Published : 08 Feb 2020 01:24 IST

ఆయన ఇచ్చిన ధైర్యం...

నాన్న చనిపోయినప్పుడు, ఇంట్లో పేదరికం పీక్కుతింటున్నప్పుడు, ఆకలితో అల్లాడినప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు చదువు, జీవితం ఏమైపోతుందో అని బాధపడుతున్న రోజుల్లో.. అయినవాళ్ల నుంచి పిలుపు లేదు. ప్రోత్సాహం లేదు. కానీ, ఓ ఆప్తమిత్రుడు మాత్రం నిత్యం వెంటే ఉన్నాడు. ఊహ తెలిసిన నాటి నుంచి తనే నన్ను ఓ కంట కనిపెడుతున్నాడు. నిరుత్సాహాన్ని పోగొడుతూ.. నవ్వడం నేర్పించాడు.. ఎన్ని కష్టాలు వచ్చినా.. నాతో ఎవరూ లేకున్నా.. నాలో తనే ఉన్నట్టు అనిపిస్తుంది. నా రక్తంలో ఉన్నట్టు, నా పక్కన కూర్చొని నన్ను హెచ్చరిస్తున్నట్టు, బాధలో ఉంటే వెన్నుతట్టి నడిపించినట్టు అనిపిస్తుంది. నేను దేవుడిని నమ్మను. నా వరకు నా దైవం నా మిత్రుడే. ఎక్కడో పొలం గట్ల మధ్య తిరుగుతూ.. సిమెంటు బస్తాలు, కంకర మోసే నన్ను హైదరాబాద్‌ మహానగరానికి వచ్చేలా ప్రోత్సహించాడు, ఒక ప్రముఖ సంస్థలో పనిచేసే అవకాశాన్ని చేజిక్కించుకునేలా చేసింది మా స్నేహం. అంతటి స్నేహం గురించి ఏం చెప్పాలి?నేను ఏం తిరిగివ్వాలి?.. అని అప్పుడప్పుడు అనిపిస్తుంది.
నేను అక్షరాలు దిద్దే వయసప్పటి నుంచీ తను నాకు తెలుసు. ఆదివారం వస్తే రోజంతా ఆడుకోవడం. సాయంత్రమైతే అప్పటి మా సర్పంచ్‌ మామ ఇంట్లోకి అందరం కట్టగట్టుకుని వెళ్లేవాళ్లం 5 గంటలకు సినిమా చూసేందుకు. అప్పుడు మా ఊరిలో వాళ్లింట్లో మాత్రమే టీవీ ఉండేది మరి. అప్పుడే మొదటి సారి తనని కలిశా. తన మాటలు, చేతలు నాతో ఎన్నో చెప్పాయి. తనతోనే ఆడి.. పాడా. నా వయసు వాడు కాదు. మా ఊరివాడు అసలే కాదు. అయినా మేమిద్దరం నిత్యం కలిసే ఉన్నాం. నా వ్యక్తిత్వం మీద అతని ప్రభావం ఎంతో చెప్పేందుకు మాటలు చాలవు. మా స్నేహాన్ని చూసి కొందరు కుళ్లుకునేవారు. కొంత మంది ఏమిచ్చాడు నీ ఫ్రెండు..? మన మట్టి కాదు. మనవాడు కాదు అని కొంచెం వెటకారంగా మాట్లాడేవారు.. నాకూ అనిపించేది ఒక్కోసారి.. ఏమిచ్చాడని? అప్పుడు వారితో చెప్పా.. పుస్తకాలు ఇవ్వని జ్ఞానం, ఏ దేవుడు ఇవ్వని ధైర్యం నాకు అడుగడుగునా తనే ఇస్తున్నాడని. నేను బలహీనంగా ఫీలయినప్పుడో.. వెలితిగా అనిపిస్తేనో.. తన మాటలు నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చేవి.
బతకడం కష్టం అనిపించిన ఆ రోజు ఇంకా నాకు గుర్తుంది. ఊరిలో చేద్దాం  అంటే పని లేదు. పొలిమేర దాటి బస్సు ఎక్కుదామంటే జేబులో పైసా లేదు. సాయం అడుగుదామంటే అయినవారి ఊసు లేదు. ఎలాగైనా బతుకుదాం అనుకోవడానికి గుండెల్లో బలం లేదు. చనిపోదాం అనుకున్నా. మరు క్షణమే.. నాలుగు అడుగుల దూరంలోనే రైలు పట్టాలు కనిపించాయ్‌. చుట్టూ శూన్యం.. కనుచూపు మేరలో మనిషి లేడు. జేబులో ఫోన్‌ రింగ్‌ అవుతోంది. తీయలేదు. నోటిఫికేషన్స్‌ వస్తున్నాయి. చూడలేదు. అడుగులు అటువైపు పడుతున్నప్పుడు.. నాకెవ్వరూ గుర్తు రాలేదు. కానీ, నేను తనకి గుర్తొచ్చా. పదే పదే రింగ్‌ అవుతున్న ఫోన్‌ని స్విచ్‌ఆఫ్‌ చేసేద్దాం అని జేబులో నుంచి తీశా. తెరపై యూట్యూబ్‌ నోటిఫికేషన్‌.. నా మిత్రుడిదే. ‘రజినీ జీవిత సత్యాలు’. అడుగులు ఆగాయి. నొక్కి చూస్తే.. తను నాతోనే మాట్లాడింది. ‘మిత్రమా ఒకటి గుర్తుంచుకో.. కష్టపడకుండా ఏది రాదు. కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలవదు..’ అని. ఆలోచనలో పడ్డా. నేను శ్వాస తీసుకుంటునానన్న విషయం నాకు తెలుస్తోంది. దాంట్లో నా మిత్రుడు ఇచ్చిన ధైర్యం ఉంది. అది మొదలు.. కష్టం నా కేరాఫ్‌ అడ్రస్‌ అనుకుని ప్రయాణిస్తున్నా.. నాతో ఎప్పుడూ రజినీ ఉన్నాడు. నేను వెళ్లేది ఆయన దారే! అందుకే నేనెప్పుడు రజినీకి ఫ్యాన్నో.. అభిమానినో కాదు. రిలీజ్‌ రోజు సినిమా చూడను. కటౌట్‌లు కట్టను.. తను నేను చదువుతున్న పుస్తకం.

- సతీష్‌  కామాద్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని