ఒంటి చేతి దంగల్‌!

దారాన్ని ముడేయాలన్నా రెండు చేతులు వాడాల్సిందే. అలాంటిది, కండలు తిరిగిన మల్లయోధుల్ని ఒంటి చేత్తో ...

Updated : 21 Mar 2020 00:29 IST

దారాన్ని ముడేయాలన్నా రెండు చేతులు వాడాల్సిందే. అలాంటిది, కండలు తిరిగిన మల్లయోధుల్ని ఒంటి చేత్తో మట్టికరిపించడం సాధ్యమేనా? అదీ ఎడమచేత్తో!! సినిమా హీరోకి అయితే సాధ్యమేమోగానీ.. వాస్తవ జీవితంలో అసాధ్యం అనుకుంటాం. కానీ, గణేశ్‌ దేశాయ్‌కి సాధ్యం అయ్యింది.. ఒంటి చేత్తో కుస్తీకి సవాల్‌ విసురుతూ.. తన ఆత్మవిశ్వాసాన్ని చాటుతున్నాడు. ఏదో ఒకటీ రెండూ గాలివాటం విజయాలు కాదు.. బరిలోకి దిగిన ప్రతిసారి పైచేయి సాధిస్తూ తన సంకల్ప బలమెంతో చూపిస్తున్నాడు..

ణేశ్‌ది మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌ తాలూకా కర్కెల్లి. తండ్రి శెట్టిబా శుభకార్యాల్లో వంటలు చేస్తుంటాడు. తల్లి సజ్జన్‌బాయి వ్యవసాయ కూలీ. నిరుపేద కుటుంబం. బడివైపు కదలాల్సిన తన అడుగులు.. పూట గడవక పొలాల వైపు నడిచాయి. పశువుల కాపరిని చేశాయి. రోజూ వాటివెంటే పయనం. అయినా.. తనకో ఇష్టం ఉంది.. అదే కుస్తీ పట్టడం. చిన్నప్పటి నుంచి కుస్తీ పోటీలంటే మక్కువ. ఎక్కడ పోటీలు జరిగినా వాలిపోతాడు. తను కూడా బరిలో దిగాలని ఆరాటపడేవాడు. కానీ, తన పేదరికానికి దురదృష్టం తోడయ్యింది. 2012లో కర్కెల్లి సమీపంలో పశువులు మేపుతుండగా రైలు పట్టాలు దాటే క్రమంలో కింద పడిపోయాడు. తలకు దెబ్బ తగలడంతో స్పృహతప్పి పడిపోయాడు. కుడిచేయి పట్టాలపై ఉండడం.. దాని పైనుంచి రైలు వెళ్లడంతో ఆ చేయిని కోల్పోయాడు. కానీ, అధైర్య పడలేదు. ఇప్పటికీ పశువుల కాపరిగానే ఉంటూ ఒంటి చేత్తోనే సాధన చేశాడు.
ప్రత్యర్థికి గణేశ్‌ ఒక పట్టాన చిక్కడు, దొరకడు. తనతో తలపడుతున్న వ్యక్తికి అలసట తెప్పించి అదును చూసి చిత్తు చేయడంలో దిట్ట. గణేశ్‌ను ఓడించడం తమవల్ల కాదని అలసిపోయి మల్లయోధులు వెనుదిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

58 సార్లు బరిలోకి..

కుస్తీకి బరిలోకి దిగుతానంటే. తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఉన్న ఒక చేయీ కోల్పోతాడేమోననే భయం. గణేశ్‌ కల ముందు వాళ్ల భయం ఓడిపోయింది. మహారాష్ట్రలోని డొంగర్‌గావ్‌ సాలేగావ్‌ అనే ఊర్లో 2015లో మొదటిసారి కుస్తీపట్టి విజయం సాధించాడు. ఒంటి చేత్తో గెలుపొందడంతో కుస్తీ పోటీలు తిలకించడానికి వచ్చిన జనం గణేశ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అది మొదలు వరుస విజయాలతో సాగిపోతున్నాడు. మహారాష్ట్రలోని నాందేడ్‌, పర్భణి, కిన్వట్‌, చంద్రాపూర్‌తో పాటు తెలంగాణలోని నిర్మల్‌, ఆదిలాబాద్‌, బాన్సువాడ, నిజామాబాద్‌, బోధన్‌ తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు గణేశ్‌ 58 సార్లు ప్రత్యర్థులతో తలపడ్డాడు. మహారాష్ట్రలోని మత్నుర్‌లో ఒక్క ఓటమి మినహా అన్నింట్ల్లో విజయం సాధించి ఇతర మల్లయోధులకు సాధ్యంకాని ఘనతని సాధించాడు.

- వై.గంగారెడ్డి, న్యూస్‌టుడే-ముథోల్‌

- కె.వి.రమణారెడ్డి, న్యూస్‌టుడే-మామడ

ఆ విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది..

డొంగర్‌గావ్‌ సాలేగావ్‌లో కుస్తీ పోటీల్లో తలపడాలని అనిపించింది. పక్కనున్నవారు ఒంటి చేత్తో కుస్తీ ఎలా పడతావ్‌? ఏదైనా ప్రమాదం జరగొచ్చు అని వద్దన్నారు. ఏం జరిగినా ఫర్వాలేదని కుస్తీ పోటీలో తలపడి విజయం సాధించాను. దాంతో ఒక చేయితో కూడా కుస్తీ పోటీల్లో విజయం సాధించొచ్చన్న ధీమా పెరిగింది. అదే ఆత్మవిశ్వాసంతో అన్ని పోటీల్లో ధైర్యంగా పాల్గొంటూ విజయాలు సాధిస్తున్నా.

- గణేశ్‌ దేశాయ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని