భీమవరం బుల్లోడు!

ఐదేళ్లుగా ఓడిపోతూనే ఉన్నాడు.. అయినా పట్టు వదల్లేదు. మళ్లీ ప్రయత్నించాడు.. మిస్టర్‌ ఇండియా అయ్యాడు.. అంతకుముందు ఐదుసార్లు మిస్టర్‌ ఆంధ్రా కూడా.

Published : 11 Jan 2020 00:20 IST

ఐదేళ్లుగా ఓడిపోతూనే ఉన్నాడు.. అయినా పట్టు వదల్లేదు. మళ్లీ ప్రయత్నించాడు.. మిస్టర్‌ ఇండియా అయ్యాడు.. అంతకుముందు ఐదుసార్లు మిస్టర్‌ ఆంధ్రా కూడా.. అంతేకాదు.. అంతర్జాతీయ బాడీ బిల్డింగ్‌ పోటీల్లోనూ కాంస్య పతకం గెలిచాడు.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక వ్యక్తి అయ్యాడు.. తనే కండిబోయిన ఆశిష్‌...

ఇతనిది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామం. చిన్ననాటి నుంచే బాడీ బిల్డర్‌ అవ్వాలనుకున్నాడు. ఆ అభిరుచే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే స్థాయికి ఎదిగేలా చేసింది. అంతే కాదు ఆ కోటాలోనే తపాలా శాఖలో ఉద్యోగం సాధించేందుకు ఊతమిచ్చింది. ఉద్యోగం వచ్చినా బాడీ బిల్డింగ్‌పై ఉన్న ఆసక్తి సన్నగిల్లలేదు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే వరకూ తీసుకెళ్లింది.

ఏళ్ల కృషి ఫలితం

ఇటలీకి చెందిన ఎన్‌బీబీయూఐ (నేషనల్‌ బాడీ బిల్డింగ్‌ యూనియన్‌ ఇంటర్నేషనల్‌) అక్టోబర్‌ 18 నుంచి 20 వరకు చెన్నైలో జాతీయ, అంతర్జాతీయ బాడీ బిల్డింగ్‌ పోటీలను నిర్వహించింది. జాతీయ స్థాయిలో జరిగిన పోటీలో ఆశిష్‌ సత్తా చాటాడు. ప్రథమ స్థానంలో నిలిచి పసిడి పతకం సాధించాడు. మిస్టర్‌ ఇండియాగా నిలిచాడు. ఆ పోటీలో మొత్తం 15 మందితో పోటీపడిన ఆశిష్‌ చివరికి తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నాడు. గత ఐదేళ్ల నుంచి ఆశిష్‌ ఈ పోటీల్లో పాల్గొంటున్నాడు. ప్రతిసారీ ఓటమే పలకరించింది. అయినా నిరాశ చెందలేదు. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించాడు. ఓడిపోయినా కానీ ప్రయత్నంలో ఓడిపోకూడదనే మాటలనే మంత్రంగా చేసుకుని ఐదోసారి విజయం సాధించాడు. చెన్నైలో జరిగిన అంతర్జాతీయ బాడీ బిల్డింగ్‌ పోటీల్లోనూ తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. ఈ పోటీల్లో 20 దేశాలకు చెందిన యువకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా ఆశిష్‌ నిలిచాడు. గతంలో కేరళలో జరిగిన అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల టోర్నీలో పసిడి పతకం సాధించాడు. ఇప్పటి వరకు ఐదుసార్లు మిస్టర్‌ ఆంధ్రాగా నిలిచి బంగారు పతకాలు కైవసం చేసుకున్నాడు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. గెలుపు నుంచి ప్రోత్సాహం పొందుతూ అంతర్జాతీయ బాడీ బిల్డింగ్‌ పోటీల్లో పసిడి పతకం గెలవాలన్నదే తన ఆశయం అని చెబుతున్నాడు.

- ఉప్పాల రాజాపృథ్వీ, ఈనాడు డిజిటల్‌, ఏలూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని