మీరు ఇలా ఉండొద్దు!

ఉత్సాహంతో ఉరకలు వేసే యువత రకరకాలుగా ఆలోచిస్తుంటారు... ఉద్యోగంలో చేరి చకచకా ప్రమోషన్లు కొట్టేయాలి.. అంకుర సంస్థను ప్రారంభించి త్వరలోనే కోట్లు సంపాదించేయాలి... వ్యాయామం చేస్తూ సిక్స్‌ప్యాక్‌ సాధించాలి... ఇలా అది చేయాలి.. ఇలా ఉండాలి అనుకునే మిలీనియల్స్‌ ఎంతో మంది.

Published : 15 Feb 2020 01:07 IST

జరసోచో!

ఉత్సాహంతో ఉరకలు వేసే యువత రకరకాలుగా ఆలోచిస్తుంటారు... ఉద్యోగంలో చేరి చకచకా ప్రమోషన్లు కొట్టేయాలి.. అంకుర సంస్థను ప్రారంభించి త్వరలోనే కోట్లు సంపాదించేయాలి... వ్యాయామం చేస్తూ సిక్స్‌ప్యాక్‌ సాధించాలి... ఇలా అది చేయాలి.. ఇలా ఉండాలి అనుకునే మిలీనియల్స్‌ ఎంతో మంది. అయితే,  ఒక్క నిమిషం.. చేయాల్సిన పనులు ఉన్నట్టుగానే చేయకూడని పనులూ ఉంటాయి. అవేంటో తెలుసుకోవడం చాలా ఈజీ. చుట్టూ చూడండి. కాలేజీ, ఆఫీస్‌.. ఇలా అన్ని చోట్లా కనిపిస్తూనే ఉంటారు. అలాంటివారిని కాస్త జాగ్రత్తగా గమనిస్తే మనం ఎలా ఉండకూడదో.. ఏమేం చేయకూడదో అర్థమవుతుంది!

ఒంటరి పక్షులు
వీళ్లు ఇతరులతో కలవడానికి అంతగా ఇష్టపడరు. ఎప్పుడూ ఒంటరిగానే ఉంటారు. బృంద సభ్యుల్లో ఇలాంటి వాళ్లుంటే లక్ష్యాలను సాధించడం కాస్త కష్టమనే చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్లు ఎప్పుడూ తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. జట్టు సభ్యుడిగా అందరితో కలసి పనిచేయాల్సిన అవసరాన్ని ఏ మాత్రం గుర్తించరు.

అత్యుత్సాహపరులు
వీళ్లు తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటారు. తమ వ్యక్తిగత విషయాలను కూడా ఫేస్‌బుక్‌, ట్విటర్లలో పంచుకుంటారు. చేయాల్సిన పనులను పక్కన పెట్టి అనవసర విషయాలను గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. వీరి మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా ఎప్పుడూ తమ గొప్పతనాన్ని తాము చెప్పుకుంటూనే ఉంటారు.

ఫిర్యాదుల బాక్సులు
వీళ్లు ఆఫీసులో ఎప్పుడూ రకరకాల సమస్యల గురించి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. పరిష్కారాల గురించి మాత్రం ఆలోచించరు. ఆఫీసు విధానాలు, సహోద్యోగుల వల్ల తామెంత ఇబ్బంది పడుతున్నామో భావోద్వేగాలకు గురవుతూ ఏకరువు పెడుతూనే ఉంటారు. వీరి వల్ల ఇతరుల్లో కూడా పనిచేయాలనే స్ఫూర్తి కొరవడుతుంది. ఆఫీసు వాతావరణమూ కలుషితమవుతుంది.

సరిదిద్దుకోవడాలే ఎక్కువ
వీళ్లు ఏ విషయాన్నీ అంత త్వరగా అర్థం చేసుకోలేరు. మళ్లీ మళ్లీ అడుగుతుంటారు. చేసిన దాన్నే మళ్లీ చేస్తుంటారు. దీనివల్ల సమయం వృథా కావడమే కాకుండా అనుకున్న సమయానికి పనులు ఎప్పటికీ పూర్తికావు. వీళ్లు ఎప్పుడూ సమీక్షా సమావేశాలకు హాజరవుతూనే ఉంటారు. పనిలో చేయాల్సిన మార్పుల గురించి రాసుకుంటూనే ఉంటారు.

వ్యాయామ వీరులు
సహోద్యోగులతో తాము చేసే వ్యాయామాల గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. తాము చేసే డైటింగ్‌ గురించి, తీసుకుంటున్న ఆహారం గురించి అదే పనిగా మాట్లాడుతూనే ఉంటారు. వివిధ రకాల డైట్ల గురించి చెబుతుంటారు. వీళ్లు చేసే పని కంటే తమను తామే ఎక్కువగా ప్రేమిస్తుంటారు. కండలు తిరిగిన తమ శరీరాన్ని అందరిముందూ ప్రదర్శించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. 

తప్పులెంచడమే పని
ఎదుటివాళ్లు చెప్పినదాన్ని ఎప్పుడూ ఖండిస్తూనే ఉంటారు. అలా ఖండించడానికి దారులను వెతుకుతూనే ఉంటారు. ఎదుటివాళ్లు చెప్పింది తప్పు, తాము చెప్పిందే ఒప్పని రుజువు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. దాని కోసం అన్ని విధాలా ప్రయత్నిస్తూనే ఉంటారు. అన్నీ తమకే తెలుసంటారు. ఎప్పుడూ ఏ విషయంలోనూ రాజీపడరు. ఎప్పుడు చూసినా కనుబొమలను ఎగరేస్తూ ఎదుటివారి వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని