భరోసా కల్పించండి

నా పేరు లావణ్య. ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నా.  మేము ఇద్దరం అక్కాచెల్లెలం. అక్కది ప్రేమ వివాహం. దాని వల్ల ఇంట్లో కొన్ని సమస్యలు వచ్చాయి. నేనూ అలాగే చేస్తానేమో అని చదువు వద్దన్నారు...

Published : 08 Feb 2020 01:19 IST

మనలో మనం

ప్రశ్న: నా పేరు లావణ్య. ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నా.  మేము ఇద్దరం అక్కాచెల్లెలం. అక్కది ప్రేమ వివాహం. దాని వల్ల ఇంట్లో కొన్ని సమస్యలు వచ్చాయి. నేనూ అలాగే చేస్తానేమో అని చదువు వద్దన్నారు.  నేను అక్కలా చేయనని నాన్నకి మాటిచ్చా. కానీ, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. అతన్ని వదులుకోలేను. ఇంట్లో వాళ్లు చూసే పెళ్లి సంబంధం నాకు ఇష్టం లేదు. నేనూ అక్కలా చేస్తే వాళ్లు బాధపడతారు. ఇప్పుడు నాకేం తోచడం లేదు. ఇంట్లో వాళ్లు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా? లేదా నేను ప్రేమించిన అబ్బాయినా?
సమాధానం: మీరు మీ పెళ్లికి సంబంధించి ఇంట్లో మాట్లాడండి. అంతకుముందే  మీరు ప్రేమించిన అబ్బాయితో వివరంగా ప్రేమ, పెళ్లి విషయాలు చర్చించండి. తను ఏమనుకుంటున్నాడో పూర్తిగా తెలుసుకోండి. అతను వాళ్ల ఇంట్లో చెప్పి ఒప్పించగలడా? అడగండి. అలాగే, మీది నిజమైన ప్రేమో లేక ఆకర్షణో చూసుకోండి. ముఖ్యంగా మీ ఇద్దరి మధ్య ప్రేమ అనే బంధం పెళ్లిగా మారాలంటే ఒకరిపై మరొకరికి భవిష్యత్‌ గురించి బాధ్యతాయుతమైన అవగాహన అవసరం. అప్పుడే మీ బంధం అన్యోన్యంగా ఉంటుంది. ఇంట్లో చూసే వ్యక్తి కన్నా మీరు ప్రేమించిన వ్యక్తితోనే మీరు సౌకర్యంగా ఉండగలరు. ఇష్టంలేని పెళ్లి చేసుకుంటే తనతో ఉండేందుకు మీ మనసు అంగీకరించదు. అందుకే ఇరుకుటుంబాలకు తెలిసేలా మీ నిర్ణయం ఉండాలి. అనంతరం ఇరుకుటుంబాల అంగీకారం తప్పనిసరి. మీ అక్క విషయంలో మీ కుటుంబం బాధ పడినట్లు మళ్లీ జరగకూడదు. అందుకే మీ ఇంట్లో వారిని ఒప్పించడం తప్పనిసరి. మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటాం అనే భరోసాను ఇరుకుటుంబాలకు కల్పించాలి. అప్పుడే మీ ప్రేమ వివాహానికి మీ ఇంట్లో ఒప్పుకొనే అవకాశం ఉంది. అనంతరం మీరు కోరుకునే దాంపత్య జీవితం మీకు లభిస్తుంది.
- డాక్టర్‌ టీఎస్‌ రావు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని