పనికిచోటు కల్పించారు

.. ఇలా చిన్న చిన్న పనుల కోసం అడగడం.. కాదనిపించుకోవడం. లేదంటే.. వాయిదా వేయడం....

Published : 04 Apr 2020 00:42 IST

థింక్‌ డిఫరెంట్‌●

* అక్క: రేయ్‌ తమ్ముడూ.. సూపర్‌ మార్కెట్‌కి వెళ్లి సరకులంట తేరా. నేను ప్రాజెక్టు చేసుకుంటున్నా. ప్లీజ్‌!!

తమ్ముడు: అన్ని సార్లూ నేనేనా? ఈ సారీ నువ్వే వెళ్లు. నాకూ పనుంది. పైగా.. ఆ క్యూలో నిల్చోవడం నా వల్ల కాదు!!●

* ఇల్లాలు: ఏమండీ.. చేపల కూర మా తమ్ముడికి చాలా ఇష్టం. ఇచ్చేసి వద్దాం పదండీ.

భర్త: ఛాన్సే లేదు. నేను బయటికి వెళ్లాలి. కావాలంటే.. వాళ్లనే రమ్మను.

* నాన్న: అభిఫ.. నాకు రేపు ఆఫీస్‌ మీటింగ్‌ ఉంది. నువ్వే తాతయ్యని హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి. రేపు ఎక్కడికీ వెళ్లకు.

అభి: అయ్యో.. నాన్న. నేను రేపు ఫ్రెండ్స్‌తో అవుటింగ్‌కి ప్లాన్‌ చేశా. నువ్వు ఎప్పుడూ ఇంతే!! ప్చ్‌!!!

* భవ్య: బాబాయ్‌.. నన్ను సంగీతం క్లాస్‌లో దింపవా.

బాబాయి: లేదే.. నేను అర్జెంటు పని మీద బయటికి వెళ్తున్నా. ఒక్క క్లాస్‌కి ఏం కాదులే. డుమ్మా కొట్టేయ్‌!!

.. ఇలా చిన్న చిన్న పనుల కోసం అడగడం.. కాదనిపించుకోవడం. లేదంటే.. వాయిదా వేయడం. ఓపిగ్గా వేచి చూడడం. అంతేనా! ఇంకేమీ చేయలేమా? జొమాటో, స్విగ్గీ, అమెజాన్‌.. వాళ్లు ఇంటికి వచ్చినట్టుగా.. ఎవరైనా ఇంటికి వచ్చి సాయం చేస్తే. అందుకు తగినంత ఛార్జ్‌ చేస్తే! ఇదేదో బాగుందే.. అలాంటి సర్వీసు ఏదైనా ఉందా? అవును.. ఉంది. మీరు ‘చోటు..’ అని పిలిస్తే చాలు. నిమిషాల్లో మీ ఇంటి ముందుంటారు. మీరు ఏ పని చెబితే అది ఇంటి మనిషిలా చేసి పెడతారు. ఇంతకీ ఎవరు వాళ్లంతా? ‘అప్నా చోటు’ టీమ్‌. ఏంటీ సర్వీసు? ఎలా వాడుకోవచ్చు? చదివేయండి.

ఏదైనా తిందాం అనిపిస్తే.. ఫోన్‌ తీస్తున్నాం. క్షణాల్లో ఆర్డర్‌ చేస్తున్నాం. నిమిషాల్లో గడప దగ్గరికి తెచ్చి పెడుతున్నారు. ఇదే మాదిరిగా.. రోజువారీ అవసరాలు ఏవైనా.. పని ఎలాంటిదైనా.. ఫోన్‌ తీసి.. అప్నా చోటు యాప్‌ ఓపెన్‌ చేసి.. చెబితే చాలు. నిమిషాల్లో మీ ముందు ఉంటారు. మీ ఇంటి మనుషుల్లానే పనుల్ని బాధ్యతగా చేసి పెడతారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే గృహిణులు, వృద్ధులూ ఎవ్వరిపైనా ఆధారపడకుండా ‘చోటు..’ ఉన్నాడులే అనే భరోసానిస్తూ సర్వీసు అందించాలనే లక్ష్యంతో ముందుకొచ్చారు. ప్రస్తుతం 11 మంది ఉద్యోగులతో బృందంగా పని చేస్తోందీ సంస్థ.

ఆలోచన ఇలా వచ్చింది...

సంగారెడ్డికి చెందిన క్రాంతి కుమార్‌ డిగ్రీ వరకూ చదివాడు. కంప్యూటర్‌ సర్వీస్‌ సెంటరే తనకున్న ఏకైక ఉపాధి మార్గం. రోజూ సాయంత్రం తన అన్న కూతుర్ని పాఠశాల నుంచి ఇంటికి తీసుకురావాల్సి వచ్చేది. దీంతో వ్యాపారం ఎక్కువగా జరిగే సమయంలో దుకాణం మూయాల్సి వచ్చేది. అంతేకాదు.. ఇంట్లో ఏదైనా చిన్న పని ఉన్నా దుకాణం మూయాల్సిందే. ఇది తన వ్యాపారంపై ప్రభావం చూపేది. తాను వెళ్లాల్సిన అవసరం లేకుండా పనులు చేసి పెట్టేందుకు ఓ మనిషి ఉంటే!! అనే ఆలోచన క్రాంతి కుమార్‌కు వచ్చింది. అదే ‘అప్నా చోటు.’

అందించే సర్వీసులు..

వి ఇవీ అని తేడా లేకుండా అన్ని పనులూ చేస్తాం. ఇంటికి సరుకులు తీసుకురావడం.. ఫుడ్‌ డెలివరీ.. మీసేవా పనులు.. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్లు.. ఇలా మీ అవసరం ఏదైనా బాధ్యతగా చేస్తాం. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి ఏదైనా పంపాల్సి వస్తే ‘అప్నా చోటు’నే గుర్తు రావాలి. అంతెందుకు.. పిల్లల్ని స్కూల్‌, ట్యూషన్స్‌కి తీసుకెళ్లి దిగబెట్టి రావాలన్నా మాకు ఫోన్‌ చేయొచ్ఛు ఇంట్లో వయసు మళ్లిన వాళ్లకి తరచూ బీపీ, షుగర్‌ టెస్టులకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీకు కుదరనప్పుడు మాకు చెప్పండి. మేము తీసుకెళ్లి పరీక్షలు చేయించి తీసుకొస్తాం. అత్యవసర సమయాల్లో మేము వారికి హాస్పిటల్స్‌లో తోడుంటాం కూడా. కావాల్సిన పరీక్షలు చేయించి క్షేమంగా ఇంట్లో దిగబెడతాం. ఇంటి అవసరాలు ఏవైనా.. మాకు చెప్పండి చాలు. కొబ్బరి బోండాలు, చెరకురసాలు, స్టేషనరీ, పిల్లల డైపర్లు.. ఇలా ఏం చెప్పినా.. గుమ్మం దగ్గరికి చేరవేస్తాం. అందుకు మేము ఛార్జ్‌ చేసేదీ కనిష్ఠంగా 30రూపాయలు.. గరిష్ఠంగా రూ.150. ఇప్పటికైతే సంగారెడ్డి, ఎం.ఎన్‌.ఆర్‌, గీతమ్‌, ఐఐటీ కాలేజీల పరిధిలోనే మా సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆరు నెలల్లోనే మంచి స్పందన వచ్చింది.. రోజుకు 100- 120 ఆర్డర్లు వస్తుంటాయి. ఫుడ్‌ డెలివరీ, పిల్లల్ని దిగబెట్టి మళ్లీ తీసుకురావడమే ఎక్కువ. దీన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

-క్రాంతికుమార్‌, అప్నాచోటు వ్యవస్థాపకుడు

లాక్‌డౌన్‌లోనూ సేవలు..

లాక్‌డౌన్‌ కాలంలోనూ కలెక్టర్‌ చొరవతో అప్నాచోటు సేవలు కొనసాగిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలోనూ ప్రజల అవసరాలు తీరుస్తూ అందరి మన్ననలూ అందుకుంటోందీ సంస్థ.

- త్రిగుళ్ల దివ్య జ్యోత్స్న, ఈనాడు జర్నలిజం స్కూల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు