి.. రెక్కలు విదిలించండి.. మిమ్మల్ని విజయ తీరాలకు, మీదైన కలల ప్రపంచానికి నేను తీసుకెళ్తా. న్యూనతాభావంతో మీరెప్పుడైనా వెనక్కి తిరిగారా.. నా బలాలన్నీ బలహీనతలే. మీరు పడే ఒత్తిళ్లు, సంఘర్షణలు అన్నీ ఇన్నీ కావు. ఆవేశంతో ఆరాటపడినా అంగుళం కూడా ఎగరలేరు. అదే అదునుగా చూసుకుని హార్మోన్లు హైజాక్‌ చేస్తాయి. దారి మళ్లిస్తాయి. ఆకర్షణలతో నా దిశనే మార్చేస్తాయి. ఏది ప్రేమో, ఏది ఆకర్షణో తెలియని తికమక. లోతు తెలియక ప్రేమేనని దిగితే.. బలమైన మీ భుజాలపై కొన్ని టన్నుల అయోమయం.. పదునైన మీ మెదడుపై లెక్కకందని చిక్కుముళ్లు.. పైకి తేలనివ్వవు జాగ్రత్త.. ఫ్రెండ్స్‌!

నాణేనికి రెండో వైపు ఉన్నట్టుగా.. యుక్త వయసనే నా కత్తికి ఉన్న రెండో వైపు పదునూ అప్పుడు పరిచయం అవుతుంది. జీవితాలు తెగిపడతాయి. నిర్ధాక్షిణ్యంగా మిమ్మల్ని సమాజానికి క్రిమినల్‌గా పరిచయం చేస్తా. అందుకే తస్మాత్‌ జాగ్రత్త.. సమాజానికి మిమ్మల్ని ఎలా పరిచయం చేయాలో మీరే జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోండి. మీ మదిలో ఆలోచనల్ని మీరు నడపలేరు. అవే మిమ్మల్ని నడిపిస్తాయి. అందుకే ఆచి తూచి అడుగేయండి. కాలేజీ వయసు.. ఇప్పుడిప్పుడే అల్లుకుంటున్న సొగసు అని.. బోర్డర్‌ దాటితే.. క్షణికావేశమే మిగులుతుంది. అప్పుడు దానికి బలైన ఆశలు.. కలలు.. కోరికలు.. చెదిరిన పుస్తకాల్లా.. చిరిగిన పేజీల్లా.. చెల్లాచెదురవుతాయి. ర్యాంకులు, రివార్డులు ఎక్కడో దూరంగా నిలబడి సిగ్గుతో తలదించుకుంటాయి. తల్లిదండ్రులు.. సభ్య సమాజం నుంచి పొందిన జ్ఞానం నాతో, నీతో ఇలా చెబుతుంది.. ‘పిచ్చోడి చేతిలో రాయి.. మూర్ఖుడి చేతిలో యవ్వనం’ ఒకటే అని.

అలాంటి రోజు ఒకటి నాకు, మీకు రావద్దనేది నా ఆశ, ధ్యాస. ఫ్రెండ్స్‌.. నేనెప్పుడూ మీ జీవితంలో కొత్త బంగారు లోకంగానే ఉండాలి.. మీకు సొంతం అవ్వాలి!! ఇక మీ ఇష్టం..

వెండి వెన్నెల్లో కలలు పండించుకుంటారో...

అమావాస్య రాత్రుల్లో కలలు ఖండించుకుంటారో!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని