ఐ లవ్‌ యూ అమృత!

ఆ నిమిషం మోయలేనంత బాధ.. నాలో నాకే. కోపం.. నాపై నాకే. భయం...

Published : 29 Feb 2020 00:39 IST

నిమిషం మోయలేనంత బాధ.. నాలో నాకే. కోపం.. నాపై నాకే. భయం.. బతుకంటే! కారణం.. ప్రేమ. ఒకటా.. రెండా.. ఇంచుమించు ఆరేళ్ల ప్రేమ. చివరికి ఓడిపోయా. ఒక్కడిగా మిలిగిపోయా.. కారణం?

రెండు మూడు ఊళ్లకు ఒకే జెడ్‌పీ హై స్కూల్‌. తనది మా ఊరు పక్కనే. స్కూల్‌కి తను మా ఊరి మీదుగానే వెళ్లాలి. తన రాక కోసం రోజూ పేరగాన్‌ చెప్పులు సైకిల్‌ పెడల్‌పై పెట్టి వేచి చూసేవాడిని. అల్లంత దూరాన తన సైకిల్‌ బెల్లు వినిపించగానే గుండె జల్లు మనేది. తను వెళ్లాక వెనకాలే నేను. తను వెనక్కి చూస్తే.. నేను పైకి చూసే వాడిని. క్లాస్‌లోనూ అంతే. ఇద్దరిదీ ఒకటే సెక్షన్‌. ఎక్కడో ముందు వరుసలో తనుంటే.. వెనక నుంచి రెండో వరుసలో నేను. టీచర్‌ ఏది అడిగినా.. తనని చూసేందుకే ముందు చెయ్యి పైకి ఎత్తి లేచేవాడిని. జవాబు తెలియపోయినా. కొన్ని సార్లు నా అమాయకత్వం తన పెదాలపై చిరునవ్వుని పూయించేది. ఇలా తన కోసం ఎన్ని సార్లు జోకర్‌ని అయ్యానో. ఏడు, ఎనిమిది తరగతులు ఇలానే సాగిపోయాయి. నేను ఎందుకు అలా చేస్తున్నానో నాకు తప్ప ఎవరికీ తెలీదు. ఎవ్వరూ నన్ను అడిగేవారు కాదు. ఎందుకంటే.. నేను ఎవ్వరితోనూ పెద్దగా మాట కలిపేవాడిని కాదు. ఇంటా.. బయటా.. స్కూల్‌లో.. అన్నీ చోట్లా అంతే. దాంతో అందరూ కలిసి నాకో పేరు పెట్టారు కూడా. ‘మ్యూట్‌.. మనోజ్‌’ అని.

టెన్త్‌కి వచ్చే సరికి.. తనపై నా ప్రేమని తనకి చెప్పలేక, ఎవరితో చెప్పుకోలేక.. నేనో కవినైపోయా. తనను ఉద్దేశిస్తూ.. తన కోసమే.. నా మనసు వేదనని కవితల రూపంలో పంచుకునే వాడిని. ఓ రోజు పొరపాటున క్లాస్‌ నోట్స్‌ ఇవ్వబోయి కవితల పుస్తకాన్ని టీచర్‌కి ఇచ్చేశా.. మేడమ్‌ అన్నీ చదివి నా దగ్గరికి వచ్చి నించోమంది. మళ్లీ జోకర్‌ని అయిపోయా అనుకుంటూ భయంగా లేచా. కానీ, నేను ఊహించిన దానికి భిన్నంగా మా టీచర్‌ కొన్ని కవితల్ని క్లాస్‌లో అందరికీ చదివి వినిపించింది. అందరూ చప్పట్లు కొట్టారు. తనైతే కళ్లు పెద్దవి చేసి నావైపు చూసి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ నేను ఇప్పటికీ మర్చిపోలేను. విషయం ఏంటంటే.. పుస్తకంలోగానీ.. కవితల్లోగానీ తన పేరుని ప్రస్తావించేంత ధైర్యం నేను చేయలేకపోయా. అలా పదో తరగతిలో తనపై నా ప్రేమ ఏకంగా.. ఆ ఇయర్‌ స్కూల్‌ మ్యాగజైన్‌లోకి ఎక్కేసింది. అది నాకు మాత్రమే తెలిసిన నిజం.

టెన్త్‌లో స్కూల్‌ ఫేర్‌వెల్‌.. అందరూ ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటున్నారు. నాకు క్లాస్‌లో బెస్టీలు లేకపోవడంతో.. గుంపునకి దూరంగా తననే చూస్తూ ఉన్నా. సడన్‌గా.. తను అడుగులు నా వైపే పడ్డాయి. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నిలబడి నేలనే చూస్తున్నా. తను దగ్గరగా వచ్చేసరికి పాదాలు కనిపించాయి. ‘మనోజ్‌.. ఏంటి ఒక్కడివే. రా’ అంటూ చేయి పట్టుకుని నడిచింది. తలెత్తి పైకి చూసా. వాలు జడ.. దాంట్లో ఒద్దికగా కూర్చున్న ఓ గులాబీ. వెనకే వెళ్తూ.. నేను వేసిన అడుగులు.. అమ్మ వేలు పట్టుకుని ఎప్పుడో నడిచిన అడుగుల్లా అనిపించాయి. అన్నింటికీ భయపడే నేను ధైర్యంగా నడవగలిగా. అందర్లోకి తీసుకెళ్లి.. ‘మనోజ్‌.. నా బెస్టీ’ అంటూ ఆటోగ్రాఫ్‌ అడిగింది. రాస్తుంటే చెయ్యి వణికింది. మనసు మాత్రం ఎగిరి గంతేసింది.

తర్వాత కాలేజీ చదువులూ తన వెనకే. దూరం కాస్త పెరిగింది. ఊరికి పాతిక కిలోమీటర్ల దూరం. రోజూ బస్సులో వెళ్లి రావడం. తను ఎక్కాకే బస్‌ ఎక్కడం.. తను దిగాకే దిగడం. తను నవ్వేది. నేను నవ్వాలా వద్దా అని ఆలోచించేలోపే తను వెళ్లిపోయేది. ఎప్పుడైనా రంగుల షర్టేస్తే. ‘ఏంటి స్పెషల్‌?’ అంటూ కళ్లతోనే అడిగేది. నేను తడబడి తలెత్తి చూసే సరికి తను వెళ్లి సీట్లో కూర్చునేది. ఇలానే ఇంటర్‌ అయిపోయింది. ఒక్కోసారి నేను ప్రేమిస్తున్నానా.. లేదా? నాది పిరికి ప్రేమా? పవిత్రమైన ప్రేమా? ఇలా ఎన్నో సందేహాలు. డిగ్రీ సెకండ్‌ ఇయర్‌లో నిర్ణయించుకున్నా. నా ప్రేమని తనకి చెప్పాలని. తన దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయడం.. తన చుట్టూ ఎవరున్నా పరీశీలించడం చేసేవాడిని. ఆ రోజు కాలేజీ ఫ్రెషర్స్‌ డే. నా ప్రేమ విషయం చెబుదాం అని కవిత రాశా. తీసుకెళ్లి ఇద్దాం అనుకుంటున్నా. ఇంతలో తనే నా దగ్గరకి వచ్చింది. స్కూల్‌లో మాదిరే.. టెన్షన్‌తో తల కిందికి దించేశా. కానీ, ఈ సారి తన పాదాలకి తోడు మరొకరి షూస్‌ కనిపించాయి. తలెత్తే సరికి.. ‘నా ఫ్రెండు సంజూ’ అని పరిచయం చేసింది. అతను నాక్కూడా తెలుసు. వాడు ఫ్రెండ్‌ కాదు అంతకు మించి అని అర్థమయ్యేందుకు నాకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆలస్యం అయిపోయింది. ఎప్పుడూ.. తననే చూస్తున్న నేను.. తన వెంటే.. పక్కనే మరొకరు ఉన్నారని గమనించలేకపోయా. ఏం చేయాలో అర్థం కాలేదు. కొన్ని రోజులు.. నెలలు.. నన్ను నేనే తిట్టుకున్నా. ఒక్కో రోజు మా ఊర్లో పెద్ద కొండపై ఎక్కి నాలుగు దిక్కులు వినిపించేలా ‘ఐ లవ్‌ యూ... అమృత!!!!’ అని పిచ్చిగా అరిచే వాడిని. గుండెల్లో భారం కాస్తైనా తగ్గుతుందని. అంతేనా.. ఇక ఎప్పటికీ తనతో ఆ మాట చెప్పలేను కూడా. చిన్ననాటి నుంచి పెంచుకున్న ప్రేమ కదా. ఎప్పటికీ వీడి పోదు. ఇప్పుడు నేను ఎంబీఏ చదువుతున్నా. వన్‌ సైడ్‌ లవర్‌గా తనతో నాకు మిగిలిన జ్ఞాపకాలు అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి. ఆ వెంటే ఓ చిరునవ్వు. నన్నో వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌గా పాజిటివ్‌గా ముందుకు తీసుకెళ్తోంది.

- మనోజ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని