తనకి ఆ మాట చాలు..!

విక్రమ్‌.. నా చిన్ననాటి స్నేహితుడు. ఒకే ఊరు. ఒకే స్కూలు. కలిసిమెలిసి పెరిగామిద్దరం. విక్రమ్‌ వాళ్ల నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఇంటి బాధ్యతలన్నీ వాళ్లమ్మే చూసుకునేది.

Published : 28 Mar 2020 04:17 IST

విక్రమ్‌.. నా చిన్ననాటి స్నేహితుడు. ఒకే ఊరు. ఒకే స్కూలు. కలిసిమెలిసి పెరిగామిద్దరం. విక్రమ్‌ వాళ్ల నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఇంటి బాధ్యతలన్నీ వాళ్లమ్మే చూసుకునేది. విక్రమ్‌, వాడి చెల్లిని కష్టపడి చదివించింది. మా స్నేహం పెరిగేకొద్దీ.. వాళ్లింట్లో నేనూ ఓ సభ్యుడినైపోయా. ఇంటర్‌ దాకా ఒకే చోట చదివాం. ఇంజినీరింగ్‌ కాలేజీలు వేరైనా.. ఒకే ఊరిలో ఉన్నాం. ఒకే గదిలో కలిసి ఉన్నాం. వాడి సంతోషం నాకు ఆనందాన్నిచ్చేది. నేను బాధపడితే వాడు కంటతడి పెట్టుకునేవాడు. ఆడుతూ, పాడుతూ బీటెక్‌ పూర్తి చేశాం. ఇద్దరికీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలొచ్చాయి. వాడికి హైదరాబాద్‌లో.. నాకు బెంగళూరులో!

చిన్ననాటి నుంచి కలిసి ఉన్న మమ్మల్ని ఉద్యోగాలు వేరు చేశాయి. మేమున్న నగరాల మధ్యే కాదు.. మా ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. పని ఒత్తిడితో ఫోన్‌లు కూడా చేసుకోలేనంత దూరం పెరిగిపోయింది. ఉద్యోగ పర్వంలో నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇన్నేళ్లలో వాడిని కలిసింది కేవలం రెండుసార్లే. ఫోన్లు చేసుకుంది కూడా వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. వాడితోనేనా.. మా ఇంట్లో వాళ్లతోనూ మాటలు తగ్గిపోయాయి. ఏడాదికి ఏ దసరాకో, సంక్రాంతికో వెళ్లడం తప్పితే.. ఊరు చూసింది లేదు. అమ్మ ఫోన్‌ చేసినా.. రెండు నిమిషాలు మాట్లాడి.. ‘బిజీగా ఉన్నానమ్మా! తర్వాత చేస్తాన’నేవాడ్ని. కెరీర్‌లో ఏదో సాధించాలనే పోరాటంలో ఇన్ని రోజులూ ఎవరినీ అంతగా పట్టించుకోలేదు.

ఓ రోజు ఆఫీస్‌లో పని ఉండగా.. ఫోన్‌ మోగింది. చూస్తే వాడే! ‘రేయ్‌! వెంటనే హైదరాబాద్‌ వచ్చేయ్‌! చాలా అర్జంట్‌’ అన్నాడు. విషయమేంట్రా అని అడిగితే.. ‘రారా’ అని కట్‌ చేశాడు. ఇక నేనేం ఆలోచించలేదు. ఆఫీస్‌ అయిపోగానే హైదరాబాద్‌కు బయల్దేరాను. ఎక్కడికి రావాలో అని అడిగితే.. ఏదో ఆస్పత్రి పేరు చెప్పాడు. ఇంకేం మాట్లాడలేదు. నేరుగా వాడు చెప్పిన ఆస్పత్రికి వెళ్లాను. వాడిని చూడగానే ఏదో గాబరాగా కనిపించాడు. మాటల్లోనూ ఏదో ఆందోళన. ‘అసలేమైందిరా!’ అని అడిగేలోపే వాడి చెల్లి నుంచి కాల్‌ వచ్చింది. ‘అన్నయ్యా! వెంటనే పైకిరా. అమ్మకు సీరియస్‌గా ఉంది’ అని చెప్పింది. హుటాహుటిన ఇద్దరం పైకెళ్లాం. ఐసీయూలోకి వెళ్లాడు వాడు. కారిడార్‌లో నేను. బయటకొచ్చి.. భారంగా నిట్టూర్చాడు. ‘అమ్మ దక్కేలా లేదురా! క్యాన్సర్‌ లాస్ట్‌ స్టేజ్‌. తన జీవితమంతా మాకే ధారపోసింది. ఆమెను సంతోషంగా చూసుకునే రోజు వచ్చేసరికి.. ఇదిగో ఇలా అనారోగ్యంతో నరకం అనుభవిస్తోంది. అని బావురుమన్నాడు. వాడిని ఓదార్చడం నావల్ల కాలేదు. గుండెలోతుల్లోంచి నాకూ దుఃఖం పొంగుకొచ్చింది. కన్నీళ్లు ఆగలేదు. వాడి అమ్మను చూసినప్పటి నుంచి మా అమ్మే కళ్లముందు కనిపించసాగింది. వెంటనే పక్కకెళ్లి అమ్మకు ఫోన్‌ చేశాను. ఎప్పుడూ తను చేయడం తప్ప నేను ఫోన్‌ చేసింది లేదు. అందుకే కాబోలు.. ఫోన్‌ ఎత్తగానే అమ్మ కంగారుగా ‘నాన్నా! ఎలా ఉన్నావురా? ఏమైంది?’ అని ప్రశ్నల వర్షం కురిపించింది. ‘బాగున్నానమ్మా! నాకేం కాలేదు. నీతో మాట్లాడాలనిపించి చేశాను’ అని చెప్పాక గానీ, అమ్మ కుదుటపడలేదు. ‘రోజూ నీకు ఫోన్‌ చేయాలని ఉంటుందిరా! నువ్వు బిజీగా ఉంటావని చేసేదాన్ని కాదు’ అంది. సమాధానం లేదు నా దగ్గర.

నా స్నేహితుడికి ధైర్యం చెప్పి.. అక్కడి నుంచి బెంగళూరుకు కాకుండా మా ఊరికి బయల్దేరా. తెల్లవారేసరికి ఇంటికి చేరిపోయా. చెప్పాపెట్టకుండా వచ్చిన నన్ను చూడగానే అమ్మ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. అమాంతం నన్ను హత్తుకొని.. కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఐ లవ్యూ లత’ అంటూ అమ్మను అలాగే పట్టుకొని నవ్వుతూ ఏడ్చేశాను. అంతకన్నా గొప్పగా చెప్పడానికి నా దగ్గర మాటల్లేవు. నిజానికి తనకామాట చాలు. నా జీవితం అమ్మ. నా శ్రేయస్సు తప్ప ఏం పట్టని అమ్మకు ఏమివ్వగలను. నాలుగు రోజులు ఊళ్లోనే ఉన్నా. నావెంట బెంగళూరుకు రమ్మన్నా! ‘మళ్లోసారి చూద్దాంలే’ అంది. పుట్టెడు బాధతో ఊరికి వచ్చిన నేను.. తేలికైన మనసుతో తిరుగు ప్రయాణమయ్యాను. అమ్మ ఎదురొచ్చింది. ఆనందం నాతోనే ఉందనిపించింది.
లాక్‌డౌన్‌తో ఇప్పుడెలాగో ఇళ్లకే పరిమితమయ్యాం. తీరిక లేని పనులతో, నిరంతర ఒత్తిళ్లతో గడిపే ఈ జీవితంలో అమ్మానాన్నతో ఇంతలా సమయం గడిపే అవకాశం మళ్లీ రాకపోవచ్చు. అందుకే ఈరోజులైనా వారితో ముచ్చటిస్తూ గడుపుదాం. ఇప్పుడదే మన పని. అంతలా పనుంటే ఇక బయటకెళ్లే అవసరమేముంది!!

- నిఖిల్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని