లీప్‌హిప్‌.. హుర్రే!

ఇప్పటికే కొన్ని గంటలు గడిచిపోయాయి. త్వరగా.. త్వరగా.. ఎంజాయ్‌ చేసేయండి....

Published : 29 Feb 2020 00:43 IST

24 గంటలు

1,440 నిమిషాలు

86,400 సెకన్లు

అన్నీ మీవే! నాలుగేళ్ల తర్వాత వచ్చిన అవకాశం. మరో నాలుగేళ్ల దాకా దక్కని అదృష్టం ఈ రోజు. ఏడాదికో పావు రోజు దాచుకొని.. లీప్‌ ఇయర్‌లో ఫిబ్రవరి 29గా పలకరిస్తున్న రోజుది. అనుకోకుండా వచ్చిన రోజును అనుకున్న విధంగా ఆస్వాదించండి. ఎక్స్‌ట్రాగా జీవించండి...

ప్పటికే కొన్ని గంటలు గడిచిపోయాయి. త్వరగా.. త్వరగా.. ఎంజాయ్‌ చేసేయండి. సరదాగా గడపమంటే ఫోన్‌ పట్టుకుంటారే? దానికున్న సైలెంట్‌ మీట నొక్కేయండి ముందు. పక్కకు విసిరేయండి. ఓ పది నిమిషాలు ఆలోచించండి. మీ రోజు ఎలా మొదలవ్వాలనుకుంటారు? ఎలా సాగాలనుకుంటారు? ఎలా పూర్తవ్వాలనుకుంటారు? అలాగే జరిగేలా చూసుకోండి. కాలంతో పరిగెత్తడం మాత్రమే తెలిసిన మనకు అదనంగా ఒక్క నిమిషం దొరికినా అదృష్టమే! అలాంటిది అప్పనంగా ఒకరోజంతా వచ్చి ఒళ్లో వాలితే తేలిగ్గా తీసుకుంటారేం. అదీ వారాంతంలో వచ్చి మరింత సందడి చేయమంటోంది. కుటుంబంతో షికారుకు వెళ్లాలనుకుంటున్నారా? వెళ్లిపోండి. సినిమా చూడాలని ఉందా? చూసేయండి. పోనీ, ఎన్నో రోజులుగా చదవాలనుకుంటున్న పుస్తకానికి అంకితమవ్వండి. ఇంటి పట్టునే ఉంటే.. నచ్చిన ఆహారాన్ని ఓ పట్టుపట్టేయండి. ఓ రెండు గంటలు కునుకేయండి. సరదాగా ఆడుకోండి. కాలాన్ని ఆదా చేయడం అంటే కష్టం కానీ, ఖర్చు పెట్టడం ఎంతసేపు చెప్పండి. ఇట్టే కరిగిపోతుంది.

అరుదైన రోజును ఆస్వాదించిన వాళ్లకే ఇంత ఆనందం ఉంటే.. ఈ రోజున పుట్టినవాళ్లకు ఇంకెంత సంతోషమో ఊహించండి. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే పుట్టిన రోజు. నాలుగు కాలాలూ గుర్తుండేలా చేసుకోవడమే చేయాల్సింది.

ఇదే రోజున ఒక్కటైన జంటలుంటే సంబరాలకు ఆకాశమే హద్దు కావాలి. రొటిన్‌కు భిన్నంగా వచ్చిన ‘లీప్‌ డే’ను అంతే విభిన్నంగా చేసుకోండి.

అనుకోని అతిథులుగా మారిపోయి.. అయినవారింటికి వెళ్లిపోండి. హాయిగా రోజంతా గడిపేయండి. చివరగా నచ్చిన సినిమా చూసి.. వచ్చే లీప్‌ ఇయర్‌ ఫిబ్రవరి 29 గురించి ఆలోచిస్తూ హాయిగా నిద్దట్లోకి జారుకోండి.

మర్నాడు బద్దకంగా లేచి.. నిన్నంతా వృథా చేశానే అని కంగారుపడకండి. హైరానా చెందకండి. అది మీ రోజు కాదు. అదనంగా కలిసొచ్చిన అవకాశం. ప్రతి రోజులా అదీ ఉంటే ఎలా? ఆ పొరపాటు చేయకండి. ఈ ‘లీప్‌ డే’ను మనసారా ఆస్వాదించామనే తృప్తితో మరుసటి రోజును ఆరంభించండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని