మనసులు కలిపిన షుక్రియా..

బ్యాకెండ్‌ ఆపరేషన్స్‌లో నేను. బ్యాంకులో తాను. లావాదేవీల నిర్వహణలో ఏమైనా సమస్యలు తలెత్తితే.. పరిష్కరించే బాధ్యత నాదన్నమాట.

Published : 22 Feb 2020 00:21 IST

బ్యాకెండ్‌ ఆపరేషన్స్‌లో నేను. బ్యాంకులో తాను. లావాదేవీల నిర్వహణలో ఏమైనా సమస్యలు తలెత్తితే.. పరిష్కరించే బాధ్యత నాదన్నమాట. రకరకాల బ్రాంచుల నుంచి కాల్స్‌ రావడం.. సమస్యలు చెప్పడం.. నేను పరిష్కరించడం.. ఇదీ జీవితం. ఓ రోజు.. అలాగే ఒక కాల్‌. చిరాగ్గా ఫోన్‌ లిఫ్ట్‌ చేశా.. పరాగ్గా చెప్పండి అన్నా! అవతల నుంచి ఓ కోయిల. ‘హాయ్‌ఁ!’.. ఆమె గొంతుకలో ఏదో మాధుర్యం. తన సమస్యేంటో వివరించింది. ఆమె గొంతునైతే ఆస్వాదించాను గానీ, తను చెప్పింది బుర్రకెక్కలేదు. మరోసారి సమస్యంతా విని.. చిటికెలో దాన్ని పరిష్కరించాను. బదులుగా ‘షుక్రియా జీ’ అంది.

ముంబయిలో ఉంటున్న రోజులవి. ఉన్నత ఉద్యోగంలో స్థిరపడి.. జీవితంలో ఓ భాగస్వామికి చోటివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు వచ్చిందా ఫోన్‌కాల్‌. ఆమె తీయని గొంతుకను మర్చిపోకముందే.. మరో రోజు మళ్లీ ఫోన్‌. మరో సమస్య. మరుక్షణంలో పరిష్కారం చూపడం. ‘షుక్రియా జీ’ అని బదులివ్వడం. ఇదే దినచర్యగా మారిపోయింది. రోజూ తనకేదైనా ఎర్రర్‌ రావాలని దేవుణ్ని కోరుకునేవాణ్ని. లక్కీగా ఏదో ఇబ్బంది వచ్చేది. నేను చక్కదిద్దే వాణ్ని. రోజులు గడిచిపోయి.. నెలలు దాటే సరికి.. ఇద్దరి సంభాషణలో కాస్త చొరవ పెరిగింది. తన గురించి తెలుసుకోవాలనే ఆరాటం నాలో కలిగింది. నా గురించి ఆరా తీయాలనే ఉత్సాహం ఆమెలోనూ మొదలైంది. అఫీషియల్‌ కాల్స్‌లో.. పర్సనల్‌ కబుర్లు తొంగిచూశాయి. ఇష్టాఇష్టాలు పంచుకునే వరకూ వెళ్లింది.

మాటతీరు తప్ప ఆమె గురించి ఏ ఆనవాళ్లూ తెలియవు. తను మాత్రం నన్నోసారి చూసిందట. ఆ ముచ్చటా తర్వాత తెలిసింది. ఇద్దరి అభిప్రాయాల్లో తేడాలున్నాయి. ఇద్దరి ప్రాంతాల్లో బోలెడంత దూరం ఉంది. గోధుమ రాశుల పంజాబ్‌ తనది. వరి కురిసే తెలుగునాడు నాది. మా మధ్య దూరాన్ని ఒక్క ఫోన్‌కాల్‌ చెరిపేసింది. మాటలన్నీ కట్టిపెట్టి ఒకసారి కలుద్దాం అనుకున్నాం. ఫోన్‌ సంభాషణల్లో మూడేళ్ల కాలాన్ని మూడు రోజుల్లా గడిపేసిన నాకు.. కలుద్దాం అనుకున్నప్పటి నుంచి ప్రతి క్షణం ఓ సంవత్సరంగా గడిచింది. ప్రతి రోజూ ఓ యుగంగా తోచింది. వారం రోజుల్లో కలవబోతున్నా..! మనసులో రకరకాల ఆలోచనలు. మా ఇద్దరికీ పొసుగుతుందా అనే సందేహం. తనేమంటుందో అనే భయం. గిటారు మోతలా డామినేషన్‌ గళం నాది. తంబుర శ్రుతిలా మంద్రమైన గొంతుక ఆమెది. ఆవేశం వస్తే ఊగిపోతాన్నేను. పరిస్థితులు ఎలా ఉన్నా శాంతంగా ఉండే స్వభావం తనదని ఆమె మాటల ద్వారా అర్థమైంది. అలాంటి అమ్మాయిని కలిసే రోజు రానే వచ్చింది.

ముంబయిలో ఓ వీధి. హాస్టల్‌ బయట నేను. ఆత్రంగా ఎదురు చూస్తున్నా. అటుగా ఎందరో అమ్మాయిలు వస్తున్నారు. వెళ్తున్నారు. నా కళ్లు అందరినీ చూస్తున్నాయి గానీ, నా మనసు ఎవరినీ పట్టించుకోవడం లేదు. ఇంకెవరినో అన్వేషిస్తోంది. నా గుండెను తాకిన మాటలను వెతుక్కుంటోంది. పది నిమిషాల తర్వాత మనసు కుదురుకుంది. కళ్లు రెప్పలు వేయడం మర్చిపోయాయి. కాళ్లు సరిగ్గా నిలవనన్నాయి. నా మాటల మాంత్రికురాలు తనే అని ఆ క్షణానే నా హృదయం కనిపెట్టేసింది. దగ్గరగా వచ్చిందామె. జీవితమంతా ఇలాగే దగ్గరగా ఉందాం అన్నాన్నేను. ‘షుక్రియా జీ’ ఆమె సమాధానం.

మా పెళ్లయి ఐదేళ్లయింది. అమ్మాయికి అమ్మానాన్నా లేరు. ఆమె తరఫు వాళ్లు ఒప్పుకొన్నారు. నాకు అమ్మ లేదు. నాన్న ముక్తసరిగా ‘నీ ఇష్టం! కానీ’ అన్నారు. పెళ్లికి ఒకరిద్దరు మినహా బంధువులు ఎవరూ రాలేదు. రెండేళ్లకు మాకో బంగారుబొమ్మ పుట్టింది. నా చిట్టితల్లి బారసాలకు ఒకరిద్దరు మినహా బంధువులంతా వచ్చారు. నా ఆనందం రెండింతలైంది. మా అనుబంధం మరింత దగ్గరైంది.

- సీఆర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని